Saturday, July 27, 2024

చారిత్రక విజయమిది

- Advertisement -
- Advertisement -
india
కివీస్ గడ్డపై అదరగొట్టిన టీమిండియా

మన తెలంగాణ/క్రీడావిభాగం : న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును భారత్ తన పేరిట లిఖించుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టి20 ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో ఈ విజయం టీమిండియాలో కొత్త జోష్ నింపిందనే చెప్పాలి. గతానికి భిన్నంగా ఈసారి కివీస్ గడ్డపై భారత్ అసాధారణ ఆటతో అలరించింది. కివీస్‌లో జరిగే సిరీస్‌లలో అంతంత మాత్రంగానే రాణించే టీమిండియా ఈసారి అసాధారణ ఆటతో చెలరేగి పోయింది.

పొట్టి ఫార్మాట్‌లో బలమైన జట్టుగా పేరున్న కివీస్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చిత్తుగా ఓడించి కోహ్లి సేన ప్రపంచ క్రికెట్‌లోనే పెను ప్రకంపనలు సృష్టించింది. ఏ జట్టు కూడా సాధించని అరుదైన విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. టి20 చరిత్రలోనే తొలిసారి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి కొత్త ప్రపంచ రికార్డును సాధించింది. తీవ్ర ఒత్తిడిలోనూ నిలకడైన ప్రదర్శనతో టీమిండియా సాధించిన విజయాలు చిరకాలం గుర్తుండి పోతాయని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ అసాధారణ ఆటను కనబరిచింది. లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మ, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్‌లు నిలకడైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

ఇక, ఎప్పటిలాగే కెప్టెన్ విరాట్ కోహ్లి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. జట్టును ముందుండి నడిపించడంలో తనకు ఎవరూ సాటిరారనే విషయాన్ని మరోసారి నిరూపించాడు. ఒత్తిడిలోనూ చక్కటి నిర్ణయాలతో కోహ్లి కెప్టెన్సీ సామర్థాన్ని మరోసారి చాటాడు. బౌలర్లు కూడా తమ పాత్రను సక్రమంగా పోషించారు. సీనియర్లు బుమ్రా, షమి, రవీంద్ర జడేజాలతో పాటు యువ స్పీడ్‌స్టర్లు సైని, శార్దూల్‌లు అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ షమి, శార్దూల్‌లు చేసిన బౌలింగ్ టి20 చరిత్రలోనే చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలి పోవడం తథ్యం.

అదరగొట్టిన రాహుల్

ఇక, ఈ సిరీస్‌లో లోకేశ్ రాహుల్ అసాధారణ ఆటతో చెలరేగి పోయాడు. నిలకడైన ఆటతో జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. ఓపెనర్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. తొలి రెండు మ్యాచుల్లో సహచరుడు రోహిత్ శర్మ విఫలమైనా తన అద్భుత బ్యాటింగ్‌తో రాహుల్ ఆ లోటు జట్టుపై పడకుండా చూశాడు. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ రాహుల్ సత్తా చాడాడు. తనకు అప్పగించిన అదనపు బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వర్తించాడు. అంతేగాక చివరి టి20లో కెప్టెన్‌గా కూడా రాణించాడు. రోహిత్ శర్మ గాయ పడడంతో చివరి మ్యాచ్‌లో సారథ్య బాధ్యతలు నిర్వర్తించే ఛాన్స్ రాహుల్‌కు దొరికింది. ఈ అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకున్నాడు. అద్భుత కెప్టెన్సీతో జట్టును విజయపథంలో నడిపించాడు. అంతేగాక కీపర్‌గా కూడా అద్భుతంగా రాణించాడు. రిషబ్ పంత్ స్థానంలో రాహుల్ ఈ సిరీస్‌లో కీపర్‌గా బరిలోకి దిగాడు. ఓపెనర్‌గా, కీపర్‌గా జట్టుపై తనదైన ముద్ర వేశాడు. ప్రపంచకప్ నేపథ్యంలో రాహుల్ కనబరిచిన ప్రతిభ జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.

రోహిట్

మరోవైపు తొలి రెండు మ్యాచుల్లో విఫలమైనా తర్వాతి పోటీల్లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ చెలరేగి పోయాడు. కీలక సమయాల్లో అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. కివీస్ బౌలర్లను హడలెత్తిస్తూ రోహిత్ కొనసాగించిన బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువే. అసాధారణ ఆటతో రోహిత్ అలరించాడు. ఇదే క్రమంలో టి20 ఫార్మాట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి, రాహుల్, అయ్యర్‌లతో కలిసి రోహిత్ నమోదు చేసిన భాగస్వామ్యాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.

కింగ్ కోహ్లి

ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి తనకు ఎదురులేదనే విషయాన్ని మరోసారి నిరూపించాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కోహ్లి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. కీలక సమయాల్లో అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగుల వర్షం కురిపించాడు. కెప్టెన్‌గా కూడా జట్టుపై తనదైన ముద్ర వేశాడు. రెండు మ్యాచుల్లో సూపర్ ఓవర్‌లలో కోహ్లి తీసుకున్న నిర్ణయాలు జట్టు విజయానికి దోహదం చేశాయి. బౌలింగ్ ఎవరికీ ఇవ్వాలి..బ్యాటింగ్ బాధ్యతలు ఎవరికీ అప్పగించాలనే దానిపై కోహ్లి స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నాడు. జట్టు సాధించిన చారిత్రక విజయంలో కోహ్లి పాత్ర చాలా కీలకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మెరిసిన బౌలర్లు

బౌలర్లు కూడా అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఒత్తిడిలోనూ బౌలర్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. జస్‌ప్రిత్ బుమ్రా, షమితో పాటు యువ బౌలర్లు శార్దూల్, సైని అద్భుతంగా రాణించారు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ శార్దూల్, షమిలు చెలరేగిన తీరును పొంత పొగిడినా తక్కువే. మూడో మ్యాచ్‌లో షమి, నాలుగో మ్యాచ్‌లో శార్దూల్ అసాధారణ బౌలింగ్‌ను కనబరిచారు. తీవ్ర ఒత్తిడిలోనూ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను టైగా ముగించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. వీరి అసాధారణ బౌలింగ్ వల్లే సునాయాసంగా గెలివాల్సిన మ్యాచ్‌లను కూడా కివీస్ చేజార్చుకోక తప్పలేదు.

జోరుగా..హుషారుగా

టి20లలో సాధించిన చారిత్రక విజయంతో రానున్న వన్డే సిరీస్‌కు టీమిండియా మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లోనూ జయకేతనం ఎగుర వేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. లోకేశ్ రాహుల్, అయ్యర్, మనీష్ పాండే, రోహిత్ తదితరులు ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. బౌలింగ్‌లో కూడా భారత్‌కు ఎదురు లేదని చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతో వన్డే సిరీస్‌కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.

india vs new zealand t20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News