డబ్లిన్: ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో భారతీయ సంతతి టాక్సీ డ్రైవర్ లఖ్వీర్ సింగ్‌పై జాత్యహంకార దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు లఖ్వీందర్ సింగ్ తలపై బాటిల్‌తో రెండుసార్లు దాడి చేశారు. కస్టమర్ల పేరుతో లఖ్వీందర్ సింగ్ క్యాబ్‌లో ఎక్కిన ఇద్దరు యువకులు అతనిపై దాడి చేశారు. ఐర్లాండ్‌లోని డబ్లిన్ శివారులోఈ ఘటన చోటు చేసుకుంది. లఖ్వీందర్ సింగ్ గత 23 ఏళ్లుగా డబ్లిన్‌లో ఉంటున్నాడు. పదేళ్లుగా క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి లఖ్వీందర్ తన కారులో 20 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నాడు. పాపింట్రీ వద్ద తమను దించాలని వారు అతనికి చెప్పారు.
అయితే గమ్యస్థానం చేరుకున్న తర్వాత ఆ ఇద్దరు యువకులు సింగ్‌పై దాడి చేసి బాటిల్‌తో అతని తలపై బలంగా కొట్టారు.అక్కడినుంచి పారిపోతూ వారు‘ మీ దేశానికి తిరిగి వెళ్లిపో’ అంటూ గట్టిగా అరిచారని సింగ్ చెప్పాడు. గడచిన పదేళ్లలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని ఆయన వాపోయాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన సింగ్‌కు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఎమర్జెన్సీ సహాయం 999కి డయల్ చేశాడు. వారి సాయంతో ఆస్పత్రిలో చేరాడు. కాగా, ఆగస్టు 1న రాత్రి సుమారు 11.45 గంటలకు జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.