Monday, May 20, 2024

సంపన్నుల సంపద దేశాభివృద్ధికి దిక్సూచా?

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సుమారు 3.75 ట్రిలియన్ డాలర్లతో గత ఏడాది 2023లో భారత్ ఆవిర్భవించింది. అంతేకాకుండా 7.2% జిడిపి వృద్ధి కనపడుతుంది అని జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో సుమారు ముప్పై కోట్ల మందికి మూడు పూటలా తిండి లేదు అని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక అభివృద్ధి సంపన్నుల అభివృద్ధే తప్ప, సామాన్య ప్రజల అభివృద్ధి కాదని గ్రహించాలి. కానీ నేటి కేంద్ర పాలకులు ఈ సంపన్నుల అభివృద్ధే దేశాభివృద్ధిగా చిత్రీకరిస్తూ, అతి త్వరలో భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా, 500 ట్రిలియన్ డాలర్లు వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది అని చెబుతూ, ఈ ఘనత అంతా మాదే అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే, ఏ రంగంలో కానీ, ఏ అంశంలో కానీ అంతర్జాతీయ సంస్థలు ప్రకటించే ఏ సూచిక చూసినా, భారత్ అట్టడుగు స్థాయిలో ఉండుట జరుగుతున్నది.

పాలకులు చెబుతున్న మాటలకు, 143 కోట్ల భారత ప్రజల నిజజీవితాలకు ఉన్న అంతరం ఆకాశానికి – భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ప్రపంచ స్థాయిలో వివిధ అంశాల్లో దేశం సూచికలు పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచ ఆర్థిక అంతరాల సూచికలో 127 స్థానంలో, పేదరికం, ఆకలి కేకల్లో 111వ స్థానం, అవినీతిలో 93 స్థానం, సంతోష సూచీలో 126, మహిళా భద్రతలో 128, లింగ వివక్షలో 108, ప్రజాస్వామ్య సూచీలో 104, నిరుద్యోగంలో 86వ స్థానంలో, ఇంకా స్థూలంగా చూస్తే మానవాభివృద్ధి సూచికలో 134వ స్థానంలో నిలిచాం. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వలసపోతున్నారు. నేటీకీ అనేక చోట్ల సామాజిక వివక్షలు, వికసిత్ పేరుతో విభజన రేఖలు ఉంటున్నాయి.

ఇవి అన్నియు కూడా భారత సామాన్య ప్రజల ఆర్థిక, ఆరోగ్య, సామాజిక పరిస్థితులకు నిదర్శనంగా కనపడుతున్నా దేశం అభివృద్ధి చెందింది అని చెప్పటం నిలువెల్లా మోసం చేయడమే. ముఖ్యంగా 1991 నూతన సరళీకరణ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న ప్రభుత్వరంగం ధ్వంసమయ్యాయి. ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తూ కార్పొరేట్లుకు, బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తూ వారివారి వ్యాపారాల అభివృద్ధికి పాలకులు అండదండలు అందించడం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారు. ఇటువంటి సంపన్నుల ఆర్ధిక అభివృద్ధే దేశాభివృద్ధిగా పాలకులు చెబుతున్న మాటలు. ఈ ధనవంతులు అభివృద్ధి చెందితేనే ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అని నమ్మపలుకుతున్నారు.

అటువంటి సందర్భాలలో ఈ పాలకుల ఏలిక ఎందుకు? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1961లో ఒకే ఒక్క (1) బిలియనీర్ భారత్‌లో ఉండగా, 2022 నాటికి 162 మంది, నేటికీ 2024 మే నెల నాటికి 200 బిలియనీర్లు భారత దేశంలో ఉన్నట్లు ‘ఫోర్బ్స్’ పత్రిక వెల్లడించింది. కేవలం 1% ఉన్న బిలియనీర్ల వద్ద 40% శాతం దేశ సంపద కేంద్రీకృతమై ఉంది. మొత్తం 13,223 మంది శత కోటీశ్వరులు వద్ద దాదాపు 60% దేశ సంపద కేంద్రీకృతమై ఉంది. అదే సమయంలో మధ్య తరగతి ప్రజల వద్ద ఉన్న దేశ సంపద కేవలం 6.5% ఉండుట గమనించదగినది. అందుకే ఇటీవల ‘పికెట్టి’ బృందం పైవిషయాలను పరిశీలించి ‘దేశ సంపద పెరిగినంత మాత్రాన ప్రజల ఆదాయం పెరిగినట్లు కాదు’ అని తెలిపింది. ముఖ్యంగా కరోనా కాలంలో పోగొట్టుకున్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలు నేటికీ అందరికీ అందుబాటులోకి రాలేదు.

ప్రైవేటీకరణతో అనేక మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. దీనికి తోడు ‘ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్’ అన్ని రంగాల్లో చొరబడుతూ నిరుద్యోగులకు మరింత నిరాశ కలుగచేస్తున్నది. ఈ సంవత్సరం 2024 జనవరి నుంచి మే మొదటి వారం వరకు వివిధ కంపెనీలు 1,15,000 ఉద్యోగాలను టెర్మినేట్ చేసింది. భవిష్యత్తులో సేవారంగం కూడా కుదేలు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కొన్ని సంస్థలు ఇప్పటికే టెర్మినేట్, లే ఆఫ్‌లు ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. దీంతో ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకు క్షీణిస్తున్నది. ప్రజల వాస్తవ ఆదాయం పెరగడం లేదు. ప్రభుత్వాలు అందరికీ అందించవలసిన విద్య, వైద్యం కూడా అందని ద్రాక్షవలే మారింది.

ప్రైవేటీకరణ భారీ ఎత్తున ఈ రెండు రంగాల్లో పెరగడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయంలో దాదాపు 65% వీటి కొరకే ఖర్చు పెడుతూ ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న మన దేశంలో అందరికీ ఉపాధి లేకుండా అభివృద్ధి ఎలా సాధిస్తారు అని బిలియన్ డాలర్ల ప్రశ్న! ఇకనైనా దేశాభివృద్ధి అంటే ప్రజల అందరి అభివృద్ధి అని పాలకులు గ్రహించాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. కార్పొరేట్ ట్యాక్స్ పెంచాలి. సంపద వికేంద్రీకరణ చేయాలి. ప్రభుత్వ రంగం సంస్థలను బలోపేతం చేయాలి. భూ పంపిణీ చేయాలి.పేదరిక నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య భారతంలో సంక్షేమ రాజ్యస్థాపన జరగాలి. ‘సంపన్నుల సంపద దేశాభివృద్ధి కాదని, సామాన్య ప్రజల అభివృద్ధే దేశాభివృద్ధి’ అని పాలకులు గ్రహించాలి. 2047 దేశ స్వాతంత్య్రం శతాబ్ది ఉత్సవాల నాటికైనా మన స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద దేశంగా భారత్ ఆవిర్భవించాలని ఆశిద్దాం.

ఐ ప్రసాద్ రావు
6305682733

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News