Wednesday, May 22, 2024

ఛాంపియన్ భారత్..

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆసియా కప్ 2023 టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో టీమిండియా ఏక పక్షంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌కా షాన్ పేసర్ మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో టీమిండియా ఖాతాలో 8వ ఆసియా కప్ టైటిల్ వచ్చి చేరింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కుశాల్ పెరీరాను బుమ్రా అవుట్ చేశాడు. ఇక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక (2), సమరవిక్రమ (0),

అసలంక (0), ధనంజయ డిసిల్వ (4)లను ఒకే ఓవర్‌లో పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత శ్రీలంక జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. సిరాజ్ బౌలింగ్‌లోనే షనక(0), కుసాల్ మెండిస్ (17) వికెట్లు పారేసుకున్నారు. ఇక చివర్లో ప్రమోద్ మదుషాన్ (1), మెథీసా పతిరానా (0)లను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాటర్లలో కుషాల్ మెండిస్ 17, హేమంత 13 తప్ప ఎవరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. మహ్మద్ సిరాజ్ 6, హార్దిక్ పాండ్యా 3, బుమ్రా ఒక వికెట్ తీశారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పేసర్లే తీయడం విశేషం.

అలవోకగా విజయం..
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అలవోకగా 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి సునాయాస విజయాన్నందుకుంది. స్వల్ప లక్ష్యం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు బదులు.. ఇషాన్ కిషన్(18 బంతుల్లో 3×4, 23 నాటౌట్) ఓపెనింగ్ చేయగా శుభ్‌మన్ గిల్(19 బంతుల్లో 6×4, 27 నాటౌట్)తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. వన్డే వరల్డ్ కప్ ముందు దక్కిన ఈ విజయంతో భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది.

సిరాజ్.. ఎన్నో రికార్డులు..
ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు సాధించడం అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరపున సింగిల్ స్పెల్‌లో అత్యంత వేగంగా 5 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. గతంలో శ్రీలంక దిగ్గజం చమిండా వాస్ 16 బంతుల్లో 5 వికెట్లు సాధించాడు. సిరాజ్ ఆ రికార్డు సమం చేశాడు. అంతేకాదు సిరాజ్ రెండో ఓవర్‌లో 4 వికెట్లతో వన్డే క్రికెట్‌లో 50 వికెట్లు పూర్తి చేశాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచాడు. వన్డే ఫార్మాట్‌లో ఈ ఫీట్ సాధించేందుకు సిరాజ్..1002 బంతులు వేయగా 847 బంతుల్లోనే 50 వికెట్లు పడగొట్టిన శ్రీలంక స్పిన్ బౌలర్ అజంతా మెండీస్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వన్డేల్లో 2002 తరువాత మొదటి 10 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత్ పేసర్‌గా మొహమ్మద్ సిరాజ్ మరో రికార్డు సాధించాడు. అంతకుముందు 2003లో శ్రీలంకపై జవగల్ శ్రీనాథ్ మొదటి 10 ఓవర్లలో 4 వికెట్లు తీయగా 2013లో శ్రీలంకపై భువనేశ్వర్ 4 వికెట్లు, 2022లో బూమ్రా 4 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News