Thursday, May 2, 2024

కాప్ 28 సదస్సులో అనూహ్య పరిణామం… వేదికపై మణిపూర్ బాలిక నిరసన

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించే లక్షంతో దుబాయిలో జరుగుతున్న కాప్ 28 సదస్సులో మంగళవారం కలకలం చెలరేగింది. మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాన్‌గుజమ్ అనే 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా వేదికపైకి చేరి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసింది. ఈ క్రమంలో వేదికపై ప్లకార్డు పట్టుకుని నిరసన తెలియజేసింది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా శిలాజ ఇంధనాల వాడకాన్ని వెంటనే తగ్గించాలంటూ లిసిప్రియ నినదించారు. చర్చలకు సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న వ్యక్తి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా లిసిప్రియ వినలేదు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని విస్పష్టంగా అందరికీ వివరించింది. చివరకు ఇద్దరు భద్రత సిబ్బంది లిసిప్రియను వేదిక నుంచి పక్కకు తీసుకెళ్లారు.

అయితే చర్చల్లో పాల్గొన్న వివిధ దేశాల సభ్యులు మాత్రం లిసిప్రియ చర్యను సమర్ధిస్తూ చప్పట్లతో అభినందించారు. నిర్వాహకులు కూడా లిసిప్రియ చర్యను తప్పుపట్టక పోగా .. ఈ కాలపు యువత ఆశయాలకు లిసిప్రియ నిదర్శనమని , ఆమె చర్యను కొనియాడటం విశేషం. ఈ సంఘటనపై కాప్ 28 డైరెక్టర్ జనరల్ అంబాసిడర్ మజిద్ అల్ సువైదీ స్పందించారు. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్య పోయానని పేర్కొన్నారు. నిరసన తరువాత లిసిప్రియ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. “ నేను నిరసన తెలియజేయడంతో వారు నన్ను 30 నిమిషాల పాటు అదుపు లోకి తీసుకున్నారు. శిలాజ ఇంధనాలు వాడొద్దని చెప్పడమే నేను చేసిన నేరం. మీరు నిజంగా శిలాజ ఇంధనాలను వ్యతిరేకిస్తే … నాకు మద్దతు తెలియజేయండి.

నిబంధనలకు విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి ప్రాంగణం లోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగింది. ఐక్యరాజ్యసమితి వద్ద నా గళాన్ని వినిపించే హక్కు ఉంది” అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ను ట్విటర్‌లో ట్యాగ్ చేసింది. నవంబర్ 30 న ప్రారంభమైన కాప్ 28 సదస్సు డిసెంబర్ 12తో ముగియనుంది. దీనికి 190 దేశాల నుంచి 60 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ లిస్‌ప్రియా ఈస్ట్ తైమూర్ ప్రత్యేక రాయబారిగా సదస్సుకు హాజరైంది. లిసిప్రియా చిన్నవయసు నుంచే వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలపై ఉద్యమిస్తోంది. ఎన్నో వేదికలపై ఉపన్యాసాలిచ్చింది. క్లైమేట్ ఛేంజ్ లా తీసుకురావాలంటూ మన పార్లమెంట్ ముందూ ప్రదర్శనలు చేసింది. ఈమెను వరల్డ్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్ 2019 వరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News