‘జయం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ సదా (Sadaa). ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి ఆమె మెప్పించారు. అయితే తాజాగా సదా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. ఈయన మరణించి వారం పైనే అవుతోంది. కానీ, సదా ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడం ద్వారా విషయం బయటకు వచ్చింది.
‘‘నాన్న చనిపోయి వారం రోజులే అయినా.. నాకు ఓ యుగం గడిచినట్లు ఉంది. సినిమా అమ్మాయిలకు అంత సేఫ్ కాదు అని అనుకునే రోజుల్లోనే ఆయన కుటుంబాన్ని ఎదిరించి మరి నాకు అండగా నిలిచారు. అమ్మకు కుదరకపోవడం వల్ల షూటింగ్‌లకు నాతో పాటు రాలేకపోయేది. కానీ, నాన్న ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు. కొన్నేళ్ల పాటు నాతో షూటింగ్‌లకు వచ్చారు. తిరిగి అమ్మ నా బాధ్యతల్ని తీసుకున్న తర్వాత నాన్న ఓ చిన్న క్లినిక్ తెరిచి మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఎంతో మంది ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకున్నారు. నేను ఆయన కూతురు కావడంతో ఎంతో గర్వకారణమని అందరితో చెబుతుండేవారు. కానీ, ఈ రోజు ఆయన కూతురిగా నేను ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాను. తన చుట్టు ఉన్న వాళ్ల కోసం ప్రేమ, ఆప్యాయతని పంచిన ఆయనని చూసి గర్వపడుతున్నాను. ఆయన నిజంగా ఓ వెలకట్టలేని మనిషి. మిస్ యూ నాన్న’ అని సదా (Sadaa) ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టారు.
మహారాష్ట్రకు చెందిన సదా తండ్రి ముస్లిం కాగా తల్లి హిందు. ఈయన డాక్టర్‌గా పని చేసే వారు, తల్లి ప్రభుత్వ ఉద్యోగి. సదా తండ్రి మరణవార్త తెలిసిన సన్నిహితులు.. నెటిజన్లు ఆమెను ఓదారుస్తూ.. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Also Read : ‘కిష్కింధపురి-2’ తప్పకుండా వస్తుంది