Sunday, September 21, 2025

జయజయహే.. జయశంకర్!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమస్ఫూర్తి ప్రదాతగా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొ. జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ఆయన దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీమరచిపోదు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిది. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ సార్. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొ. జయశంకర్ సేవను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా, వారి సంకల్పబలం రాష్ట్రసాధనకు చేసిన నిర్విరామ కృషి అంచ లంచెలుగా ఆశయ ఆలోచనలకు పడునుపెడుతూ, రాష్ట్రసాధనకు ఆయువుపట్టు అయ్యారు.

అందరి హృదయాలలో చిరకాలం పాటు నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ప్రొ. జయశంకర్. విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కొత్తపల్లి జయశంకర్ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట అనే గ్రామంలో తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంత్‌రావులకు 6 ఆగస్టు, 1934 జన్మించారు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. జయశంకర్ తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారు. ఆర్థికశాస్త్రంలో పిహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ -ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు.

1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌లోని సికెఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేశాడు. 1979 నుండి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పని చేశాడు. అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సికెఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే. కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ కే సాధ్యం.

ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుండే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలో సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు.

తెలంగాణ డిమాండ్‌ను 1969 నుండి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసాడు. ఆయన తిరగని ప్రాంతం అంటూ లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణ నినాదాన్ని వినిపించిన పోరాటశీలి. ఉస్మానియా విద్యార్థుల గురించి ‘ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తాయి. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తూ కనిపిస్తారు. వారు గుర్తుకొస్తే దుఃఖమొస్తది అనేవారు.

అయితే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు. అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని.. వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయ నాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా’ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష గురించి మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి.

యాచక దశ నుండి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి అనే వారు. 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరడానికి కారణమైన వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకున్నా, రాష్ట్రసాధన గురించి చెప్పుకున్నా… ఆయన ప్రస్తావన లేకుండా ఉండదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. అంతటి మహనీయుడు అనారోగ్య సమస్యతో రెండేళ్లపాటు గొంతు క్యాన్సర్‌తో బాధపడి 2011 జూన్ 21 తుదిశ్వాస విడిచారు.

నరేష్ జాటోత్,  82478 87267

(నేడు జయశంకర్ జయంతి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News