Friday, March 1, 2024

హమాస్ ఏరివేతకు భీకర దాడులు

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : దాదాపు వారం రోజుల విరామం తరువాత గాజాలో శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ సైనిక, వైమానిక దాడులు ఆరంభమయ్యాయి. హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం బందీలు విడుదలకు స్వల్పకాలిక కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఇదే అదునుగా చేసుకుని హమాస్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని , తమ భూభాగంపైకి శతఘ్నులు కురిపించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. బందీల విడుదల విషయాన్ని పక్కకు పెట్టి ఇక హమాస్ పూర్తి స్థాయి అంతం వరకూ తమ దాడి జరుగుతుందని తెలియచేస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) శుక్రవారం ఓ ప్రకటన వెలువరించింది. ఇన్నిరోజులుగా గాజాలో కాల్పుల విరమణ జరగడం వల్ల సామాన్య జనం కొంతలో కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే తిరిగి శుక్రవారం నుంచి జనం భయాందోళనలతో తలదాచుకునే ఆరాటంలో పడ్డారు. సంధికాలం చివరి ఘట్టంలో హమాస్ తమ వద్ద ఉన్న బందీలలో వంద మందిని విడిచిపెట్టింది. కాగా ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ 200 మందికిపైగా బందీలకు విముక్తి కల్పించింది.

ఈ ఘట్టం ముగిసిన కొద్ది సేపటికే ఇజ్రాయెల్ సైన్యం హమాస్ నిర్మూలన ఆపరేషన్ పేరిట దాడులు ఉధృతంగా సాగించింది. తాము తిరిగి ఇరు పక్షాల మధ్య సంధి కుదిరేందుకు, ఒప్పంద పునరుద్ధరణ జరిగేందుకు యత్నిస్తామని మధ్యవర్తిగా ఉన్న ఖతార్ తెలిపింది. అయితే శుక్రవారం నాడే వారం రోజుల కాల్పుల విరమణ గడువు ముగిసింది. ఈ క్షణంలోనే ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు గాజా స్ట్రిప్‌లోని పలు ప్రాంతాలను ఎంచుకుని దాడులకు దిగాయి. ఇప్పుడు హమాస్‌తో తమ పోరు మామూలుగా ఉండదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. గాజాలోని పలు ప్రాంతాలలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మరో వైపు దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ విమానాల నుంచి కరపత్రాలు వెదజల్లారు. తాము దాడులకు దిగుతున్నామని వెంటనే ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని ఇందులో రాసి ఉంచారు. దీనితో వీధులలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గాజాలో ఇప్పటికీ హమాస్ చెరలో మరో 140 మంది బందీలు ఉన్నారు. ఇప్పటి దాడులతో వీరి పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

తక్షణం ఇజ్రాయెల్ వీడిన బ్లింకెన్
పౌరులకు ముప్పు వద్దని హితవు
ఇజ్రాయెల్ దాడులు తిరిగి ఆరంభమైన దశలో అక్కడ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఉన్నారు. ఆయన దుబాయ్‌లో కాప్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లుతూ బ్లింకెన్ ఇక్కడ కొద్ది సేపు ఆగారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అధికారులతో చర్చించారు. హమాస్ నిర్మూలనకు జరిగే దాడి దశలో పాలస్తీనియా పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాల్సి ఉందని కోరారు. బందీల విడుదల మరో వైపు హమాస్ ఏరివేత తమ ముందున్న రెండు లక్షాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దశలో అమెరికా విదేశాంగ మంత్రికి తెలిపినట్లు వెల్లడైంది. గాజా నుంచి ఇక ముందు ఎప్పుడూ ఇజ్రాయెల్‌పై దొంగదెబ్బ తగులకుండా చేయడమే తమ ముందున్న ఆలోచన అని నెతాన్యాహూ తెలిపారు. ఖాన్ యూనిస్ నగర తూర్పు ప్రాంతం వారు వెంటనే నివాసాలు ఖాళీ చేసి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం పంపిణీ చేసిన కరపత్రాలలో పేర్కొన్నారు.

భవనంపై దాడి ..పలువురు శిథిలాల్లో
ఖాన్ యూనిస్ ఇక భీకర రణరంగం అవుతుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది. శుక్రవారం ఉదయం ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఓ భారీ భవనం కుప్పకూలింది. దీనితో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున హాహాకారాలు చెలరేగాయి. శిథిలాల కింద పలువురు చనిపోయి ఉంటారని ందోళన చెందుతున్నారు. తమ వారి కోసం పలువురు ఇక్కడి శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. అయితే ఆలోగానే ఎప్పుడు తిరిగి దాడులు జరుగుతాయో అనే భయం జనంలో తలెత్తింది. దెబ్బతిన్న ప్రాంతాలకు వైద్య బృందాలు తరలివచ్చాయి. ఇజ్రాయెల్ తిరిగి జరిపిన దాడులలో పలువురు చనిపోయినట్లు హమాస్ ఆధీన గాజాలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒక్కరు తెలిపారు. దాదాపు 14 మంది వరకూ చనిపోయి ఉంటారని తొలుత నిర్థారణ అయిందని ఈ ప్రతినిధి అష్రఫ్ అల్ ఖ్విద్రా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News