Thursday, June 13, 2024

నేటి సాయంత్రం తల్లుల వనప్రవేశం

- Advertisement -
- Advertisement -

Medaram

 

వరంగల్ బ్యూరో: సమ్మక్క, సారలమ్మ జాతరకు నాలుగురోజులుగా భక్తజనం పోటెత్తింది. బుధవారం నుంచి శనివారం వరకు తల్లులను కోటిన్నరకుపైగా భక్తులు దర్శించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం భక్తుల పూజలందుకున్న వనదేవతలు వనప్రవేశం చేసి యథా స్థానాలకు చేరుతారు. ఇంతటితో ఈ జాతర ముగింపు పలికినట్లు అవుతుంది. ఈ సారి జాతరకు ఆరు రాష్ట్రాల ఆదివాసి ప్రజలే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ తమిళసై, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలు అధికారికంగా దర్శించుకొని తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. ఈ జాతరకు మాత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.75 కోట్లను కేటాయించి శాశ్వత పనులను చేపట్టారు. ప్రతి ఏటా జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆదివాసీ గిరిజన జాతరగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందినప్పటికీ కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తింపును ఇవ్వలేదు.

అయినా ఈసారి జరిగిన జాతరకు రాష్ట్ర ప్రభుత్వంపై నింద లేకుండా భక్తులు మాత్రం 20 ఏళ్ల క్రితం జరిగిన జాతర మాదిరిగానే తల్లులను దర్శించుకున్నారు. ఆదివాసి అంటేనే నమ్మకం. ఆ నమ్మకానికి ప్రతిరూపం సమ్మక్క, సారలమ్మలుగా మేడారం మహాజాతర కొనసాగుతుంది. బుధవారం రాత్రి సారలమ్మ లక్షలాది మంది భక్తుల నడుమ గద్దెకు చేరుకున్నాక 24 గంటల పాటు అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. గురువారం రాత్రి 9 గంటలకు సమ్మక్క అంగరంగవైభవంగా గద్దెకు చేరుకుంది. గతంలో సమ్మక్కను గద్దెకు తీసుకురావడానికి ఈసారి అధికార లాంఛనాలతో గద్దెకు తీసుకురావడంలో చాలా మార్పులు కనిపించాయి. సాక్షాత్తు ముగ్గురు మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులుగా సమ్మక్కకు ఆహ్వానం పలికారు. సమ్మక్కను చిలకలగట్టు నుంచి కిందికి తీసుకవచ్చినప్పటి నుంచి గద్దెకు చేర్చే వరకు అడుగడుగునా మంత్రులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మహాఘట్టాన్ని గట్టెక్కించారు.

శుక్రవారం ముఖ్యమంత్రి, ఇద్దరు గవర్నర్లు తల్లులను దర్శనం కోసం రావడంతో భారీగా ఏర్పాటు చేశారు. అటు భక్తులకు ఇటు ముఖ్యమంత్రి, గవర్నర్లకు దర్శనంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు మంత్రులు తగిన ఏర్పాట్లు చేసి సక్సెస్ అయ్యారు. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల దర్శనం భారీగా ఉంటుంది. అయినప్పటికి ఆదివాసీ సాంప్రదాయం ప్రకారంగా శనివారం రాత్రి తల్లులు యథాస్థానానికి చేరాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన క్రతువును పూజారులు చేపట్టి సమ్మక్కను చిలకలగట్టుకు చేరుస్తారు. సారలమ్మను కన్నెపల్లికి చేరుస్తారు. ఈ ఇద్దరు తల్లుల వనప్రవేశాన్ని చేయించడంలో గంటల సమయమే పడుతుంది. పగిడిద్దరాజు తన స్వగ్రామమైన పూనుగొండ్లకు వెళ్లడానికి కాలినడకన రెండు రోజుల సమయం పడుతుంది. గోవిందరాజును శనివా రం రాత్రే గుడికి చేరుస్తారు. నాలుగు రోజుల పండుగను లక్షలాది భక్తులు కనుల పండువగా మేడారంలో నిర్వహించుకొని తన్మయత్వం చెందారు.

తల్లుల పూజారులు మాత్రం మూడు వారాలుగా అమ్మవార్ల ఆధీనంలోనే ఉండిపోయారు. మళ్లీ బుధవారం మండమెలిగె కార్యక్ర మం వరకు పూజారులు తల్లుల ఆధీనంలోనే ఉంటారు. పక్షం రోజులకు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించి మహాజాతరకు ముగింపును పలుకుతారు. అయితే శనివారం తల్లుల వనప్రవేశం చేయడంతోనే మ హాజాతరకు ముగింపు పలికినట్లుగా అధికారులు, పూజారులు ప్రకటిస్తారు. అయినప్పటికి తల్లులను గద్దెలపై ద ర్శించుకోలేని లక్షలాది మంది భక్తులు వారం రోజుల వరకు మేడారం చేరుకొని మొక్కులు అప్పజెప్పుతూనే ఉంటారు. ప్రకృతి రూపంలో ఉన్న ఆదివాసి జాతరకు అన్నివర్గాల ప్రజల నుంచి రోజురోజుకు నమ్మకం పెరుగుతూ జాతరలో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

తల్లుల వనప్రవేశానికి అధికారుల ఏర్పాట్లు
సమ్మక్క, సారలమ్మల జాతర నిర్వహణలో రాష్ట్ర చీఫ్ సెక్రటరి, డిజిపిలు మేడారం జాతరలో ఉండి పర్యవేక్షించారు. సిఎం కెసిఆర్, ఇద్దరు గవర్నర్లు శుక్రవారం తల్లుల దర్శనం చేసుకొని వెళ్లిన తరువాత వారు కూడా వెళ్లారు. జాతర ఇన్‌చార్జ్ అధికారులుగా ఉన్న కలెక్టర్ కర్ణన్, ఎస్పి సంగ్రామ్‌సింగ్‌ల నేతృత్వంలోనే తల్లుల వనప్రవేశానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు. తల్లులు గద్దెలను వీడి వనప్రవేశం చేసే సమయంలో భక్తులకు అనుమానం రాకుండానే తల్లులను తీసుకెళ్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. కొంతమంది భక్తులకు మాత్రమే వనప్రవేశం చేసే పూజా కార్యక్రమాలు ప్రధాన ఘట్టం తెలుస్తుంది. ఆ సమయంలో తల్లులు వెళ్లిపోతున్నప్పుడు కూడా ఎదురెళ్లి పొర్లు దండాలు పెడుతూ వనదేవతలకు వందనాలు సమర్పించి సెలవు ప్రకటిస్తారు.

Huge Devotees at Medaram
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News