Saturday, April 27, 2024

జెబిఎస్ టు ఎంజిబిఎస్ మెట్రో మరో మెరుపు

- Advertisement -
- Advertisement -

Metro services

 

సాకారమైన ప్రయాణికుల కల

జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రాకపోకలు, ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్, నేటి ఉ. 6.30 గం.ల నుంచి ప్రయాణికులకు అనుమతి

హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రైలును శుక్రవారం జెబిఎస్ స్టేషన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో తొలి దశ మెట్రో ప్రాజెక్టు 72 కి.మీ.లు నాగోల్ నుంచి రాయదుర్గం, మియాపూర్ నుంచి ఎల్‌బినగర్ వరకు, జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ మూడు కారిడార్‌లు పూర్తయినట్టుగా హెచ్‌ఎంఆర్‌ఎల్ పరిగణిస్తున్నది. అయితే, మెట్రో ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మెట్రోరైలులో ఎంజిబిఎస్ స్టేషన్ వరకు ప్రయాణించారు. మార్గ మధ్యలో చిక్కడపల్లి స్టేషన్‌లో మెట్రో రైలు ఆగడంతో ఆయన రైలు నుంచి వెలుపలికి వచ్చి స్టేషన్ పరిసరాలను, అక్కడి ఏర్పాట్లు, నిర్మాణాన్ని పరిశీలించిన సిఎం తిరిగి రైలులోకి చేరుకున్నారు.

అనంతరం మెట్రో రైలు నేరుగా ఎంజిబిఎస్ స్టేషన్‌కు చేరుకుని నిలిచింది. వెంటనే సిఎం కెసిఆర్ రైలు నుంచి వచ్చి నేరుగా ఇంటర్ చేంజ్ స్టేషన్‌ను పరిశీలించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో ముఖ్యమంత్రితో మెట్రో, ఎల్ అండ్ టి అధికారుల బృందం ఫోటోలు దిగారు. ఆ స్టేషన్ పూర్తిగా పరిశీలించారు. అక్కడ సుమారు 30 ని.ల వరకు గడిపిన సిఎం కెసిఆర్ అనంతరం నేరుగా కిందికి చేరుకుని తన కాన్వాయ్‌లో వెళ్ళిపోయారు. కాగా ఈ మార్గంలో ప్రయాణం శనివారం వారం ఉ. 6.30 గం.ల నుంచి జెబిఎస్ స్టేషన్ నుంచి ఎంజిబిఎస్ స్టేషన్ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, హెచ్‌ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి, ఎంఎల్‌ఎలు, అధికారులు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

11కి.మీ.లు… 9 స్టేషన్‌లు…
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రతిపాదించిన 72 కి.మీ మార్గంలో 69 కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దేశంలోనే అతిపెద్ద రెండో మెట్రో కారిడార్‌గా నిలిచింది. ఎంజిబిఎస్ స్టేషన్ నిర్మాణం పలు ప్రత్యేకతలతో నిర్మించారు. 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో పూర్తిస్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్‌తో స్టేషన్‌ను నిర్మించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించే కారిడార్- 1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్ కింది అంతస్తుల ద్వారా ప్రయాణించగా, కారిడార్2 జెబిఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో సాగించే రైలు పైఅంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. ఐతే ఒక మార్గం నుంచి మరో మార్గం మారడానికి సులభమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్‌లెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ , కన్వీయెన్స్ అవుట్‌లెట్స్‌ను కాంకర్స్ లెవెల్‌లో నిర్మించారు.

మెట్రో మైలురాళ్ళు…
ఐదు దశల్లో 8 ఏళ్లలో హైదరాబాదు మెట్రో పూర్తి అయింది. 2007 మే 14న హైదరాబాద్ మెట్రో రైల్‌ను ఏర్పాటు చేశారు. 2008 సెప్టెంబర్ 19న మేటాస్ సంస్థతో అప్పటి ఉమ్మడి ఎపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2009 జూలై 7న సత్యం కుంభకోణం వెలుగుచూడడంతో మెట్రో ఒప్పందం రద్దు అయింది. 2010 జూలై 14న రెండో సారి టెండర్లను ఆహ్వానిచింది. 2010 సెప్టెంబర్ 4న ఎల్ అండ్ టితో ఒప్పందం చేసుకుంది. దీనికి 2012 ఏప్రిల్ 26న మెట్రో పనులకు భూమి పూజ చేశారు. 2012 నవంబర్ 25న మెట్రో పనులు ప్రారంభంకాగా 2017 జూలై 1న మెట్రో నిర్మాణ గడువు ముగిసింది.

అయితే పనులకు అనేక అవాంతరాలు ఏర్పడంతో 2018 నవంబరు వరకు నిర్మాణ పనులను పొడగించింది. 2017 నవంబర్ 28న తొలివిడతగా నాగోల్ రూట్ నుంచి మెట్రో రైల్ ప్రారంభంకాగా, 2018 సెప్టంబర్ 24న ఎల్‌బి నగర్ నుంచి రెండవ రూట్‌లో మొదలైంది. ఈ పనులు 2018 డిసెంబర్ -ఒప్పంద గడువు 2019 వరకు పొడగించారు. 2019 నవంబర్ 29న అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో రాయదుర్గం వరకు మెట్రో ప్రారంభమైంది. 2020 జనవరి జూన్ 2020 వరకు మెట్రో గడువు పొడగించడంతో జెబిఎస్ నుంచి ఎంజిబీఎస్ వరకు 11 కి.మీల మెట్రో రైల్ ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

పిపిపి పద్దతిలో నిర్మాణం…
హైదరాబాద్ మెట్రో పథకం ప్రపంచంలోనే పెద్దది. ఇప్పటి వరకు ప్రపంచలో మొత్తం రెండు వందలకుపైగా మెట్రో రైళ్లు ఉంటే అందులో 12 పిపిపి పద్దతిలోనే నిర్మించారు. అందులో హైదరాబాద్ మెట్రో రైలు అతిపెద్దది. దేశంలో చాలా నగరాల్లో మెట్రోరైల్ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో నిర్మించినవే ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం పబ్లిక్, ప్రైవేటు, పార్టనర్‌షిప్ (పిపిపి) విధానంలో నిర్మించారు. – 90 శాతం నిధులు ప్రైవేటు(ఎల్ అండ్ టి) సంస్థ పెట్టుబడి పెట్టగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 10 శాతం నిధులు వెచ్చించింది. మెట్రో ప్రాజెక్టు, మాల్స్ నిర్మాణంలో ఉన్న ఐదేళ్లతోపాటు 35 సంవత్సరాలకు ప్రభుత్వంతో ఎల్ ఆండ్ టీ లీజు ఒప్పందం చేసుకుంది. ప్రయాణికుల టిక్కెట్లు, షాపింగ్ మాల్స్ ద్వారా వచ్చే ఆదాయం 35 సంవత్సరాల పాటు ఎల్ అండ్ టి సంస్థకే చేరుతాయి.

Metro services from JBS to MGBS
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News