Tuesday, May 14, 2024

ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం తగదు

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మక్తల్ నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు సైతం మక్తల్‌లో జరిగే ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తూ, తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించడం తగదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మక్తల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. మక్తల్ పెద్ద చెరువు నుంచి నల్లమట్టిని తరలిస్తున్నారంటూ కొందరు నాయకులు తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం దుర్మార్గమన్నారు.

అసలు మట్టి తరలింపుతో తనకు ఏమి సంబంధమని ఆయన ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ నుంచి కొందరు అనుమతి తీసుకుని మట్టిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం తరలిస్తున్నారన్నారు. దీని ద్వారా దాదాపు రూ.50లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందన్నారు. గతంలోనే పూడికతీత పనులకు ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడాలని, మిగతా సమయంలో పార్టీలకతీతంగా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోకుండా సహకరిస్తేనే ప్రజాప్రతినిధుల పదవులకు, ప్రజల జీవితాలకు సార్ధకత ఉంటుందన్నారు.

కొత్త మున్సిపాలిటీలతో మరింతగా అభివృద్ధి..
మక్తల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మక్తల్, అమరచింత, ఆత్మకూర్ మున్సిపాలిటీలతో మరింతగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానన్నారు. ఇప్పటికే మక్తల్‌లో దాదాపు రూ.20కోట్లతో సిసి రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. త్వరలోనే 150పడకల ఆసుపత్రి, ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు.

రజకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.2కోట్ల వ్యయంతో ఆధునిక దోబీ ఘాట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణ, పరిసర ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నదని, వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నారు.

మున్సిపల్ కార్మికులకు సన్మానం..
పట్టణ ప్రగతి దినోత్సం సందర్భంగా మక్తల్ మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు. అలాగే విధి నిర్వహణలో నిబద్ధత కనబరుస్తున్న ఉద్యోగులకు, కౌన్సిలర్లకు ప్రశంసాపత్రాలను అందించి ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. అలాగే మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులను అందించారు.

కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావని, వైస్ ఛైర్‌పర్సన్ అఖిల, ప్రత్యేకాధికారి జాన్ సుధాకర్, అటవీ శాఖ అధికారి వీణావాణి, బిసి సంక్షేమాధికారి కృష్ణమాచారి, కమిషనర్ మల్లికార్జున స్వామి, మేనేజర్ ఖాదర్ ఖాన్, ఏఈ నాగశివ, బిల్ కలెక్టర్ తిమ్మప్ప, కౌన్సిలర్లు చీరాల సత్యనారాయణ, జగ్గలి రాములు, మొగులప్ప, ఈసరి కౌసల్య, కొండయ్య, గోలపల్లి శంకరమ్మ, కో ఆప్షన్ సభ్యులు నాగలక్ష్మీ, శంషోద్దీన్, పద్మతదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News