Monday, June 17, 2024

రియల్ బూమ్

- Advertisement -
- Advertisement -

 నాలుగు నెలల వ్యవధిలో
గణనీయంగా రిజిస్ట్రేషన్లు
గత ఏడాదితో పోల్చితే 15%
అధికం హైదరాబాద్ పరిధిలో
70శాతం, రంగారెడ్డి జిల్లాలో
46శాతం పెరుగుదల నమోదు
ట్రిపుల్ బెడ్‌రూం అంతకన్నా
ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్ల
కొనుగోళ్లలోనూ స్వల్ప
పెరుగుదల ఎన్నికల
సమయంలోనూ జోరుగా
సాగిన క్రయవిక్రయాలు
కోడ్ ముగియగానే రియల్
సంస్థలతో సిఎం భేటీ!

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రియల్ వ్యాపారం పుంజుకుంటోంది. అందులో భాగంగా 2024 సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతేడాది కంటే దాదాపు 15 శాతం అధికంగా ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌లను తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 46 శాతం రిజిస్ట్రేషన్‌ల పెరుగుదల నమోదయ్యింది. దీంతోపాటు హైదరాబాద్ పరిధిలోనూ 70 శాతం రిజిస్ట్రేషన్లు పెరగడం విశేషం.

కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు రియల్‌రంగం పడిపోయిందని చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడానికి సిఎం రేవంత్ పాలనలో పారదర్శకత చూపిస్తున్నారు. అందులో భాగంగా రియల్‌రంగం పడిపోకుండా, కొత్త పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రియల్‌రంగం నిపుణులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ వారికి కావాల్సిన అనుమతుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. నగరంలో ఆకాశహార్మాల నిర్మాణంతో పాటు పలు ఐటి కంపెనీల ఆఫీస్ స్పేస్‌ను అధికంగా వినియోగించుకునేలా ప్రభుత్వం తరపున సిఎం చర్యలు చేపట్టారు. ఎన్నికల కోడ్ ముగియగానే రియల్‌రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.

Increased registrations in four months

త్రిబుల్ బెడ్‌రూం అంతకన్నా గృహాల కొనుగోళ్లు ఎక్కువ

హైదరాబాద్ మార్కెట్‌లో మూడువేల చదరపు అడుగులు, (త్రిబుల్ బెడ్‌రూం అంతకన్నా) ఎక్కువ విస్తీర్ణం కలిగిన గృహాల కొనుగోలు చేసే వారి సంఖ్య స్వల్పంగా పెరిగింది. రెండు నుంచి మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా గతేడాది కంటే పది శాతానికి పైగా పెరిగాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేసే వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 70 శాతం పెరిగాయి. 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లను కొనుగోలు చేసే వారి శాతం తగ్గుముఖం పడుతున్నట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

జనవరి నుంచి ఏప్రిల్ వరకు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఎన్నికల సమయంలోనూ క్రయ,విక్రయాలు జోరుగా కొనసాగాయి. 2023లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 22,632 గృహాలు రిజిస్ట్రేషన్ జరగ్గా ఈ సంవత్సరం ఇదే సమయంలో 26,027 ఇళ్లు రిజిస్ట్రేషన్ అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది అంతకు ముందు ఏడాది కంటే 15 శాతం అధికమని అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా గతేడాది హైదరాబాద్ స్థిరాస్తిరంగంలో 15 శాతం పెరుగుదల నమోదు కాగా, ఈ ఏడాది 16 శాతం వృద్ధి నమోదైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గత 46 శాతం పెరుగుదల నమోదు కాగా, ఈ సంవత్సరం స్వల్పంగా తగ్గి 39 శాతానికే పరిమితమైంది. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో గతేడాది 39 శాతం పెరుగుదల నమోదు కాగా, ఈసారి ఏకంగా 46 శాతం వృద్ది కనబరిచింది.

బెంగళూరులో పెరిగిన ధరలు

బెంగళూరులో గతేడాది మొదటి త్రైమాసికంలో తొమ్మిది వేలుగా ఉన్న సగటు చదరపు అడుగు ధర ఈ సంవత్సరం పదిన్నర వేలకు ఎగబాకి 19 శాతం పెరిగింది. ఢిల్లీలో చదరపు అడుగు ధర 16 శాతం పెరుగుదల నమోదు చేయగా, అహ్మదాబాద్, పుణెలో 13 శాతం, హైదరాబాద్‌లో 9 శాతం, ముంబైలో 6 శాతం, కలకత్తాలో 7 శాతం, చెన్నైలో 4 శాతం పెరుగుదల నమోదయ్యింది. ధరల పెరుగుదల బెంగళూరులో అత్యధికంగా ఉండగా, ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ, పుణె, హైదరాబాద్‌లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News