Sunday, September 15, 2024

కుండపోత వాన

- Advertisement -
- Advertisement -

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.రాగల 24గంటల్లో ఉరుములు మెరుపులతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.గంటకు 40కిలోమీటర్ల వేగంతోకూడిన బలమైన గాలులు వీయనున్నట్టు తెలిపింది. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వారద్దని అధికారులు హెచ్చరించారు. అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపరి ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు తెలిపింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కమ్ముకున్న మబ్బులతో గ్రేటర్ హదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, పలు ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు వరద నీటితో మునిగిపోయాయి.ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంబించి పోయింది. ప్రజలు రోడ్లపై వాహనాలు నడిపేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఎండ వేడిమికి ఉపశమనం లభించింది. ఎండల ధాటికి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, ధర్మపురి, చిగురు మామిడి, బోయినపల్లి తదితర మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ విద్యుత్ సరఫరాకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. రెండు గంటల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొంతకాలం నుంచి వర్షాలు లేక ఎండు ముఖం పట్టిన పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసినట్లయింది. వర్షం పడడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్ హైదరబాద్‌లో జనజీవనం అస్తవ్యస్థం
జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుసింది. కుండపోతగా కురిసిన వర్షం, సిటీ రోడ్లను మరోసారి చెరువులుగా మార్చిదంది. మధ్యాహ్నం నుంచి మొదలైన వర్షం, క్రమంగా నగరమంతటా విస్తరించింది. సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, చిలకలగూడ, మారేడుపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్ ప్రాంతాల్లో జడివాన పడింది. ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.ఏకధాటిగా వర్షం కురువడం వల్ల ప్రధాన రహదారులపై నీరు చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపోవడంతో రహదారులపై వరద నీరు ప్రవహించింది. చాలాచోట్ల వాహనాలు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లోనూ వరుణుడు విరుచుకుపడ్డాడు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సనత్‌నగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లోనూ భారీ వర్షం పడింది. ఈ ప్రభావంతో రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు విడిచిపెట్టే సమయం కావడంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. రద్దీ ప్రాంతాలైన అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బయో డైవర్సిటీ, కోఠి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో భారీ వర్షంపై వాతావరణ శాఖ శుక్రవారం సాయంత్రమే రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షంతో రహదారులపై నీరు చేరకుండా జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఏమైనా ఇబ్బందులుంటే 040 – 21111111కు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

అత్యధికంగా చిగురుమామిడిలో 171మి.మి వర్షం:
రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్‌జిల్లా జిగురుమామిడిలో 171మి.మి వర్షం కురిసింది. మెదక్‌లో 129.8, కొయ్యూర్‌లో 109.5, పాతరాజంపేటలో 108.3, శనిగరంలో 94,పూడురులో 92.8, బికనూర్‌లో 88.5, ఏదులగట్టేపల్లిలో 87.5, హబీష్‌పూర్‌లో 84.3మి.మి వర్షం కురిసింది. చీకోడ్‌లో 83.5, ఇందుర్తిలో 82.8, మల్లాపూర్‌లో 80.3, పెద్దమ్‌పేట్‌లో 79.3, గుండిలో 77.8, వీణవంకలో 77.5 మి.మి వర్షం కురిసింది.
పటాన్‌చెరులో 61.5మి.మి:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పటాన్‌చెరులో అత్యధికంగా 61.5మి.మి వర్షం కురిసింది. గాయత్రి నగర్‌లో 45.8, గోల్కొడలో 42.8,గచ్చిబౌలిలో 42.8, హైదరాబాద్ యూనివర్శిటీ ప్రాంతంలో 34.8, ప్రశాంత్‌నగర్‌లో 30.8 మి.మి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News