Sunday, May 19, 2024

ఇంటర్నెట్‌పై అసమగ్ర తీర్పు!

- Advertisement -
- Advertisement -

నెట్ సేవలను విస్తృతం చేయడంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానిని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పే ప్రభుత్వమే ఆ సామర్థ్యాన్ని మాత్రం పెంచడం లేదు. రెండు కారణాలవల్ల ప్రభుత్వం పదే పదే ఇంటర్నెట్ పై నిషేధాలు విధిస్తోంది. మొదటిది, మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులో లేనందువల్ల పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం దీన్ని వినియోగిస్తూ ఉంటుంది. రెండవది, ప్రజలకు ఈ సదుపాయం అందుబాటులో లేకుండా చేసినందువల్ల ప్రభుత్వాన్ని ఏం చేసే అవకాశం లేదు. నెట్ లేనందువల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి మరో మార్గమేదీ లేదు.

Inter net

మునుపటి కశ్మీర్‌లో 370వ అధికరణాన్ని రద్దు చేసిన తరవాత ఇంటర్నెట్ సదుపాయాలను నిషేధించడాన్ని సవాలు చేస్తూ అనురాధా భాసిన్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అసమగ్రంగా ఉంది. మరీ మాట్లాడితే ఆ తీర్పు చిరాకు కలిగించేదిగా ఉంది. భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం గురించి సుప్రీంకోర్టు సుదీర్ఘంగా చర్చించింది. ఇంటర్నెట్ సదుపాయం భావప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగం అని స్పష్టం చేసింది. ఈ స్వేచ్ఛ మీద ఆంక్షలు విధించడానికి సక్రమమైన ప్రక్రియ అనుసరించాలని, సహేతుకత ఉండాలనీ హితవు పలికింది. అయితే వెలువరించిన తీర్పు మాత్రం వీటిని పరిరక్షించడానికి ఉపకరించేదిగా లేదు.

ఉదాహరణకు జమ్మూ-కశ్మీర్‌లో ఇంటర్నెట్ నిలిపివేయడానికి ఉద్దేశించిన ఉత్తర్వుల ప్రతులను ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం తరఫున వాదించిన భారత సోలిసిటర్ జనరల్ ఆ ఉత్తర్వులను బహిర్గతం చేయకుండా ఉండే విశిష్టాధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. కాని ఏ చట్టం ప్రకారం నిషేధించారో మాత్రం చెప్పలేకపోయారు. ఆ తరవాత విశిష్టాధికారాలు అన్న వాదన వదిలేసి కొన్ని ‘నమూనా’ ఉత్తర్వులను మాత్రం చూపించారు.

తమ ఆదేశాన్ని పాటించకపోయినా సుప్రీంకోర్టు చేసిందేమీ లేదు. ఒక వ్యవస్థ ఏదైనా ఉత్తర్వు జారీ చేస్తే దానిని సాక్ష్యం కింద పరిగణిస్తారు. అందువల్ల ఆ ఉత్తర్వును కోర్టుకు అందజేయవలసిందే. లేకపోతే ఆ వ్యవస్థ వైఖరి ప్రతికూలంగా ఉన్నట్టే. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపి వేసే ఉత్తర్వులను ప్రభుత్వం చూపించనందు వల్ల న్యాయస్థానం అలాంటి ఉత్తర్వులేమీ లేనట్టుగా పరిగణించి ఉండాల్సింది. అంటే ఇంటర్నెట్ సదుపాయాలను నిలిపివేయడం చట్ట విరుద్ధం అవుతుంది కనక తక్షణం ఆ సదుపాయాలు పునరుద్ధరించాలి. కోర్టు ఆ పని చేయకుండా కనీసం ఆ ఉత్తర్వులను ప్రభుత్వం బయటపెడ్తే భవిష్యత్తులో వాటిని సవాలు చేసే వీలుంటుందని మాత్రమే చెప్పి ఊరుకుంది.

మిగతా అంశాలలో కూడా కోర్టు ఇలాంటి నిర్లిప్త వైఖరే ప్రదర్శించింది. హక్కులు, జాతీయ భద్రత, ప్రాథమిక స్వేచ్ఛ మొదలైన విషయాలపై ఉపన్యాస ధోరణిలో మాట్లాడింది. ఈ మాటలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ధ్వనించినా పిటిషనర్లకు కల్పించిన ఊరట మాత్రం పూజ్యం. అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి జారీ చేసిన రెండు ‘ఆదేశాలకు’ కాల పరిమితి ఏమీ లేదు. అవి వీలైనంత అస్పష్టంగా ఉన్నాయి. ప్రభుతం ఆ ఆదేశాలకు కట్టుబడి ఉండాలన్న నియమమూ లేదు. అందువల్ల ప్రభుత్వం కొన్ని చోట్ల ఇంటర్నెట్ సదుపాయాలను పునరుద్ధరించడం, ఎంపిక చేసిన కొన్ని వెబ్‌సైట్లను మాత్రమే అనుమతించడం న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించడం కిందకే వస్తుంది. అసమర్థమైన ఆదేశాలు జారీ చేసినందువల్లే ఈ పరిస్థితి తలెత్తింది. సుప్రీంకోర్టు తీర్పు ఇంటర్నెట్ సదుపాయాలు నిలిపివేయడంపై ఒక విధాన పత్రం సమర్పించినట్టుగా ఉంది. ప్రభుత్వానికి కచ్చితమైన ఆదేశాలు ఇవ్వకుండా కొన్ని సూచనలు, సిఫార్సులు చేయడంతో సరిపెట్టుకున్నట్టుగా ఉంది. ప్రభుత్వ చట్ట వ్యతిరేక చర్యలను నిలవరించడానికి తనకున్న అధికారాన్ని వినియోగించుకోలేక పోయింది. నిజం నిష్ఠూరంగా ఉంటుంది కాని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ చట్టవ్యతిరేక చర్యను సమర్థించినట్టుగానూ, ప్రభుత్వం విషయంలో భయకంపితంగా వ్యవహరించినట్టే ఉంది. ఈ తీర్పును జనం తమకు ఇష్టం వచ్చిన రీతిలో అర్థం చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ సదుపాయాలపై మన దేశంలో విధిస్తున్న ఆంక్షలు ఏ దేశంలోనూ అమలు చేయరు. జమ్మూ- కశ్మీర్‌లో అయిదు నెలల సుదీర్ఘ కాలం పాటు ఈ సదుపాయాలు నిలిపి వేశారు. అప్పుడప్పుడూ కొద్ది మేర మాత్రం అనుమతించారు. 1974 నాటి నేర విచారణా ప్రక్రియా స్మృతిలోని 144వ సెక్షన్ ఆధారంగా ఈ ఆంక్షలు విధించామంటున్నారు. ఈ స్మృతి వలసవాదుల కాలం నుంచి పెద్దగా మారనే లేదు. అలాగే టెలీకాం సేవల 2017 నాటి నిబంధనల ప్రకారం టెలిఫోన్ సదుపాయాలను 1885 నాటి టెలీగ్రాఫ్ చట్టం ప్రకారం నిలిపేశారు. ఈ రెండు చట్టాల మూలాలు వలస పాలనలోనే ఉన్నాయి. అంటే ఇంటర్నెట్ పై ఆంక్షల్లో లోతైన వ్యవహారం ఏదో ఉంది. ఇంటర్నెట్ ప్రజల నిత్య జీవితంలో అంతర్భాగం. ఇది ఎంత మాత్రం పట్టణ ప్రాంతాల వారి, మధ్య తరగతి వారి, ఇంగ్లీషు మాట్లాడగలిగే వారి గుత్త సొత్తేమీ కాదు. ఇంటర్నెట్ సదుపాయం వివిధ భాషల్లో అందుబాటులో ఉన్నందువల్ల దాదాపు 50 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించే వారి సంఖ్య మన కన్నా ఎక్కువ ఉన్నది ఒక్క చైనాలోనే.

నెట్ సేవలను విస్తృతం చేయడంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానిని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పే ప్రభుత్వమే ఆ సామర్థ్యాన్ని మాత్రం పెంచడం లేదు. రెండు కారణాల వల్ల ప్రభుత్వం పదే పదే ఇంటర్నెట్ పై నిషేధాలు విధిస్తోంది. మొదటిది, మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులో లేనందువల్ల పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం దీన్ని వినియోగిస్తూ ఉంటుంది. రెండవది, ప్రజలకు ఈ సదుపాయం అందుబాటులో లేకుండా చేసినందువల్ల ప్రభుత్వాన్ని ఏం చేసే అవకాశం లేదు. నెట్ లేనందువల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి మరో మార్గమేదీ లేదు. అనూరాధా భాసిన్ కేసు కనీసం ఈ రెండవ సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టుకు ఓ అవకాశం కల్పించింది. జాతీయ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కన్నా అసమ్మతి తెలియజేసే వారిని కట్టడి చేయడానికే ఈ నిషేధం విధించారు. జార్జ్ బెర్నార్డ్ షా మాటల్లో చెప్పలంటే సదవకాశాన్ని వినియోగించుకునే అవకాశాన్ని కోర్టు వాటంగా జార విడుచుకుంది. ఇది అత్యున్నత న్యాయస్థానం విశ్వసనీయతకు విఘాతం కల్గిస్తుంది. ప్రజల హక్కులను హరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News