Friday, September 20, 2024

రూ. 8 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన రంగారెడ్డి అదనపు కలెక్టర్

- Advertisement -
- Advertisement -

అవినీతి నిరోధకశాఖ వలలో అవినీతి చేపలు
ఏసిబికి చిక్కిన అదనపు కలెక్టర్
సీనియర్ అసిస్టెంట్‌తో పాటు పట్టుబడిన వైనం
భాదితుడి ఫిర్యాదుతో వలపన్నిన ఏసిబి
మన తెలంగాణ/ రంగారెడ్డి కలెక్టరేట్: ఓ జిల్లా స్థాయి అధికారి మరో ఉద్యోగితో కలసి లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్‌రెడ్డిలు అవినీతి నిరోధకశాఖ అధికారులు పన్నిన వలకు చిక్కారు. ధరణిలో నెలకొన్న సమస్యను తొలగించేందుకు భాదితుడు ముత్యంరెడ్డి అనే వ్యక్తి వద్ద నుండి రూ.8లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు చాకచక్యంగా వ్యవహరించి వారిని పట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. ముత్యంరెడ్డి అనే వ్యక్తి తనకున్న 14గుంటల భూమిని ధరణి వెబ్‌సైట్‌లో ప్రొహిబిటెడ్ లీస్ట్ నుండి తొలగించాలని కోరాడు. అందుకుగాను సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి ఎనిమిది లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో సదరు ముత్యంరెడ్డి ఈ విషయాన్ని ఏసిబి అధికారులకు చేరవేశాడు.

సోమవారం రాత్రి 11గం.ల సమయంలో ఓఆర్‌ఆర్ పరిధిలో భాదితుడు ముత్యంరెడ్డి వద్ద నుండి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ప్రోద్భలంతోనే తాను లంచం డిమాండ్ చేసినట్లు సీనియర్ అసిస్టెంట్ మధన్ మోహన్‌రెడ్డి ఏసిబి అధికారులకు తెలిపాడు. దీంతో ఏసిబి అధికారులు సీనియర్ అసిస్టెంట్ ఫోన్ నుండి అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డికి ఫోన్ చేయించి అతడితో మాట్లాడించారు. పెద్ద అంబర్‌పేట్ అవుటర్ రింగ్‌రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డికి తెలిపాడు. ఫోన్ సంభాషణలను విన్న ఏసిబి అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ అక్కడికి చేరుకుని అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కాగా సోమవారం రాత్రి నుండి భూపాల్‌రెడ్డి నివాసం వద్ద ఏసిబి అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఎసిబి సిటీ రేంజ్ 1 డిఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు జానకిరామ్ రెడ్డి, నరేశ్ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News