Thursday, April 25, 2024

భారత్‌కు సవాల్

- Advertisement -
- Advertisement -

 

భారత్‌కు సవాల్.. సిరీస్‌పై సఫారీ కన్ను
నేడు రాంచీలో రెండో వన్డే
రాంచీ: దక్షిణాఫ్రికాతో ఆదివారం రాంచీలో జరిగే రెండో వన్డే ఆతిథ్య టీమిండియాకు సవాల్‌గా మారింది. తొలి వన్డేలో ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ చావో రేవోగా తయారైంది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇక ఇప్పటికే మొదటి వన్డేలో విజయం సాధించిన పర్యాటక సౌతాఫ్రికా ఈసారి కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. లక్నో మ్యాచ్‌లో భారత్ విజయం కోసం చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో సఫారీ బౌలర్లు అద్భుత బౌలింగ్‌ను కనబరచడంతో టీమిండియాకు ఓటమి ఎదురైంది. ఇక మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్ పోరుకు సిద్ధమైంది. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుకు సాగాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు ఈసారి బ్యాట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు జట్టుకు కీలకంగా మారారు. కెప్టెన్ ధావన్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. బ్యాట్‌తో పాటు జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. తొలి వన్డేలో నత్తనడక బ్యాటింగ్‌తో విమర్శలను ఎదుర్కొన్న యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్‌లకు కూడా మ్యాచ్ కీలకంగా మారింది. ఈసారి ధాటిగా బ్యాటింగ్ చేసి విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాలని వారు భావిస్తున్నారు. మరోవైపు మొదటి వన్డేలో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, శార్దూల్ ఠాకూర్‌లు ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో ఈ ముగ్గురు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒత్తిడిని సయితం తట్టుకుంటూ చివరి వరకు జట్టు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన శాంసన్‌పై ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. శాంసన్ మరోసారి రాణిస్తే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. బ్యాటింగ్ బాగానే ఉన్న బౌలర్ల వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. లక్నో వన్డేలో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సిరాజ్, అవేశ్ ఖాన్, బిష్ణోయ్ తదితరులు తొలి మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. వీరి బౌలింగ్‌లో సఫారీ బ్యాటర్లు భారీగా పరుగులు పిండుకున్నారు.
జోరుమీదుంది..
మరోవైపు సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దక్షిణాఫ్రికా సమతూకంగా కనిపిస్తోంది. క్వింటన్ డికాక్, మలన్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్‌క్రామ్ తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ బలంగా ఉంది. తొలి మ్యాచ్‌లో డికాక్, క్లాసెన్, మిల్లర్‌లు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక రబడా, పార్నెల్, కేశవ్ మహారాజ్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

IND vs SA 2nd ODI Today in Ranchi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News