హైదరాబాద్: ప్రతి ఇంటికి ఆడదే ఆధారం. అందుకే పెద్దలు అన్నారు ఇంటికి దీపం ఇళ్లాలని. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు. కుటుంబ పోషణలో, అభివృద్ధిలో ఈ రోజుల్లో మహిళలది కీలక పాత్ర పోషిస్తుందని బిజెపి ఉపాధ్యక్షురాలు ఎంపి డికె అరుణ తెలిపారు. మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదన్నారు. ఆది పరాశక్తి రూపం అని, నారీ శక్తి ముందు ఏ శక్తి నిలువలేదని, నారీ శక్తిని ప్రపంచానికి చాటుదామని అన్నారు. నాగోల్ లోని పిఎంఆర్ కన్వెన్షన్ లో రెడ్డి విమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎంపి డికె అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డికె అరుణను రెడ్డి మహిళా అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. పలు రంగాల్లో ప్రావీణ్యం సాధించిన మహిళలను ఎంపి అరుణ శాలువతో సత్కరించారు. మహిళల శక్తిని ప్రధాని మోడీ గుర్తించి, చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారని అన్నారు. ఈ అవకాశాలను మహిళలు వినియోగించుకోవాలని కోరారు.