Thursday, May 2, 2024

కర్నాటకను కుదిపేస్తున్న బదిలీలు, ముడుపుల స్కామ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ముడుపులకు బదిలీల ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాలు విసిరారు. సిఎం సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర పెద్ద ఎత్తున బదిలీల కుంభకోణం నడిపిస్తున్నారని జెడిఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు హెచ్‌డి కుమారస్వామి పదేపదే విమర్శిస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం సిఎం సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో స్పందించారు. లేని పోని ఆరోపణలు చేయడం కాదు. ఏ ఒక్క బదిలీని అయినా తాను డబ్బులు తీసుకుని చేసినట్లు నిరూపించగలరా? నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని స్పష్టం చేశారు. కుమారస్వామి పాలన కాలంలోనే ఇటువంటి కుంభకోణాలు అనేకం జరిగాయని తెలిపారు.

కుమారస్వామి ఆరోపణల గురించి విలేకరులు తనను ప్రశ్నించవద్దని, తాను వీటికి ఇప్పటికే సమాధానం చెప్పానని సిద్ధరామయ్య గుర్తు చేశారు. ఆయన ఎన్నిసార్లు అయినా ఈ ఆరోపణలు ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చేసుకోవచ్చు. నిజానికి ఆయన మాట్లాడుతున్నదంతా కేవలం ఆయన సిఎంగా ఉన్న హయాంలో జరిగిన పాపం గురించి అని అంతా భావించాల్సి ఉంటుందని అన్నారు. జెడిఎస్ నేతలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు స్వీకరించిన ముడుపుల గురించి ఇప్పుడు కుమారస్వామి చెపుతున్నారని , తమ హయాంలో అంతా స్వచ్ఛంగా సాగుతోందని, బదిలీలకు ఒక్క పైసా తీసుకోలేదని, ఏది జరిగినా పద్ధతి ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను తక్షణం రాజకీయాలకు గుడ్‌బై చెపుతానని సిద్ధరామయ్య తెలిపారు.

కుదిపేస్తున్న ఫోన్ టాక్ కర్నాటకలో సిఎస్‌ఆర్ పాలన
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వరుసగా స్కామ్‌ల ఆరోపణలు ఎక్కువ అవుతూ వస్తున్నాయి. ఇటీవలే కుమారస్వామి ఓ ఫోన్‌సంభాషణ ఆడియో క్యాసెట్‌ను సామాజిక మాధ్యమంలో పొందుపర్చారు. ఇందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రతో మాట్లాడుకున్నట్లుగా ఉంది. బదిలీల వ్యవహారం దేనికెంత విషయంపై ఇద్దరూ మాట్లాడుకున్నట్లు కుమారస్వామి ఈ నేపథ్యంలో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. యతీంద్ర కూడా దీనిని కొట్టిపారేశారు. తండ్రీకొడుకులు కలిసి పెద్ద ఎత్తున చివరికి పోలీసు అధికారుల బదిలీలకు కూడా పాల్పడుతున్నారని,

ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని కుమారస్వామి ఆరోపించారు. యతీంద్ర ఇప్పుడు సూపర్ సిఎంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే సిఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సి ఉందని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు యతీంద్ర కరప్ట్ సన్ ఆఫ్ సిద్ధరామయ్య (సిఎస్‌ఆర్) అని ఘాటైన పదజాలంతో తిట్టిపోశారు. రాష్ట్రంలో 224 నియోజకవర్గాలకు ఈ సిఎస్‌ఆర్ పర్యవేక్షకులు అయ్యారని విమర్శించారు, సిఎస్‌ఆర్‌కు చెందుతున్న రెండు శాతం కమిషన్ల గురించి అంతా దృష్టి సారించాల్సి ఉందన్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News