Thursday, April 18, 2024

సమరోత్సాహంతో భారత్

- Advertisement -
- Advertisement -

కివీస్‌కు పరీక్ష, నేడు తొలి టి20
అక్లాండ్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్‌పై కన్నేసింది. న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌కు భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇటీవలే సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విరాట్ సేన జయకేతనం ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఇదే జోరును కివీస్ సిరీస్‌లోనూ కనబరచాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఘోర పరాజయం చవిచూసిన ఆతిథ్య న్యూజిలాండ్‌కు ఈ సిరీస్ సవాలుగా తయారైంది. బలమైన భారత్‌ను ఓడించాలంటే కివీస్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం కూడా న్యూజిలాండ్‌కు ప్రతికూలంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న టీమిండియాను ఓడించడం కివీస్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. అయితే టి20 ఫార్మాట్‌లో కివీస్‌కు భారత్‌పై మంచి రికార్డే ఉంది. ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని కివీస్ భావిస్తోంది. రెండు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టు కోవడంతో సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయం.
ఓపెనర్లే కీలకం
ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లే కీలకంగా మారారు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో ఈసారి లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మలపైనే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రాహుల్, రోహిత్‌లు అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా జట్టు వీరి నుంచి ఇలాంటి ప్రదర్శనే కోరుకుంటోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరిద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా భారత్‌కు భారీ స్కోరు తథ్యం. అయితే బౌన్స్‌కు సహకరించే కివీస్ పిచ్‌లపై వీరు ఎలా ఆడుతారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
కోహ్లి జోరు సాగాలి
మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్‌లో పరుగుల వరద పారించిన కెప్టెన్ విరాట్ కోహ్లి కివీస్‌పై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి జట్టుకు చాలా కీలకమని చెప్పక తప్పదు. ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా కోహ్లికి ఉంది. కివీస్‌పై కూడా చెలరేగాలనే లక్షంతో కోహ్లి కనిపిస్తున్నాడు. కివీస్ వంటి టి20 స్పెషలిస్ట్ జట్టును ఓడించాలంటే టీమిండియా సమష్టిగా పోరాడాల్సిందే. ధావన్ సేవలు కోల్పోయిన నేపథ్యంలో కోహ్లి బాధ్యత మరింత పెరిగింది. జట్టును ముందుండి నడిపించాల్సిన పరిస్థితి కోహ్లిపై నెలకొంది. ఫార్మాట్ ఏదైనా పరుగుల సునామీ సృష్టించడం అలవాటుగా మార్చుకున్న కోహ్లి చెలరేగితే మాత్రం కివీస్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు.
ఇదే మంచి ఛాన్స్
ఇక, యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే తదితరులకు ఈ సిరీస్ చాలా కీలకంగా మారింది. కొంత కాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్న రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లకు కివీస్ సిరీస్ పరీక్షగా తయారైంది. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో స్థానాన్ని కాపాడు కోవాలంటే కివీస్‌పై మెరుగ్గా రాణించాల్సిన పరిస్థితి వీరిపై నెలకొంది. ఇక, వికెట్ కీపర్ పంత్‌కు అయితే సిరీస్ చావోరేవోగా తయారైందనే చెప్పాలి. కీపర్‌గా, బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ అదరగొడుతున్న నేపథ్యంలో పంత్ కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే సంజు శాంసన్ రూపంలో అతనికి పోటీ నెలకొంది. తాజాగా రాహుల్ కూడా పోటీగా తయారయ్యాడు. పంత్ ఏమాత్రం విఫలమైనా జట్టులో చోటు కోల్పోక తప్పదు.
బౌలింగే బలం
కొంతకాలంగా అసాధారణ రీతిలో చెలరేగి పోతున్న భారత బౌలర్లు కివీస్ సిరీస్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తున్నారు. సీనియర్లు మహ్మద్ షమి, జస్‌ప్రిత్ బుమ్రాలతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. శార్ధూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనిలు కూడా కొంత కాలంగా నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నారు. చాహల్, సుందర్, కుల్దీప్, జడేజాలతో స్పిన్ విభాగం కూడా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న టీమిండియా సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచనా వేయలేం
ఇదిలావుండగా ఆతిథ్య న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. సొంత గడ్డపై కివీస్ ఎప్పుడూ ప్రమాదకర జట్టే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక, టి20 ఫార్మాట్‌లో అయితే కివీస్‌కు భారత్‌పై కళ్లు చెదిరే రికార్డు ఉండనే ఉంది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు కివీస్ సిద్ధమైంది. కెప్టెన్ విలియమ్సన్, రాస్ టైలర్, మన్రో, మార్టిన్ గుప్టిల్, గ్రాండోమ్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక టిమ్ సౌథి, సాంట్నర్, ఐష్ సోధి, బన్నెట్ తదితరులతో బౌలింగ్ కూడా ఎంతో బలంగా కనిపిస్తోంది. దీంతో భారత్‌కు సిరీస్‌లో గట్టి పోటీ తప్పక పోవచ్చు.

IND vs NZ 1st T20 Match Today at Oakland

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News