Friday, May 3, 2024

కిస్సింజర్ జైత్రయాత్రకు భారత్ కళ్ళెం

- Advertisement -
- Advertisement -

20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద దౌత్యవేత్తలలో ఒకరుగా పేరొందిన హెన్రీ కిస్సింజర్ 100 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు. ఇద్దరు అమెరికా అధ్యక్షుల వద్ద జాతీయ భద్రత సలహాదారునిగా, విదేశాంగ కార్యదర్శిగా- మొదటిసారిగా రెండు పదవులలో పని చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన అమెరికా విదేశాంగ విధానాన్ని మలచడంలోనే కాకుండా, రాజకీయ విధానాలలో సహితం దశాబ్దాల పాటు విశేషమైన ప్రభావం చూపారు. 1977లో ప్రభుత్వాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా చాలా కాలం వరకు విదేశాంగ విధాన సమస్యలపై ప్రముఖ స్వరంగా గుర్తింపు పొందారు. 1990వ దశకం చివరి వరకు కూడా అమెరికా అధ్యక్షులు, ప్రముఖులు అంతర్జాతీయ వ్యవహారాలపై ఆయన సలహాల కోసం చూస్తూండేవారు.
అలెగ్జాండర్ ది గ్రేట్ తన సైన్యంతో తూర్పు వైపు జైత్రయాత్ర ద్వారా ప్రపంచాన్ని జయించాలనే చరిత్రాత్మక ప్రయత్నాన్ని సింధు ఒడ్డున భారతీయులు అడ్డుకున్న విధంగా ప్రచ్ఛన్నయుద్ధం హయాంలో అమెరికా దౌత్య జైత్రయాత్రను తిరుగులేని విధంగా మలచిన హెన్రీ కిస్సింజర్ చేసిన ప్రయత్నాలకు యమునా నది తీరంలో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ గర్వభంగం కలిగించారని చెప్పవచ్చు.

వాషింగ్టన్ రౌడీ దౌత్యాన్ని ధిక్కరిస్తూ, ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ ఒక కొత్త దేశంగా ఆవిర్భవించడానికి 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం ద్వారా ఇందిరా గాంధీ కారణమైనప్పుడు ఆమెను అడ్డుకొనేందుకు అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ప్రతినిధిగా కిస్సింజర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జనరల్ సామ్ మానెక్షా నేతృత్వంలోని భారత సైన్యం దీటుగా నిలబడడంతో పాకిస్తాన్ నియంత పాలకునికి మద్దతుగా అమెరికా చేసిన బెదిరింపులు భారత్ ముందు పనిచేయలేదు.
ఢిల్లీలో అప్పట్లో ప్రసిద్ధి చెందిన జోక్
పాకిస్తాన్, చైనాలను ఉపయోగించుకొని బంగ్లాదేశ్ విముక్తి చేయకుండా భారత్‌ను కట్టడి చేయాలని చేసిన ప్రయత్నాలు విఫలమైన మూడేళ్లకు 1974లో భారత్‌లో కిస్సింజర్ పర్యటించారు. ఆ సందర్భంగా ఢిల్లీ వర్గాలలో ఒక జోక్ ప్రసిద్ధి చెందింది. కిస్సింజర్ ఇజ్రాయెల్‌ను సందర్శించగా ఒక సూట్ లెంగ్త్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇది చాలా చిన్నదని టెల్ అవీవ్ టైలర్లు పెదవి విరిచారు. కైరోలోని టైలర్లు కూడా ఇదే మాట చెప్పారు. అయితే, న్యూఢిల్లీకి చేరుకున్న అతన్ని ప్రసిద్ధి చెందిన సిక్కు టైలర్లకు పేరొందిన లోడి కాలనీకి తీసుకువెళ్లారు.వారు సాయంత్రం రండి అంటూ సాయంత్రం రాగానే అదే వస్త్రం నుండి కుట్టిన ఒక పర్ఫెక్ట్ ఫిట్ సూట్‌ను అందించారు. దానితో ఆశ్చర్యపోయిన ఆయన ‘మీరు దీన్ని ఎలా చేయగలరు? మధ్యప్రాచ్యంలోని వారు చేయలేకపోయారు’ అంటూ ప్రశ్నించాడు. దానికి వినయంగా టైలర్ ‘నువ్వు అక్కడ పెద్ద మనిషివి’ అంటూ తన తలపాగాని సరిచేసుకుంటున్నాడు. ‘ఇక్కడ కాదు’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. 1971 యుద్ధం విషయంలో కిస్సింజర్ దౌత్యం దక్షిణాసియాలో విఫలంకావడంతో మొత్తం ప్రపంచం లో ‘తిరుగులేని దౌత్యవేత్త’ అయినప్పటికీ భారతీయుల దృష్టిలో ‘విఫల దౌత్యవేత్త’ అని స్పష్టం అవుతున్నట్లు ఆ టైలర్ వాఖ్యలు వెల్లడి చేస్తున్నాయి.

1971లో బంగ్లాదేశ్‌గా అవతరించిన పూర్వపు తూర్పు పాకిస్తాన్ నుండి సుమారు కోటి మంది శరణార్థులు తమ భద్రత కోసం భారత్‌లోకి ప్రవేశిస్తున్నారని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆందోళన చెందుతున్న సమయంలో కిస్సింజర్ పాకిస్తాన్ పట్ల సానుభూతితో, భారత్ పట్ల కఠినంగా వ్యవహరించారు. పాకిస్తాన్ సైన్యం, నాటి పాక్ పాలకులు ఆ శతాబ్దంలో అతిపెద్ద మానవ హక్కుల విపత్తులలో ఒకటైన మూడు మిలియన్ల మందిని చంపి, సుమారు 3,00,000 మంది మహిళలపై అత్యాచారం చేసినట్లు అంచనా. అయితే, పాకిస్తాన్‌కు అనుకూలంగా అమెరికా తీసుకున్న విధానం ‘వాస్తవిక రాజకీయం’గా కిస్సింజర్ సమర్ధించుకున్నారు. ఆ తర్వాత బయటపడిన అమెరికా రహస్య పత్రాలలో ఆ సమయంలో వ్యక్తిగత సంభాషణలలో ఇందిరా గాంధీ పట్ల అత్యంత అవమాకరమైన, అసభ్యకరమైన, పరుష పదజాలం ఉపయోగించాడని వెల్లడైంది. భారతీయులను ‘బాస్టర్డ్’ (మూర్ఖులు) అని అభివర్ణించాడని తెలిసింది. ఆగస్టు 1971లో భారతదేశం సోవియట్ యూనియన్‌తో స్నేహ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో అమెరికా ఓ యుద్ధనౌకను భారత్ పైకి పంపినా భారత ప్రభుత్వం బెదిరిపోలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ రాజకీయంగా కూడా బలహీనం కావడం, బంగ్లాదేశ్ భారత్‌తో స్నేహంగా ఉండడంతో ఆ సమయం కిస్సింజర్ భారత్ పట్ల శత్రు వైఖరి అవలంబించి ఘోర పరాభవానికి గురయ్యారని చెప్పవచ్చు.

‘నేను రోజుకు 15 గంటలు పని చేస్తాను’ అంటూ 100 ఏళ్లకు ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన పట్ల ప్రపంచ నాయకులు అందరూ గౌరవప్రదంగానే వ్యవహరిస్తుండేవారు. బహుశా అమెరికా అధ్యక్షులు మాత్రమే కాకుండా చైనాకు చెందిన జి జిన్‌పింగ్ లేదా రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రపంచ నాయకులు ఎవరైనా ఆయన ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉండేవారు.బహుశా సుదీర్ఘకాలం అంతర్జాతీయ వ్యవహారాలలో అటువంటి గుర్తింపు పొందినవారు మరొకరు లేరని చెప్పవచ్చు. అమెరికా విదేశీ వ్యవహారాలపై అత్యంత విశ్వసనీయమైన, విలక్షణమైన స్వరాలలో ఒకదాన్ని కోల్పోయింది అంటూ ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ నివాళులు అర్పించారు. విదేశాంగ విధానాన్ని వాస్తవిక రాజకీయాలలో మిళితం చేయడం ఆయన ప్రత్యేకతగా భావిస్తుంటారు. నైతిక ఆదర్శాల కంటే ఆచరణాత్మక లక్ష్యాల ఆధారంగా వ్యవహరించిన కారణంగా ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో కూడా అమెరికా చైనా సంబంధాలలో ప్రతిష్టంభనను తగ్గించగలిగారు. సోవియట్ యూనియన్‌తో అణు నిరాయుధీకరణ చర్చలు జరప గలిగారు. సోవియట్ యూనియన్‌తో వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు, బాలిస్టిక్ వ్యతిరేక క్షిపణి ఒప్పందంపై చర్చలు జరిపాడు.

ఆ విధంగా రెండు అణు అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాడు. పైగా 1970ల ప్రారంభంలో అమెరికా చైనాల మధ్య బ్యాక్ చానల్ చర్చలను ప్రారంభించి, అధికారిక దౌత్య సంబంధాల స్థాపనకు దారితీయించగలిగాడు.1972లో చైనాలో నిక్సన్ చరిత్రాత్మక చైనా పర్యటనకు ఈ ప్రయత్నాలు దోహదపడ్డాయి. ఆయన అనుసరించిన ‘షటిల్ దౌత్యం’ కూడా 1973 అరబ్- ఇజ్రాయెల్ యుద్ధాన్ని నియంత్రించడంలో సహాయపడింది. అయితే, పలు దేశాల మధ్య సంఘర్షణలలో ఆయన పాత్ర ఇప్పటికీ వివాదాస్పదంగా వుంది. ఒక విధంగా ఆయన దౌత్యనీతిలో చీకటి అధ్యాయాలుగా చెప్పవచ్చు.వియత్నాం యుద్ధంలో కంబోడియాపై కార్పెట్ బాంబింగ్‌లో కిస్సింజర్ కీలక పాత్ర పోషించాడు. ఇది వేలాది మంది పౌరుల మరణానికి దారితీసింది. మారణ హోమం సాగించిన ఖైమర్ రూజ్ పాలన పెరుగుదలకు సహాయపడింది. అయితే ఆశ్చర్యకర అంశం ఏమిటంటే వియత్నాం యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చర్చలలో పాల్గొన్నందుకు 1973లో నోబెల్ శాంతి బహుమతిని పంచుకున్నాడు. సైనిక తిరుగుబాటుకు పునాది వేసిన చిలీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కడం, ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని నివాసితులను చంపిన పాకిస్తాన్ నియంతకు ఆయుధాలను పంపడం వంటి వివాదాస్పద పాత్రలు పోషించాడు. అమెరికా ప్రయోజనాల కోసం చేసినట్లు చెప్పుకొన్నప్పటికీ

ఇటువంటి పలు అంశాలలో కిస్సింజర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. 1976లో మితవాద సైనికనాయకులు అర్జెంటీనాలో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు కిస్సింజర్ వారితో ‘చేయవలసిన పనులు ఉంటే, మీరు వాటిని త్వరగా చేయండి’ అంటూ ప్రోత్సహించారు. అసమ్మతివాదులకు వ్యతిరేకంగా అర్జెంటీనా నియంతృత్వం అనుసరించిన ‘డర్టీ వార్’ కి పచ్చజెండా ఉపారని తీవ్రమైన విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. వీరి హయాంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ప్రబలంగా జరిగాయి. పది వేల మంది ప్రజలు హింసకు గురవడమో, హత్య కావింపబడటమో లేదా ‘అదృశ్యం’ కావడమో జరిగింది. అయితే తనను ‘యుద్ధ నేరస్థుడు’గా భావిస్తున్న వారి గురించి ప్రశ్నించగా ఒక ఇంటర్వ్యూలో ‘అది వారి అజ్ఞానానికి అద్దం పడుతోంది’ అంటూ అహంకార పూరితంగా జవాబిచ్చారు. అయితే కేవలం అమెరికాలోనే కాకుండా దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆగ్నేసియా దేశాల వ్యవహారాలలో సహితం ఆయన కీలకమైన భూమిక వహించారు. కిస్సింజర్ మే 27, 1923 న జర్మనీలో హీన్జ్ ఆల్ఫ్రెడ్ కిస్సింగర్‌గా జన్మించారు. 1938లో అతని యూదు కుటుంబం నాజీ జర్మనీ నుండి పారిపోయి న్యూయార్క్ నగరంలో పునరావాసం పొందింది. అక్కడ అతనిని హెన్రీ అని పిలవడం ప్రారంభించారు. అకౌంటెంట్ కావాలని అనుకున్న అతను 19వ పుట్టిన రోజుకు కొంత కాలం తర్వాత అమెరికా సైన్యంలో చేరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News