ఆసియాకప్-2025 సూపర్ ఫోర్‌లో భాగంగా.. మరికొన్ని గంటల్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గ్రూప్ దశలో ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసింది. పాకిస్థాన్ మ్యాచ్ రెఫరీ ఆండీ ఫైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. కానీ, ఐసిసి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్‌కి ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో చేసిన కామెంట్లను పాక్ మాజీలు తప్పుబడుతున్నారు. ‘చిరకాల పోరు’ అనే ఆలోచన తమకు లేదని.. ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడమే తనకు ముఖ్యమని సూర్య అన్నాడు. దీంతో తమతో మ్యాచ్‌ను భారత్ తక్కువగా చూస్తోందని పాక్ మాజీలు నోరు చేసుకున్నారు. దీనికి భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై పాక్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆయన అన్నారు.
‘‘భారత్-పాక్ మ్యాచ్‌కి ఉన్న హైప్‌ను టీం ఇండియా ఎక్కడా తక్కువ చేయలేదు. కేవలం నిజాలను వెల్లడించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెటర్ల మనోభావాలను తెలిపాడంతే. సమస్యంతా పాకిస్థాన్ జట్టుదే. రిఫరీ పైక్రాఫ్ట్‌పై పాక్ ఆందోళన వ్యక్తం చేయడం సరికాదు. అతడు పాక్‌ని రక్షించాడనే చెప్పాలి. భారత జట్టు ముందే మ్యాచ్ రిఫరీకి తమ నిర్ణయం ఏంటో చెప్పింది. ఇదంత జరిగిన తర్వాత పాక్ మ్యాచ్ ఓడిపోయింది. అయినా ఆ జట్టుపై పాక్ మాజీలు, అభిమానుల నుంచి విమర్శలు రాలేదు. దృష్టంతా రిఫరీ వైపు మళ్లించారు. అయినా బలవంతంగా ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ చేయించడానికి అతనేమీ స్కూల్ టీచర్, ప్రిన్సిపల్ కాదు. సూర్య వద్దకు వెళ్లి పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయమని రిఫరీ చెప్పలేడు. అది అతడి బాధ్యత కూడా కాదు. కాబట్టి పైక్రాఫ్ట్ తప్పేమీ లేదు’’ అని అశ్విన్ (Ravichandran Ashwin) అన్నారు.
Also Read : టైటిల్ పోరుకు సాత్విక్ జోడీ