Friday, May 3, 2024

రాష్ట్రానికి మరో వాన ముప్పు

- Advertisement -
- Advertisement -

Heavy rains in North Telangana for next 3 days

మూడురోజుల పాటు
ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం
అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మరో వాన ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం తూర్పు విదర్భ, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం సోమవారం తూర్పు విదర్భ, పరిసర ప్రాంతంలో కొనసాగుతూ ఉందని, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతిదిశ వైపుగా వంపు తిరిగి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లలో…

ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు నల్లగొండ, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్, మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే కొనసాగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలతో పాటు పురపాలక శాఖకు సంబంధించిన బృందాలను ఆయా జిల్లాలో అందుబాటులో ఉంచింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముప్పు ప్రాంతాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News