Saturday, July 27, 2024

మహేష్‌లో ఉన్న గొప్ప లక్షణం అదే

- Advertisement -
- Advertisement -

Anil Ravipudi

 

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి పండగ కానుకగా ఈనెల 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడితో ఇంటర్వూ విశేషాలు…

ఫుల్‌మీల్స్ లాంటి సినిమా…
కామెడీ, ఎమోషన్స్ ,దేశభక్తి, విలువలు అన్నీ కలగలిసిన ఒక ఫుల్‌మీల్స్ లాంటి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి పండగ రోజున భోజనం ప్లేట్‌లో ఎలాగైతే అన్ని వంటకాలు ఉంటాయో… అలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి.

టీమ్ సహకారంతో…
నేను ప్రతి సినిమా చిత్రీకరణకు బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్తాను. అలాగే నిర్మాత అనిల్ సుంకర, నా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో అయిదు నెలలో ఈ మూవీని పూర్తి చేశాను. ఇదంతా టీమ్ సహకారంతో జరిగింది.

మ్యాజిక్ ఉందని నమ్మి…
‘ఎఫ్2’ సినిమా చేసేటప్పుడే నా దగ్గర ఒక స్టోరీలైన్ సిద్ధంగా ఉండటంతో దాన్ని మహేష్‌కి వినిపించాను. ఆయనకు ఈ స్టోరీ లైన్ నచ్చింది. ఈ కథలో ఓ మ్యాజిక్ ఉందని నమ్మి మహేష్ ఈ సినిమా ఒప్పుకున్నారు.

ఆ పాయింట్ ఆధారంగా…
ఇండియా బార్డర్‌లో పనిచేసిన సైనికుడు నిజ జీవితంలో ఎలా ఉంటాడు? తన చుట్టూ ఉన్న ప్రజలు చేసే తప్పులను ఎలా తీసుకుంటాడు? అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రంలో మహేష్ పాత్ర ఉంటుంది. ‘మీకోసం అక్కడ ప్రాణాలు అర్పిస్తుంటే, మీరు బాధ్యత లేకుండా ఉంటారా’ అని ప్రశ్నించే విధంగా ఉంటుంది అతని పాత్ర.

ముగ్గురు వ్యక్తుల మధ్య…
ఈ చిత్రంలో ఫ్యాక్షనిజం ఉండదు. మహేష్, విజయ శాంతి, ప్రకాష్ రాజ్ అనే ముగ్గురు వ్యక్తుల మధ్య ప్రధానంగా నడిచే కథ ఇది.

త్వరగా కలిసిపోతారు…
మహేష్‌లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన అందరితో త్వరగా కలిసిపోతారు. సెట్స్‌లో జోక్స్ వేస్తారు. అందరితో సరదాగా ఉంటారు. మానిటర్ దగ్గర ఉన్న డైరెక్టర్‌ని గమనిస్తూ అతనికి కావలసిన అవుట్‌ఫుట్ వచ్చే వరకు చేస్తారు.

వన్ ఆఫ్ ది హైలైట్ ఆమె…
13 ఏళ్ల తరువాత విజయశాంతి ఈ సినిమా చేశారు. మొదట ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. అయితే ‘కథ వినండి… నచ్చకపోతే వదిలేద్దాం’ అని చెప్పాను. కథ విన్న తరువాత ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. సినిమాకు వన్ ఆఫ్ ది హైలెట్ విజయశాంతి. ఆమె కోసమే ఈ పాత్ర రాశాను.

దాన్ని పరిశ్రమకు నేర్పింది ఆయనే…
జంధ్యాల నాకు ఇష్టమైన దర్శకులు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. మేనరిజంతో కామెడీ పుట్టించడాన్ని పరిశ్రమకు నేర్పింది ఆయనే.

Interview with director Anil Ravipudi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News