Thursday, June 13, 2024

తీర్పు ‘నేడు’

- Advertisement -
- Advertisement -

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

క్షణక్షణం ఉత్కంఠ.. నేతల్లో పెరుగుతున్న టెన్షన్
విఐపి నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో ఓట్ల పండుగ ముగిసింది. గురువారం తెలంగాణ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. బ్యాలెట్ బాక్స్‌లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. సుమారు రెండు నెలలు ప్రచారంతో హోరెత్తించిన బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజె పి, ఇతర పార్టీల అభ్యర్థులు ఈ ఎన్నిక ల్లో తమను గెలిపిస్తే తాము ఏం చేస్తామనేది ఓటర్లకు చెప్పి ఓట్లు అడిగారు. పార్టీల మేనిఫెస్టోలను, నాయకులు, అభ్యర్థుల మాటలను ఓటర్లు ఎంత వరకు నమ్మారు? ఏ నియోజకవర్గంలో ఎవరికి ఓట్లు అధికంగా వేశారు? అనేది అందరిలో టెన్షన్ నెలకొంది. అటు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు, ప్రజలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ ప్రతిపక్షంగా ఉంటుందో అని మరికొన్ని గంటల్లో తేలనుంది. ప్రజాతీర్పు ఎలా ఉన్నా అందరూ శిరసా వహించాల్సిందే. రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారో తెలుసుకునేందుకు తెలుగు ప్రజలతో పాటు జాతీయ పార్టీలకు చెందిన అగ్రనాయకులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లోనే మారనుంది.

వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు అసక్తికరంగా మారాయి. ఫలితాల సరళిపై ఇప్పటికే తెలంగాణతోపాటు ఆంధ్రపదేశ్ ప్రజలు రెండు రోజులుగా చర్చలు జరుపుతూ ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఆదివారం వెల్లడయ్యే తుది ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి వంటి ప్రధాన పార్టీలతో పాటు బిఎస్‌పి, ఇండిపెండెంట్ అభ్యర్థులు పో టీలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు వచ్చాయి…? ఇండిపెండెం ట్లు, ఇతర పార్టీల అభ్యర్థులు ఏ పార్టీకి నష్టం చేశారు..? ఏ పార్టీ గెలుపునకు దోహదపడ్డారో తేలనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుండగా, ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వెలువడనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ట్రెండ్ ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే దానిపై స్పష్టత రానుంది. మధ్యాహ్నం త ర్వాత గెలిచిన అభ్యర్థులు, ఆయా పార్టీ కేడర్లు సంబరాల్లో మునిగిపోనున్నాయి. అయితే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలిచి, తమ పార్టీ అధికారంలోకి వచ్చేంత ఎంఎల్‌ఎలు గెలవకపోతే మా త్రం గెలిచి కూడా నిరాశకు గురికానున్నారు. అభ్యర్థి గెలిచి, ఆ అభ్యర్థికి చెంది న పార్టీ అధికారంలోకి వచ్చేంత ఎంఎల్‌ఎలు గెలిస్తే మాత్రం ఆ అభ్యర్థులు, ఆయా పార్టీ కేడర్, కార్యకర్తల సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని వారందరూ సంబురాల్లో మునిగితేలనున్నారు.
పైకి ధీమాగా ప్రకటనలు
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాలు అమకే అనుకూలంగా ఉంటాయని పైకి ప్రకటనలు చేస్తున్నప్పటికీ లోలోపల గెలుస్తామా..? లేదా..? అని అంతర్మథననం చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి పోలింగ్ సరళిని చూస్తే చాలా స్థానాల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్లు కొనసాగింది. ఈ క్రమంలో ఎవరు గెలిచినా ఆధిక్యత తక్కువగా ఉండనుందని ప్రధాన పార్టీల అభ్యర్థులు అంచనా వేసుకుంటున్నట్లు సమాచారం.ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ఎక్కడ సఫలమయ్యాం…ఎక్కడ విఫలమయ్యామో అని పోలింగ్ కేంద్రాలవారీగా ఇప్పటికే విశ్లేషించుకున్న అభ్యర్థులు గెలుపు ఓటములపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
అగ్రనేతల గెలుపు ఓటములపై ఆసక్తి
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అగ్రనేతల ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో రెండు స్థానాలలో పోటీ చేయగా, టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, బిజెపి క్యాం పెయిన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా రెండు స్థానాల్లో బరిలోకి దిగారు. పోటీ రేవంత్‌రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేయగా, ఈటల రాజేందర్ హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లో పోటీ చేశారు.
ఆదివారం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్, హుజురాబాద్ ఫలితాలు తెలుసుకోవడంపై ప్రజలు ఎంతో ఆసక్తిగా చూపనున్నారు. ఇక ఈ ముగ్గురు నాయకుల్లో ఏ ఒక్కరు రెండు చోట్ల గెలిచినా ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అనంతరం మరో ఆరు నెలల్లో ఏదో ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానాలలో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఏ ఇద్దరు కలిసినా ఫలితాలపైనే చర్చ
రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, షాపింగ్ సెంటర్లు ఎక్కడ చూసినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి స్నేహితులు, బంధువులు, సహోద్యోగులతో సహా విద్యార్థులు, వ్యాపారులు అందరూ ఓటింగ్ సరళిని విశ్లేషిస్తూ ఫలితాల గురించే మాట్లాడుకుంటున్నారు. అన్ని వర్గాలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఎక్కువగా ఇదే చర్చ జరుగుతోంది. మళ్లీ బిఆర్‌ఎస్ గెలిచి కెసిఆరే ముఖ్యమంత్రి అవుతారని సాధారణ ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే తెలంగాణతో పాటు ఇప్పటికే ఎన్నికలు ముగిసిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కూడా డిసెంబర్ 3వ తేదీనే ఉంది.ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే సోమవారం విజోరాం ఫలితాలు వెలువడనున్నాయి. 2024లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నాయి. దాంతో ఈ ఐదు రాష్ట్రాల ఫలితాల కోసం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News