Monday, June 24, 2024

గజదొంగ భాకర్ అలీ అరెస్ట్.. సినీ ఫక్కీలో ఛేజింగ్

- Advertisement -
- Advertisement -

గజదొంగ భాకర్ అలీ అరెస్ట్
కరుడుగట్టిన నేరస్తుడిపై 118 కేసులు
45 రోజులపాటు తెలంగాణ, కర్ణాటక పోలీసుల జాయింట్ ఆపరేషన్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా 45 రోజుల పాటు జాయింట్ ఆపరేషన్ చేసి 118 కేసుల్లో నిందితుడిగా ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు భాకర్ అలీని శనివారం అరెస్టు చేసినట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. భాకర్ అలీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పిడి యాక్టు కేసులు ఉన్నాయని వివరించారు. 2015 ముందే హైదరాబాద్‌లో వందకుపైగా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని, ఈక్రమంలో నేరస్తుడిని పట్టుకునేందుకు వందల సిపి కెమెరాలను పరిశీలించామని పేర్కొన్నారు. నేరస్తుడి నుంచి గంజాయి సహా కార్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుని కోసం నవీ ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూర్, షోలాపూర్, బీదర్‌లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని, అయితే గజదొంగ భాకర్‌ఆలీ పోలీసులపై అటాక్ చేసి తప్పించుకునేందుకు పోలీసులను గాయపరిచనట్లు తెలిపారు.
ఒంటరి మహిళలే లక్ష్యం:
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని, రెప్పపాటులో మహిళల పై దాడి చేసి బంగారు గొలుసులను కొట్టేయడంలో భాకర్ అలీ సిద్ధహస్తుడని సిపి తెలిపారు. 2020 డిసెంబర్ 1న సుమారు 07:30 గంటలకు కరీంనగర్ పట్టణానికి చెందిన వృద్ధురాలు కూరగాయల మార్కెట్లు ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుండగా మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు దొంగలు అకస్మాత్తుగా మహిళ మెడలోని బంగారు గొలుసును తెంపుకొని రెప్పపాటులో పారిపోయాడన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు పరిశోధన ప్రారంభించారని, పరిశోధన ప్రారంభించిన పోలీసులకు కేసులో ఎటువంటి ఆనవాళ్లు లేక కేసు ఒక పెద్ద సవాలుగా నిలిచిందన్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఈ కేసును ఛేదించడానికి వివిధ విభాగాలు సిసిఎస్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, క్రైమ్ టీమ్స్‌కు చెందిన అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
వందలాది సిసి కెమెరాల పరిశీలన :
గజదొంగ భాకర్ అలీ చోరీకి పాల్పడిన ఘటన స్థలంలో ఉన్న సిసి కెమెరా, ఆ వీధిలో ఉన్న సిసి కెమెరాలు సహా కొన్ని వందల సీసీ కెమెరాలను పరిశీలించగా కన్నడ భాషలో రాసిన నంబర్ కలిగిన మోటార్ సైకిల్‌ను పోలీసులు గుర్తించారు. అనంతరం నగరంలోని మహిళలను గమనిస్తూ, అశోక్ నగర్ కూరగాయల మార్కెట్ ఏరియాలో వృద్ధ మహిళ మెడలో నుంచి గొలుసు దొంగిలించి అక్కడి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లినట్టుగా గుర్తించడం జరిగిందన్నారు. హైదరాబాద్ మార్గంలో ఉన్న పలు కెమెరాలను పరిశీలిస్తుండగా కొత్తపల్లి టోల్ గేట్ వద్ద కారు, మోటార్ సైకిల్ కలిసి వెళ్తున్న విషయం గమనించారు. ఈక్రమంలో దొంగలు మోటార్ సైకిల్ తో పాటు ఒక కారును కూడా ఉపయోగించి ఉండవచ్చని భావించి, ఆ కారు ను కుణ్ణంగా పరిశీలించగా అది కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన కారుగా గుర్తించామన్నారు.
బీదర్ గ్యాంగ్ పనిగా గుర్తింపు
వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడిన కరుడు గట్టిన బీదర్ ఇరానీ గ్యాంగ్‌లోని కీలక నిందితుడు భాఖర్ అలీ అలియాస్ బుల్లెట్ బాఖర్ అలియాస్ అక్బర్ అలీ అలియాస్ బాబర్ ముఠా పనిగా కరీంనగర్ పోలీసులు గుర్తించినట్లు సిపి కమలాసన్‌రెడ్డి తెలిపారు.ఈక్రమంలో హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లోని పలు ప్రాంతాలు, ముంబై పరిసర ప్రాంతాలకు కూడా దొంగల ముఠా కదలికలను గమనించి నేరస్తుల ఆచూకీ కనుగొని ఇళ్లపై బీదర్ లో దాడి చేశామన్నారు. కాగా కరుడుగట్టిన దొంగల ముఠా ప్రత్యేక బృందంలో కీలక నిందితుడు భాఖర్ అలీ అలియాస్ బుల్లెట్ బాఖర్ అలియాస్ అక్బర్ అలీ అలియాస్ బాబర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.
మరి కొందరు నిందితులు
అక్బర్ అలీ తన మిత్రులు జైదీ అబ్బాస్, గులాం అలీ అలియాస్ రాధే, హుస్సేన్ బిలాల్, తాలిబ్ హుస్సేన్ అనే ఇతర దొంగలతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి పలు రాష్ట్రాల్లో సంచలనమైన దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దొంగతనమే వృత్తిగా చేసుకుని వందకు పైగా కేసులు పదికిపైగా రాష్ట్రాల్లో నిందితులుగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కోసం వేట సాగిస్తున్నామని సిపి తెలిపారు.

Karimnagar Police Arrested to Thief Bhakar Ali

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News