Thursday, May 8, 2025

వేధింపులే దర్యాప్తు సంస్థల పనా?

- Advertisement -
- Advertisement -

విధి నిర్వహణలో దర్యాప్తు సంస్థల పాత్ర తరచూ వివాదాస్పదమవుతోంది. బాధ్యతాయుతంగా దర్యాప్తు చేపట్టి, నేరాలకు ముకుతాడు వేయడంలో కీలకపాత్ర పోషించవలసిన దర్యాప్తు సంస్థలు అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాస్తున్నాయని, పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నాయని తరచూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష పార్టీలు ఈ రకమైన ఆరోపణలు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు కానీ, ప్రజాస్వామికవాదులు, న్యాయస్థానాలు సైతం దర్యాప్తు సంస్థల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం గమనించవలసిన విషయం. ఒకప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)పై మాత్రమే ఆరోపణలు ఉండేవి. కానీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ (ఐటి) వంటి సంస్థలకు కూడా ఈ మకిలి అంటింది. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు ఈ రెండూ కేంద్రం చేతిలో పావులుగా మారాయంటూ విమర్శలు రావడం పరిపాటిగా మారింది.

తాజాగా చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యవహార శైలిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ‘మూడు చార్జిషీట్లు దాఖలయ్యాయి. మీరు నిందితుడిని కస్టడీలో ఉంచి శిక్షిస్తున్నారు. విచారణ ప్రక్రియనే శిక్షగా మార్చారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు సేకరించకుండా కొందరు వ్యక్తులపై అభియోగాలు మోపుతున్న తీరును విమర్శిస్తూ, ఎప్పుడూ ఇదే తీరంటూ ఈసడించింది. ఆమాటకొస్తే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను న్యాయస్థానాలు తప్పుపట్టడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఆగస్టులోనూ ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇడిని తీవ్రస్థాయిలో మందలించింది. ‘ఏ వ్యక్తి స్వేచ్ఛనూ హరించకూడదు. వ్యక్తి స్వేచ్ఛ అనేది ఒక నియమమే. దాన్ని కోల్పోవడమనేది మినహాయింపుగానే ఉండాలి. ఆ స్వేచ్ఛపై నియంత్రణ విధిస్తే అది చట్టబద్ధంగానే జరగాలి. బెయిలివ్వడానికి మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం రెండు షరతులు ఉన్నాయి.

అంతమాత్రాన వ్యక్తి స్వేచ్ఛను హరించడమే ప్రమాణమని ఆ నిబంధన ఎక్కడా చెప్పలేదు’ అని చీవాట్లు పెట్టింది. వ్యక్తులను అరెస్టు చేయడానికి, రోజుల తరబడి కస్టడీలో ఉంచడానికి మనీలాండరింగ్ చట్టం ఇడికి ఒక ఆయుధంగా మారిందనేది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. నిందితులను జైలుకు పరిమితం చేసేందుకు ఈ చట్టం ఉపయోగపడుతోందన్నది పలువురి అభియోగం. ఈ చట్టం కింద నమోదైన కేసులు ఎక్కువ కాలం పెండింగులో ఉంటున్న మాట వాస్తవమేనంటూ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే స్వయంగా అంగీకరించడం చట్టం అమలులోని లొసుగులను బహిర్గతం చేస్తోంది. మామూలు నేరాల్లో ఎవరిపైనైనా కేసు నమోదు చేస్తే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి, దాన్ని సదరు వ్యక్తికి అందజేయడం తప్పనిసరి. ఇడి కేసుల్లో ఇలా ఇసిఐఆర్‌ను విడుదల చేస్తారు. కానీ దాన్ని నిందితులకు తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన మనీలాండరింగ్ చట్టంలో లేదు. పైగా ఈ చట్టం కింద ఇడి అధికారులు ఎవరికైనా సమన్లు పంపి విచారించే అధికారం ఉంటుంది. తాను సాక్షినో, ముద్దాయినో సదరు వ్యక్తికి తెలియదు. ఇలా ఇడి అధికారులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టిన మనీలాండరింగ్ చట్టంవల్ల నిందితులకు బెయిల్ దొరకడం దుర్లభమవుతోందనే విషయం ఇప్పటికే అనేక కేసులలో రుజువైంది కూడా.

ఈ చట్టంపై వెల్లువెత్తుతున్న విమర్శలను, దాఖలవుతున్న పిటిషన్లను గమనించిన సర్వోన్నత న్యాయస్థానం 2022లో ఈ చట్టం కింద ఇడికి తాను స్వయంగా దాఖలు పరచిన అధికారాలను పునస్సమీక్షించేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం తాజా పరిణామం. ఇరవైరెండేళ్ల క్రితం రూపొందిన ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం (పిఎంఎల్‌ఎ)2005 జూలైనుంచి అమలులోకి వచ్చింది. అయినా తొలినాళ్లలో ఈ చట్టం అంత ప్రభావవంతంగా అమలు కాలేదు. పిఎంఎల్‌ఎ కింద తొలి చార్జిషీటు 2012 లో దాఖలైందంటే దర్యాప్తు సంస్థ పనితీరు ఎంత నత్తనడకగా ఉండేదో అర్థం అవుతుంది. అయితే, 2014లో కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడ్డాక, ఇడి దూకుడు పెరిగింది.

వరుస కేసుల నమోదుతో ఆర్థిక నేరగాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది. అయితే, ఈ దూకుడు వెనక అప్పటి కేంద్రంలోని పెద్దల హస్తం ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ చట్టంలో లోటుపాట్లను సవరించేందుకు సుప్రీంకోర్టు నడుం బిగించడంతో ఇకపై నిందితులకు ఊరట లభిస్తుందని భావించవచ్చు. మరోవైపు, ఆర్థిక చట్టాల అమలులోనూ, ఆర్థికపరమైన నేరాలను అరికట్టడంలోనూ కీలకపాత్ర వహించే ఇడి ఇకనైనా స్వతంత్రంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిందనే అపప్రథను తొలగించుకోవాలంటే, ముందుగా రాజకీయ నేతల ఉచ్చులోంచి బయటపడాలి. నేతల ఒత్తిళ్ళకు లొంగకుండా పనిచేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News