Saturday, April 20, 2024

భారత-చైనా యుద్ధానికి అరవై ఏళ్లు

- Advertisement -
- Advertisement -

1962 అక్టోబరు 20న ప్రారంభమై 1962 నవంబరు 21 న ముగిసిన భారత -చైనా యుద్ధం జరిగి 60 సంవత్సరాలు పూర్తి అయింది. ఆ యుద్ధం గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అవసరమా? అంటే అవసరమే. అప్పటి జ్వాలలు ఇప్పటికీ పూర్తి గా సమసిపోలేదు. అప్పటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు కనుక ఆ చరిత్రను సమీక్షించుకోవడం అవసరమే. తప్పులు దిద్దుకుని కొత్త అధ్యాయం ఆరంభించటం అవసరం. ఇప్పుడైనా మన ప్రజలకు వాస్తవాలు తెలియటం అవసరం. విస్తృత ప్రచారంలో వున్న అనేక తప్పుడు అభిప్రాయాలను తొలగించి సానుకూల వాతావరణం ఏర్పరచడం పరిష్కారానికి చాలా అవసరం.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 30 సంవత్సరాలు, దాని చారిత్రక విభాగానికి అధిపతిగా పని చేసిన అవతార్ సింగ్ భాసిన్ పదవీ విరమణ తరువాత ‘నెహ్రూ, టిబెట్ అండ్ చైనా’ అనే పుస్తకాన్ని జూన్ 2021 లో ప్రచురించారు. 403 పేజీల పుస్తకంలో చారిత్రక పత్రాల భాండాగారాల నుండి సేకరించిన అనేక వివరాలు అందించారు. అనేక సంవత్సరాల అధ్యయనం, ఆర్కైవల్ పరిశోధనల ఆధారంగా 1949 నుండి 1962 లో ఇండో -చైనా యుద్ధం వరకు జరిగిన సంఘటనలను దాని తదనంతర పరిణామాలను విశ్లేషించి ‘చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించిన అన్ని ఆర్కైవ్ రికార్డులను పూర్తిగా బహిర్గతం చేయండి.వాటి ద్వారా భారత దేశం గతంలో తీసుకున్న వైఖరి హేతుబద్ధమైనది కాదనీ, చైనా పూర్తిగా మోసపూరితమైనది కాదనీ తెలుస్తుంది, దాని వల్ల భూభాగాలు ఇచ్చిపుచ్చుకునే పరిష్కారాన్ని అంగీకరించటానికి ప్రజలు సిద్ధమవుతారని అవతార్ సింగ్ భాసిన్ సూచిస్తున్నారు.

రెండు దేశాల మధ్య పొడవైన సరిహద్దు వుంది, దాన్ని స్పష్టంగా గుర్తించ లేదు, నిర్వచించ లేదు లేదా ధ్రువీకరించలేదు. 1959- 62 మధ్య కాలంలో వివాదాస్పదమైన (హాట్ స్పాట్) ప్రాంతాలలో ఒకటిగా వున్న పశ్చిమ సెక్టార్‌లోని గాల్వన్ లోయ వద్ద, నాలుగు దశాబ్దాల సాపేక్ష ప్రశాంతత తరువాత, 2020లో మళ్ళీ హింస చెలరేగింది. అంటే ఇన్ని సంవత్సరాల ప్రశాంత సమయంలో కూడా సరిహద్దులు నిర్ణయించుకోలేకపోయాము అని రాశారు. తూర్పు సెక్టార్‌లో బ్రిటిష్ ఇండియా -టిబెట్‌ల మధ్య మెక్ మహోన్ గీసిన రేఖను, సిమ్లా కన్వెన్షన్‌ను చైనా ఎన్నడూ గుర్తించ లేదు అని ఆయన స్పష్టం చేశారు. 1954లో నెహ్రూ ప్రభుత్వం చైనాతో ‘టిబెట్ వాణిజ్య ఒప్పందం’ పై సంతకం చేసింది. సరిహద్దు సమస్యను లేవనెత్తడానికి భారత దేశానికి ఇది ఒక అవకాశం, కానీ భారత్ ఆ ప్రస్తావన చేయలేదు.

అప్పటికే మెక్ మహోన్ రేఖను భారత అంతర్జాతీయ సరిహద్దుగా బహిరంగంగా ప్రకటించామన్నది నెహ్రూ వైఖరి. దాన్ని చైనా ఏనాడూ ఒప్పుకోలేదు కనుక సరిహద్దుల గురించి చర్చించడం మంచిదని నాటి విదేశాంగ శాఖసెక్రటరీ జనరల్ గిరిజా శంకర్ బాజ్‌పాయ్ ఇచ్చిన సలహాను ఆయన తోసిపుచ్చారు. అంతేకాదు దౌత్యకార్యాలయాన్ని కాన్సులేట్‌గా మార్చి తన సైనిక ఎస్కార్ట్‌ను ఉపసంహరించుకోవడానికి భారతదేశం అంగీకరించింది. టిబెట్ చైనాలో అంతర్భాగం అని ప్రకటించింది.
1960 ఏప్రిల్‌లో సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి నెహ్రూ, చైనా ప్రధాని ఝౌఎన్ లై ల మధ్య ఢిల్లీలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. సరిహద్దుల నిర్ధారణ గురించి చైనా పట్టుదలగా వుందని, పరిష్కారం కోసం అవసరమైతే కొన్ని మార్పు చేర్పులకు సిద్ధంగా వుందని తెలియగానే నెహ్రూ వైఖరి గట్టిపడింది.

శిఖరాగ్ర సమావేశంలో ఝౌ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవటానికి, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ‘మెక్ మహోన్ రేఖపై భారత దేశం చేస్తున్నవాదనను పునఃసమీక్షించి ఒక ఒప్పందానికి రావడానికి అంగీకరించాడు, బదులుగా పశ్చిమ సెక్టార్- అక్సాయ్ చిన్-పై తమ వాదనలను భారత్ గుర్తించాలని ఆయన కోరాడు. ‘1954 వరకు ఇక్కడ సరిహద్దును నిర్వచించలేదని సర్వే పటాలు చూపిస్తున్నాయి’ అని చైనా బృందం ఎత్తి చూపించింది. అక్సాయ్ చిన్ చైనాకు అవసరమైనది, ఎందుకంటే ఇది పశ్చిమ టిబెటును -జిన్ జియాంగ్ ప్రావిన్సులను అనుసంధానించే భూభాగం. కానీ చైనా ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారు. దానితో ‘ఒక్క వివాదాన్ని కూడా పరిష్కరించని ఆ చర్చలు విఫలమయ్యాయి’. అప్పటి మన వాదనలు ఆధార రహితమూ, వాస్తవ దూరమూ అని భాసిన్ అనేక రుజువులు చూపారు.

ఆ పై నెహ్రూ రెండు ముఖ్యమైన తప్పిదాలు చేశారు. అవి మెక్ మహోన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దు అని తనకు తానే నిర్ధారించి, దాన్ని సమర్ధించుకుంటూ ఏకపక్ష చర్యలు తీసుకోవడం; పశ్చిమ సెక్టార్‌లో సరిహద్దు స్థితిని మార్చి, (కొత్త మ్యాపులు ప్రచురించడం) ముందుకు దూసుకుపోయే ఫార్వర్డ్ విధానాన్ని ప్రారంభించడం. ‘బ్రిటిష్ వారసత్వంగా వచ్చిన సౌకర్యాలు, భూభాగాలు నిరంకుశ, వంచన పూర్వక సామ్రాజ్యవాద విధానాల ఫలితమే అనితెలిసినప్పటికీ వాటిని భారత్‌కు అట్టిపెట్టాలని నెహ్రూ ప్రయత్నించారు. కొన్ని ప్రాంతాలు, సర్వే పటాలలో వున్నా లేకున్నా వాడుక రీత్యా మనవే అని వాదించారు. సరిహద్దుల గురించి మొండి దృక్పథాన్ని అవలంబించారు. ‘అక్సాయ్ చిన్ అని పిలువబడే 15,000 చదరపు మైళ్ళ ప్రాంతం నిర్వాసిత ప్రాంతం, అక్కడ ఒక్క గడ్డిపరక కూడా పెరగదు, వాస్తవానికి ఆ పర్వత ప్రాంతంలోకి భారతదేశానికి ప్రవేశం లేదని నెహ్రూ పలుమా ర్లు అంతకు ముందు పేర్కొన్నారు.

వాస్తవంగా ఆ ప్రాంతాలు మన చేతిలో లేవనే విషయాన్ని కూడా విస్మరించారు. ఉదాహరణకి 1950లలో ఇక్కడ చైనీయులు 750 -మైళ్ళ కనెక్టర్ రహదారిని నిర్మించుకున్నారు. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నామని చెప్పుకున్నప్పటికీ భారత ప్రభుత్వం ఏడు సంవత్సరాల ఈ రహదారిని నిర్మాణంలో ఉన్నప్పుడు గమనించలేదు, ఈ పరిస్థితిని భాసిన్ ‘ఒక రహస్యం’ అని పేర్కొన్నాడు. మన భూభాగమే అయితే ఇది తెలియకపోవటం సాధ్యమేనా? 1957లో భారతదేశం దానిని తెలుసుకున్నప్పుడు కూడా గట్టిగా నిరసన తెలిపింది లేదు అని ఎ.జి. నూరాని తెలిపారు. ఇలాటి విధానాలతో కయ్యానికి దిగటం వల్లనే అది అవమానానికి, నిరుత్సాహానికి, దేశానికి వినాశకరమైనదిగాను పరిణమించింది’. ఏకపక్షంగా ముందుకు వెళ్ళినా ఆ ప్రాంతాలను రక్షించుకోవడానికి కావలసిన సైనిక సామర్థ్యాలను మాత్రం నెహ్రూ ప్రభుత్వం నిర్మించలేదు అని చెబుతున్నారు.

యుద్ధంలో చైనా మిలిటరీ విజయాలు సాధిస్తున్నప్పటికీ చైనా ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ చేసి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవటంతో అదిముగింపుకు వచ్చిందనే అంశం గమనించాలి. ‘1962 నవంబర్ 21 నుంచి చైనా-భారత సరిహద్దు వెంబడి చైనా సరిహద్దు గార్డులు కాల్పులను నిలిపివేస్తారు. 1959 నవంబరు 7 న, చైనా- భారత దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖకు 20 కిలోమీటర్ల లోపలికి చైనా సరిహద్దు రక్షక దళాలు 1962 డిసెంబరు 1 నుండి ఉపసంహరించుకుంటాయి. తూర్పు సెక్టార్‌లో, వారు అక్రమ మెక్ మహోన్ రేఖకు ఉత్తరాన ఉన్న తమ ప్రస్తుత స్థానాల నుండి ఉపసంహరించుకుని ఆ రేఖ నుండి ఇరవై కిలోమీటర్లు వెనక్కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.మధ్య, పశ్చిమ సెక్టార్లలో కూడా చైనా సరిహద్దు గార్డులు వాస్తవాధీన రేఖ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటారు…’ అని ఝవ్ ఎన్ లై ప్రకటించారు. చైనా తాను యుద్ధంలో సాధించిన ప్రాంతాలను తన కింద ఉంచుకోకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. భారత్‌తో సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకోవాలని భావించి ఈ రాజకీయ నిర్ణయం చేసింది.

ఈ యుద్ధ కారణాలు, మిలిటరీ కదలికల గురించి వివరిస్తూ చైనాపై భారత యుద్ధం (నేవెల్లీ మాక్స్వెల్), హిమాలయన్ బ్లండర్ (బ్రిగేడియర్ జె.పి. దాల్వీ) ద ఆన్ టోల్ డ్ స్టోరీ (లె. జనరల్ బి.ఎం. కౌల్) వంటి పుస్తకాలు గతంలో వచ్చాయి. 2020 మే లో జరిగిన గాల్వాన్ సంఘటనల అనంతరం తిరిగి భారత- చైనా సరిహద్దు వివాదాల గురించి అనేక పుస్తకాలు వెలువడ్డాయి. వాటిలో పేర్కొన దగ్గవి ఇండియా వర్సెస్ చైనా : వై దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ (అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు, కాంతి ప్రసాద్ బాజ్ పాయ్), ది లాంగ్ గేమ్: హౌ ది చైనీస్ నెగోషియట్ విత్ ఇండియా (భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, విజయ్ కేశవ్ గోఖలే) కంటెస్టెడ్ లాండ్స్: ఇండియా, చైనా, అండ్ ద బౌండరీ డిస్ప్యూట్ (రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ అధికారి, మారూ ఫ్రజా) ఇవన్నీ 2021లో ప్రచురించారు. ఈ దీర్ఘకాల ప్రాదేశిక వివాదం చరిత్రను వీరు లోతుగా పరిశీలించారు.

వారి రాజకీయ అభిప్రాయాలు, విధానాలు ఏవైనా ఈ రచయితలు, నాటి భారత ప్రభుత్వం నెహ్రూ నాయకత్వంలోదూకుడుగా వ్యవహరించిందని సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవటానికి సంసిద్ధమైన చైనాను మొండిగా తిరస్కరించి ఒక బంగారు అవకాశం పోగొట్టుకున్నదని భావించారు. ఇదంతా నెహ్రూ అహంభావం వల్ల, చైనాపై వున్న తప్పుడు అంచనాల వల్ల జరిగిందని వారు చెబుతున్నారు. కానీ అప్పటి అమెరికా ప్రభుత్వ అభిప్రాయాలు, సోవియట్- చైనా విభేదాల నేపధ్యంలో సోవియట్, ఇండియా పాలకులపై చూపిన ప్రభావాల పాత్ర ను కూడా పరిగణించాలి. కొందరు రచయితలు ఆ అంశాలను కూడా గుర్తించి వివరించారు. ప్రస్తుత భారత ప్రభుత్వం నెహ్రూని తూర్పార బట్టి సరిహద్దులే కాదు దేశ సమస్యలన్నీటికీ ఆయన, కాంగ్రెస్ కారణమని తమ ఎజండాకు అనుకూలంగా చరిత్రను పాక్షిక దృష్టి తో ప్రచారం చేస్తున్నది.

నెహ్రూ విధానాలను విమర్శించడం లో ఈ పుస్తకాలు కూడా ప్రస్తుత ప్రభుత్వ వాదనలకు దగ్గరగా వున్నాయి. కానీ ఈ రచయితలు విస్మరించిన అంశం, ఇప్పటి ప్రభుత్వం కూడా అప్పటి నెహ్రూ ఫార్వర్డ్ పాలసీనే, ఆయన చేసిన వాదనలనే అనుసరిస్తున్నది. నిజమైన జాతీయవాదం తో కాక అమెరికా సామ్రాజ్యవాదుల వ్యూహంలో భాగం గాను, చైనాను కట్టడి చేసి, తాము ప్రాంతీయ ఆధిపత్య శక్తిగా ఎదగాలనే తాపత్రయంతోను దుందుడుకు విధానాలనే దేశ భక్తి పేర అనుసరిస్తున్నది.
చైనా ఏ భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేదు, సరిహద్దులు దాటలేదు అని మోడీ; వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) అలైన్మెంట్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఈ కారణంగా ఇరు పక్షాలు ఎల్‌ఎసి వెంబడి గస్తీ నిర్వహించటంతో ఘర్షణ జరిగిందని, ఎటువంటి చొరబాట్లు లేవని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 2020 జూన్ 2న ప్రకటించారు.

భారత దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారాయణన్, భారత- చైనా సరిహద్దుతో కీలకమైన సమస్య ఏమిటంటే, ఇది గుర్తించబడనిదీ, నిర్వచించబడనిదీ అని చెప్పారు. యుపిఎ -2 హయాంలో ఆర్మీ ఛీఫ్ గాను, ఎన్‌డిఎలో మంత్రి గాను వున్న జనరల్ వికె సింగ్ కొన్ని అతిక్రమణలు ఉన్నాయి కానీ అవి చొరబాట్లు కాదు. ఎల్‌ఎసి భూమిపై మార్క్ చేయబడలేదు, దానిపై ఎటువంటి ఒప్పందం లేదు’ అని అన్నారు. 2019 అక్టోబర్‌లో రిటైర్ అయిన కల్నల్ ఎస్. డిన్నీ: శాటిలైట్లు అబద్ధాలు చెప్పవు.. భారత సైన్యంలో టైమ్ టెస్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంది… ఈ ప్రాంతాల్లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నట్లుగా లేదా స్వాధీనం చేసుకున్నట్లుగా ఒక్క చిత్రం కూడా లేదు అని జూన్ 15, 2020 న రాశాడు. కానీ చైనాను పెద్ద దురాక్రమణ దారునిగాను, వెన్నుపోటు పొడిచే దేశంగాను ఎంత ఉధృత ప్రచారం చేస్తున్నారో మనకు తెలుసు.
ఈ సందర్భంలో భారత దేశంలోని కొన్ని శక్తులు, మరీ ముఖ్యంగా అవకాశవాద కాంగ్రెస్, యుద్ధోన్మాద (జింగోయిస్ట్) ప్రకటనలు చేస్తున్నాయి, చైనాకు ప్రధాని లొంగుబాటు అని ఎలుగెత్తుతున్నాయి.

సామ్రాజ్యవాద వాదనలను ప్రచారం చేసి వాటికి ప్రజామోదం కలిగే వాతావరణం సృష్టిస్తున్న బిగ్ మీడియాలో ఒక భాగమూ, ద్వంద్వ- నాలుక గల పాలక వర్గమూ చైనా వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నాయి. పరిష్కారం వైపు అడుగులు వేస్తే దేశద్రోహ చర్యగా భావించేలా రాజకీయ వక్రీకరణ చేస్తున్నాయి.1962 యుద్ధంలో కూడా ఆనాడు ప్రతిపక్షంలో వున్న జనసంఘ్ (నేటి బిజెపి మాతృసంస్థ) ఇలాంటి ప్రకటనలతోనే కాంగ్రెస్‌ను విమర్శించేది. అంటే చైనాతో పరిష్కారం కంటే తమ రాజకీయ ప్రయోజనమే ముఖ్యం అని ఈ పార్టీలు భావిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా వాస్తవాల ఆధారంగా కాకుండా భావోద్వేగాలతోను, మిథ్యా ప్రతిష్ఠతోను వ్యవహరిస్తున్నామని కొందరు రచయితలు భావిస్తున్నారు. భారతదేశం -చైనా సరిహద్దు వివాదానికి పునాది ఒకటిన్నర శతాబ్దపు చరిత్రలో వుంది. స్వాతంత్య్రానికి ముందు వున్న వలస పాలకులు అనుసరించిన విధానాలలో ఉంది. స్వాతంత్య్రం తరువాతి పాలకులు వలసవాద పోకడలు, ఆ వారసత్వం వదలక పోవడంలో వుంది. సమస్య సంక్లిష్టమైనది. చారిత్రకంగా సంక్రమించింది. నిజమే కానీ, 75 సంవత్సరాలలో పరిష్కరించుకోజాలని సమస్య మాత్రం కాదు. ఇది రాజకీయ విజ్ఞతతో, శాంతికాంక్షతో తీర్చుకోవాల్సిన సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు నలభై శాతం ఉన్న భారత దేశం, చైనాల మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా వుంటేనే ప్రపంచంలో శాంతి నెలకుంటుంది.

1962 యుదం తర్వాత ఇద్దరి మధ్య దశాబ్దాల తరబడి ‘అశాంతికరమైన శాంతి’ నెలకొని వుంది. కానీ ఇటీవలి సంవత్సరాలలో అశాంతి పెరుగుతున్నది. దీనికి నాలుగు కీలకమైన అంశాలను పరిశీలించాలి: సరిహద్దుపై కుదరని అంగీకారం; అంతర్జాతీయ ప్రభావాలు ముఖ్యంగా అమెరికా, రష్యాలతోమారుతున్నవారి భాగస్వామ్యాలు; ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్ధిక, వాణిజ్య, రాజకీయ ప్రాబల్యాలలో అసమానతలు; ఇరువురి మధ్య వున్న దురభిప్రాయాలు. ఒక వంక ఇరు పక్షాల మధ్య సంభాషణలు జరుగుతున్నాయి, కొంత మేరకు సైన్యాలను వెనుకకు రప్పించి సరిహద్దులలో ఉద్రిక్తతలు సడలిస్తున్నారు. కానీ మరో పక్క భారత ప్రభుత్వం తైవాన్, దలైలామాలను అడ్డం పెట్టుకుని చైనా వ్యతిరేక ప్రచారం కొనసాగిస్తున్నది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి)కి 100 కిలోమీటర్ల దాపులో ఉత్తరాఖండ్‌లో భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను (యుద్ధ అభ్యాస్) జరిగింది. ఇది సరిహద్దుల వద్ద శాంతి కోసం 1993, 1996 లలో చైనా, భారత్‌లు కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలస్ఫూర్తిని ఉల్లంఘిస్తోందని, ద్వైపాక్షిక విశ్వాసాన్ని వమ్ము చేస్తుందని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘నేటి యుగం యుద్ధాల యుగం కాకూడదు’ అని ప్రధాని మోడీ అంటూ వుంటారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అన్నప్పటికీ, ఇండియా సారథ్యం వహించనున్న జి -20 డిక్లరేషన్‌లోకి కూడా అది ప్రవేశించింది. ఇది భారతదేశం అనుసరించే సూత్రం అవుతుందా? ప్రవచనంగా మిగిలిపోతుందా? ఆగస్టు 30న, విదేశాంగ మంత్రి జై శంకర్, భారత చైనా సంబంధాలు సానుకూల పంథాకు తిరిగి రావాలంటే, అవి పరస్పర సున్నితత్త్వం, పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉండాలని అన్నారు. ఆచరణ అటు సాగుతుందా? చైనా భారత సంబంధాలు రెండు ఇరుగు పొరుగు దేశాల సంబంధాలను మించి సమకాలీన అంతర్జాతీయ వ్యవహారాలను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం అని గుర్తించి, ఇరు దేశాలు స్నేహ పూర్వకంగా మెలగవలసిన అవసరం వుంది.

జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News