Thursday, May 2, 2024

ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ జీతం రూ.80 కోట్లకు పెరిగింది

- Advertisement -
- Advertisement -

43 శాతం ఇంక్రిమెంట్ : కంపెనీ వెల్లడి

 

న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ఐటి కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ పరేఖ్ వేతనం భారీగా పెరుగనుంది. ప్రస్తుత ఆయన వార్షిక వేతనం రూ.42.50 కోట్లు ఉండగా, తాజాగా 88 శాతం పెంపుతో రూ.79.75 కోట్లకు చేరనుంది. ఈమేరకు కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇటీవల పరేఖ్‌ను సిఇఒగా పునర్నియమిస్తు ప్రకటించిన తర్వాత కంపెనీ బోర్డు జీతం పెంచాలని నిర్ణయించింది. పరేఖ్ తన జీతంలో 43 శాతం ఇంక్రిమెంట్ పొందారు. సిఇఒ జీతం పెంచుతూనే, సలీల్ నేతృత్వంలో కంపెనీ గొప్ప వృద్ధిని సాధించిందని ఇన్ఫోసిస్ పేర్కొంది. గురువారం విడుదల చేసిన ఇన్ఫోసిస్ వార్షిక నివేదికలో సిఇఒ సలీల్ పరేఖ్ జీతంలో పెంపు గురించి సమాచారం ఇచ్చారు. సలీల్ పరేఖ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పదవీకాలాన్ని మరో 5 ఏళ్లపాటు పొడిగిస్తూ ఇటీవల కంపెనీ ప్రకటన చేసింది. సలీల్ పరేఖ్ కొత్త పదవీకాలం 2022 జూలై 1 నుండి 2027 మార్చి 31 వరకు కొనసాగుతుంది.

30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం

ఇన్ఫీ సిఇఒ సలీల్ పరేఖ్‌కు 30 ఏళ్లకు పైగా ఐటీ పరిశ్రమలో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన 2018 జనవరిలో ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఫోసిస్‌లో చేరడానికి ముందు ఆయన క్యాప్‌జెమినీతో 25 సంవత్సరాల పాటు అనుబంధం కలిగి ఉన్నారు. ఇన్ఫోసిస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను గత నెలలో ప్రకటించింది. ఈ ఫలితాల్లో కంపెనీ రూ. 5,686 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అయితే మూడో త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ లాభం 2 శాతం తగ్గింది.

ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ సిఇఒలు

నారాయణ మూర్తి 1981 నుండి మార్చి 2002 వరకు
నందన్ నీలేకని మార్చి 2002 నుండి ఏప్రిల్ 2007 వరకు
క్రిస్ గోపాలకృష్ణన్ ఏప్రిల్ 2007 నుండి ఆగస్టు 2011 వరకు
ఎస్‌డి షిబులాల్ ఆగస్టు 2011 నుండి జూలై 2014 వరకు
విశాల్ సిక్కా ఆగస్టు 2014 నుండి ఆగస్టు 2017 వరకు
యుబి ప్రవీణ్ రావు ఆగస్టు 2017 నుండి జనవరి 2018 వరకు
సలీల్ పరేఖ్ 2 జనవరి 2018 నుండి ఇప్పటివరకు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News