Tuesday, April 23, 2024

తెలంగాణలో సిద్ధాంత శూన్యం

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు తనదైన సిద్ధాంతం ఒకటి అవసరం. అది తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ముగిసిపోలేదు. అట్లానే అది కేవలం అభివృద్ధి విషయాలకు, సంక్షేమానికి సరిమితమైనది కాదు. అంతకు మించిన సమగ్రమైన దృక్పథం ఒకటి ఉన్నపుడే దానిని సిద్ధాంతం అంటాము. అదేమిటి, దాని స్వరూప స్వభావాలేమిట్నది ప్రశ్న. ప్రొఫెసర్ జయశంకర్‌ను తెలంగాణ సమాజం తన సిద్ధాంతకర్తగా ఆమోదించింది. అప్పటి చారిత్రక నేపథ్యం, ఈ ప్రాంత పరిస్థితులు, అభివృద్ధి అవసరాలతో కూడిన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ, అందుకు తగినట్లు ఆయన ఒక సిద్ధాంతం తయారు చేశారు. తన తర్వాత, ఈ సరికి అంతా చిందరవందరగా తయారైంది. ఈ రోజున తెలంగాణకు తనదైన ఒక సమగ్రమైన, సిద్ధాంతం అంటూ లేకుండా పోయింది. అంతా శూన్యంగా ఉంది.

అందువల్ల ఒక సిద్ధాంత సృష్టి ఇపుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. ఆ సిద్ధాంతం ఎట్లా ఉండాలి? దానిని ఎవరు తయారు చేస్తారు అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. జయశంకర్‌తో పోల్చగల గొప్ప మనిషి ఇపుడెవరూ లేరు. కాని సిద్ధాంతాలను కేవలం ఒక మేధావి తన ఒంటి చేతి మీదుగా రూపొందించటం ఒక పద్ధతి. ఇది మనకు తెలిసిన సర్వసాధారణమైన పద్ధతి. అదిగాక మరొక పద్ధతి కూడా ఉండవచ్చు. అది వివిధ వర్గాల ప్రజల ఉమ్మడి ఆలోచనలు, ఉమ్మడి సూచనల నుంచి ఉమ్మడిగా రూపొందవచ్చు కూడా. నిజానికి ఒక మేధావి ఒంటి చేతితో సిద్ధాంతాన్ని తయారు చేసినపుడు కూడా, అది వివిధ వర్గాల ప్రజల అనుభవాలు, ఆలోచనలు, వ్యక్తావ్యక్త సూచనలు ఉమ్మడి సామాజిక సారాంశం నుడి సిద్ధం చేసినదే అవుతుంది, సూత్రీకరించినదే అవుతుంది తప్ప శూన్యం నుంచి ఆవిర్భవించదు. కనుక, వివిధ కోణాల నుంచి తెలంగాణ వ్యక్తిత్వాన్ని, పరిస్థితులను, ఆలోచనలకు అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించే దూరదృష్టి గలవారు, తెలంగాణకు త్రికరణ శుద్ధిగా కట్టుబడిన వారు, ఇటువంటి ఒక సిద్ధాంత సృష్టి దిశగా ఆలోచనలు చేయాలి.

వాటి నుంచి అనగా సమాజం మధ్య నుంచే ఒక సిద్ధాంతం ఆవిర్భవించగలదు. జయశంకర్ వంటి మేధావి లేని లోటు అపుడు కన్పించబోదు. ఇపుడు ఈ ఉపోద్ఘాతాన్ని దాటి ముందుకు పోదాము. పైన అనుకున్నట్లు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలి. కాని అది మాత్రమే కాదు. అభివృద్ధి, సంక్షేమాలు కావాలి. కాని అవి మాత్రమే కాదు. ఎందువల్ల? సాధారణ దృష్టితో చూసినపుడు తెలంగాణ వంటి ఆర్థిక, సామాజిక నేపథ్యం, ఫ్యూడల్ పీడన, అంతర్గత వలస దోపిడీ గల ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారా స్వయం పరిపాలనను, దానితో పాటు గతంలో లేని అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటుంది. అవి ఇంచుమించు సజావుగా జరిగితే సంతృప్తి చెందుతుంది. ఆ మేరకు చూసినపుడు ఒక ప్రభుత్వం కాకపోతే మరొకటి ఆ పనులు ఏదో ఒక పరిధిలో చేయవచ్చుగాక.

వాస్తవానికి తెలంగాణ రాక ముందు కూడా ఏవో కొన్ని ఎంతో కొంత జరిగాయి కూడా. కాని అవి ఈ ప్రాంత అవసరాలమేర, అంతర్గత శక్తి మేర జరగలేదు. అట్లాగే ఈ ప్రాంతానికి గౌరవ మర్యాదలు లభించక దశాబ్దాల పాటు పూర్తి చిన్నచూపులకు గురైంది. కొన్ని వందల ఏళ్ల సామాజిక చైతన్యం, ఉద్యమాలూ, పోరాటాల వారసత్వాలన్నీ అందుకు తగిన ఫలితాలను ఇక్కడి ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం సాకారం చేసుకోలేకపోయాయి. ఈ నేపథ్యాలన్నీ గల తెలంగాణ భూమి కేవలం ప్రత్యేక రాష్ట్రం, కొన్ని అభివృద్ధులు, కొన్ని సంక్షేమాలకు, అవి ఏ ప్రభుత్వం చేసేవి అయినప్పటికీ, అందుకు పరిమితంగా గాక, ఒక నవీన సమాజాన్ని సృష్టించుకునే దిశగా అడుగులు వేయవలసింది. అనేక విధాలుగా ఒక ఆదర్శమైన అభివృద్ధి, ఆదర్శమైన సంక్షేమంతో పాటు ఆదర్శమైన సమాజం కోసం ప్రయత్నించవలసింది.

జయశంకర్ అనంతర కాలంలో తెలంగాణకు అవసరమైంది ఇటువంటి సిద్ధాంత కల్పన. ఉదాహరణకు నవీన తెలంగాణలో, ఆదర్శ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు చదువులు, వైద్యం సత్వరమే అందుబాటులోకి వస్తాయి. అక్షరాస్యతలో దేశంలో పైపైకి చేరుతుంది. ఆస్తులు, డబ్బు కోసం కుటుంబ సభ్యులు సైతం ఒకరినొకరు చంపుకునే నికృష్ట స్థితికి, భయంగొలిపేట్లు విస్తరిస్తున్న ఒక కొత్త సంస్కృతికి సమాజం పతనం కాదు. ఆడపిల్లలను, మహిళలను పలు విధాలు వేధించి ప్రాణలు కూడా తీసే సంస్కృతి ఇట్లా పెరగదు. గతంలో లేని విధంగా కులతత్వాలు, మతోన్మాదాలు ప్రబలవు. దళితుల కోసం ఏమైనా చేస్తే ఇతర కులాలు సహించకపోవటం, నిమ్న కులాలలోనూ మతతత్వాలనేవి ఉండవు. పైవారి నుంచి మామూలు ఉద్యోగి వరకు సామాన్యులను పనిచేయక వేధించటంగాని, అవినీతితో కోట్లకు పడగలెత్తటం గాని జరగవు.

విధానాలను రూపొందించటం, వాటిని అమలు పరచటం పూర్తిగా ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని, అంతేగాక తెలంగాణలో సరికొత్త సంస్కృతికి రూపుదిద్దటాన్ని, ఆయా సామాజిక జాడ్యాలను అరికట్టి సంస్కరించటాన్ని దృష్టిలో ఉంచుకుని సాగుతాయి.వినేందుకు చిన్నవిగా తోచవచ్చుగాని, చివరకు అందరూ రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించి తమతో పాటు ఎవరి భద్రతకు హాని కలిగించక పోవటం కూడా ఒక గొప్ప నాగరికతా సూత్రమని, నాగరికత గల సమాజాలన్నిటా పౌరులు ఈ సూత్రాలను పాటిస్తారని గుర్తించి అనుసరించటం కూడా ఆదర్శ తెలంగాణ సిద్ధాంతంలో భాగం కావాలి. వ్యాపారులు మోసాలను, కల్తీలను మానివేయాలి. జర్నలిజం కీలకమైన రంగం అయినందున జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవటం, వృత్తి విలువలను పెంపొందించుకోవటమనేది చేసి, సమాజంలో తమపట్ల గత మూడు దశాబ్దాలుగా వేగంగా పెరుగుతున్న వ్యతిరేకతను పోగొట్టుకోవాలి.

వ్యక్తులు నిజాయితీ పెంచుకుని మోసాలు మానివేయాలి.తెలంగాణ సిద్ధాంతంలో ఇటువంటివన్నీ భాగం కావాలి. ఈ పద్ధతులు, ఆలోచనలు, విధానాలు ఎప్పటికపుడు తగిన సామాజిక సంస్కరణలు, పరిపాలనలు, వ్యక్తిత్వసంస్కారాలు గల సమాజాలు, దేశాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. అవి వేర్వేరు అంశాలపై తరచు వెలువడే ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానాల్లో ఉంటుంటాయి. ఈ పరిస్థితిని భారత దేశానికి పరిమితమై కూడా కొంత వరకు చూడవచ్చు. ఉదాహరణకు అక్షరాస్యతలో కేరళను. సంతోషకరంగా ఉండే సమాజాలలో మన పొరుగునే గల భూటాన్‌ను. తెలంగాణ వంటి గొప్ప చైతన్యపూరిత మైన సమాజాన్ని ఈ విధంగా ఆదర్శవంతంగా పరివర్తన చేసే సిద్ధాంతం మనకు లేదు.

ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏవో కొన్ని అభివృద్ధులు, కొన్ని సంక్షేమాలు, ఎవరొచ్చి అరకొరగా ఏవో చేయటాలు మినహా ఒక సమగ్రమైన, ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి ఒక ఆలోచన అంటూ జరగటం లేదు. అటువంటి దృక్పథంతో ఒక సిద్ధాంతానికి రూపకల్పనను మనం చేయటం లేదు. నాయకుల దార్శనికతలంటూ మాట్లాడటం మంచిదేగాని, అంతకన్న ముఖ్యం గా ఒక సమాజ వృద్ధికి, మార్పులకు ప్రజల దార్శనికత అవసరం. వారి దార్శనికత, చైతన్యాలే ఆ సమాజపు సిద్ధాంతాన్ని రచిస్తాయి. అందుకు విద్యావంతులు, ఆలోచనాపరులు, వివిధ చైతన్యాలు గల ఆయా రంగాల పౌరులు చొరవ తీసుకోవాలి.అది జరగనంత వరకు తెలంగాణ ముందుకు పోయినా పైకి ఎదగలేదు.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News