Wednesday, September 24, 2025

టి20లో ర్యాంకింగ్స్‌లో భారత్ హవా..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్లు మరోసారి ఆధిపత్యం చెలాయించారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్య అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో అసాధారణ ఆటతో అలరిస్తున్న భారత యువ సంచలనం అభిషేక్ శర్మ తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌ను సాధించాడు. అభిషేక్ తాజా ర్యాంకింగ్స్‌లో 907 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. రెండో ర్యాంక్‌లో ఉన్న ఫిలిప్ సాల్ట్ (ఇంగ్లండ్) కంటే అభిషేక్ చాలా ముందంజలో ఉన్నాడు. సాల్ట్ 844 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక పాకిస్థాన్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్‌వర్మ ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక స్థానం ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. జోస్ బట్లర్ (ఇంగ్లండ్) ఒక ర్యాంక్ కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) ఐదో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. పాథుమ్ నిసాంకా (శ్రీలంక) ఏడో, టిమ్ సిఫర్ట్ (న్యూజిలాండ్) 8వ, టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా) తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచారు. ఇక డెవాల్డ్ బ్రెవిస్ (సౌతాఫ్రికా) పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి 747 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆసియా కప్‌లో నిలకడగా రాణిస్తుండడంతో వరుణ్ అగ్రస్థానానికి ఢోకా లేకుండా పోయింది. న్యూజిలాండ్‌కు చెదిన జాకబ్ డఫీ రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అకీల్ హుస్సేన్ (విండీస్) కూడా తన మూడో ర్యాంక్‌ను కాపాడుకోవడంలో సఫలమయ్యాడు.

ఇక పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ఏకంగా 12 ర్యాంక్‌లు మెరుగు పరుచుకుని నాలుగో స్థానానికి చేరుకోవడం విశేషం. ఆసియాకప్‌లో అబ్రార్ నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో అతని ర్యాంక్ గణనీయంగా మెరుగు పడింది. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) ఐదో, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) ఆరో, హసరంగ (శ్రీలంక) ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రహ్మన్ ఏకంగా ఆరు ర్యాంక్‌లు మెరుగు పరుచుకుని తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. రషీద్ ఖాన్ ఒక స్థానం ఎగబాకి పదో ర్యాంక్‌లో నిలిచాడు. ఆల్‌రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్య (238) పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

Also Read: భారత మహిళ జట్టుకు ఆ లక్ష్యం సరిపోదు: మాజీ క్రికెటర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News