Monday, April 29, 2024

చిన్న తేడా వచ్చినా… అరే ఆర్ట్ ఫిలిం అంటారు

- Advertisement -
- Advertisement -

శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్.బి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్‌తో ఇంటర్వూ..


వ్యవసాయం లాభసాటి…
మన ముందు తరాలు వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి. కానీ నేడు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రైతు కొడుకు రైతు కావడానికి ఇష్టపడటం లేదనే పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఇతర వ్యాపార రంగాల మాదిరిగానే వ్యవసాయం లాభసాటి అనేది ఎవరూ గుర్తించడం లేదనే పాయింట్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా సాగుతుంది.
రైతుగా మారాలని…
చిన్నప్పటి నుండి వ్యవసాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న యువకుడిగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. రైతుగా మారాలనే ఆలోచనతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని అతను ఎందుకు వదులుకున్నాడు? ఈ క్రమంలో తండ్రి నుంచి అతనికి ఎలాంటి వ్యతిరేకత ఎదురైంది? అనేవి ఈ సినిమాలో ఆకట్టుకుంటాయి.
చక్కటి ప్రేమ కథ…
ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ మనసులను కదిలిస్తుంది. రైతు సమస్యలు, సమకాలీన అంశాలను ఇందులో ప్రస్తావించడం లేదు. అంతర్లీనంగా ఈ సినిమాలో చక్కటి ప్రేమకథ మిళితమై ఉంటుంది.
పూర్తి కమర్షియల్‌గా…
ఇలాంటి కథ రాయడం చాలా కష్టం. దాన్ని కమర్షియల్‌గా చెప్పడం ఇంకా కష్టం. చిన్న తేడా వచ్చినా.. అరే ఆర్ట్ ఫిలిం అంటారు. కానీ పూర్తి కమర్షియల్‌గా మంచి లవ్ ట్రాక్‌తో దర్శకుడు కిషోర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు.
తదుపరి చిత్రాలు…
ఈ ఏడాది నేను నటించిన మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాను. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ‘మహా సముద్రం’ 80 శాతం షూటింగ్ పూర్తయింది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నా. వీటితో పాటు తమిళంలో ఓ సినిమాను అంగీకరించాను.

Hero Sharwanand interview about Sreekaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News