Tuesday, April 30, 2024

కర్ణాటక యథేచ్ఛ జలచౌర్యం

- Advertisement -
- Advertisement -

Karnataka is trying to increase height of Almatti Dam

 

భూమి మీద ఉన్న అన్ని జీవులకు జలవనరులు అత్యంత ఆవశ్యకమైనవి. భూ ఉపరితలం పైన నాలుగు వంతులలో మూడు వంతులు నీటితో నిండి ఉండడం మూలంగా భూమిని ‘జల గ్రహం’ అంటారు. ఒక దేశం ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో లభించే నీటి వనరులపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో అనేక దేశాలు వాటి జనాభాకి సరిపడా ఆహార పదార్థాల ఉత్పత్తికి నీటి వసతి లేకపోవడం వలన అనేక దేశాలు కరువుతో అలమటిస్తున్నాయి. భూ ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచడంలో, కాలుష్య కారకాల గాఢతను తగ్గించడంలో, వాతావరణ మార్పులను కలిగించడం లో నీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక జాతి అభివృద్ధి, సాంఘిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు, పర్యావరణ సమతుల్యత అక్కడి నీటి వనరులతో ముడిపడి ఉంటాయి. భారత దేశ భౌగోళిక సరిహద్దులను గమనిస్తే ఉత్తరాన మంచుతో కూడిన హిమాలయాలను కలిగి శత్రు దుర్భేద్యంగా ఉన్నాయి.

దక్షిణాన ద్వీపకల్ప పీఠభూమిని కలిగి ఉండి మూడు వైపులా సముద్ర సరిహద్దులను కలిగి ఉంది. దానితో పాటు వివిధ జీవ నదులకు జన్మస్థానం హిమాలయాలలోనే వుంది. ఒకవైపు ఎడారి ప్రాంతం, ఇంకో వైపు దట్టమైన అరణ్యాలతో ఉన్న ప్రాంతాలు, కరువుతో అల్లాడే రాష్ట్రాలు, వర్షాకాలంలో నీటితో మునిగిపోయే ప్రాంతాలు వున్నాయి. ఒక్కో ప్రాంతంలో నీటి సమస్యలు లేకుండా ఉండి ఇంకో ప్రాంతంలో విపరీత నీటి కొరత వుంది. దీని వలన వివిధ రాష్ట్రాల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య జల యుద్ధాలు జరుగుతూ ఘర్షణ పూరక వాతావరణం ఏర్పడుతున్నది. ఇటీవల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా దశాబ్దాలుగా నీళ్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పడినదే. ఎన్నో సంవత్సరాలుగా కర్ణాటక కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి ప్రయత్నిస్తూ తెలుగు రాష్ట్రాలను ఎడారిగా మార్చే విధంగా ప్రణాళికలను రూపొందిస్తోంది.

కృష్ణ నదీ జలాలపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతున్నది. 1969లో ఆర్‌ఎస్ బచాయత్ ఆధ్వర్యంలో కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1973 లో తీర్పును వెల్లడించింది. దీనిపై 2002 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్రలు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. దానితో 2004 ఏప్రిల్లో బ్రిజేష్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ ప్రస్తుతం కూడా కొనసాగుతూ వస్తున్నది. ఈ ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి 1001 టియంసి లు, మహారాష్ట్రకి 666 టియంసిలు, కర్ణాటకకి 911 టియంసి లను కేటాయించారు. కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యామ్‌ని 119 టియంసిల కెపాసిటీతో, 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఉదేశంతో కృష్ణా నదిపై నిర్మించారు. దీని తర్వాత జూరాల ప్రాజెక్ట్ ని 11 టియంసితో లక్ష ఎకరాలకు, శ్రీశైలం ప్రాజెక్ట్‌ను 215 టియంసిలతో 5.9 లక్షల ఎకరాలకు, ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌ని 312 టియంసిలతో 21 లక్షల ఎకరాలకు సాగు నీటిని కల్పించాలని నిర్మించారు. ఇంతకు ముందే కృష్ణా నదిపై కర్ణాటక అనేక ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించి జల దోపిడీకి పాల్పడుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య కూడా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో అనేక వివాదాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే గోదావరి నదిపై మహారాష్ట్ర పదుల సంఖ్యలో అక్రమ నీటి ప్రాజెక్ట్‌ల మూలంగా తెలంగాణలో గోదావరి ప్రవేశించే వరకే వరద ఉధృతి ఉంది. ఈ అక్రమ ప్రాజెక్ట్‌ల వల్ల గోదావరి నుండి వచ్చే నదీ జలాలు తగ్గాయి. దీనిని నివారించుటకు కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత, గోదావరి నదుల సంగమం వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. కృష్ణ నీటి చౌర్యం పై సుప్రీంకోర్టులో దీనిపై రెండు కేసులు పెండింగ్‌లో వున్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచే పనిలో భాగంగా చర్యలు చేపడుతూ ఉంది. ఇది వరకే ఉన్న 519 మీటర్ల ఎత్తును 524 మీటర్ల ఎత్తుకు పెంచాలని, కొత్త్తగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా, రూ. 51 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించి భూసేకరణ మొదలుపెట్టింది. ప్రాజెక్టుకి సంబంధించిన డిపిఆర్‌ని సిద్ధం చేసి జలశక్తి శాఖకి పంపించింది. కేంద్రం ఇప్పటి వరకు నోటిఫై చేయకున్నా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా, సుప్రీంకోర్టులో దీనిపై స్టే కొనసాగుతున్నా కర్ణాటక ప్రభుత్వం మొండి పట్టుదలతో ప్రాజెక్టు ఎత్తు పెంచాలని భీష్మించుకొని ముందుకు సాగుతుంది.

నదీ ఆధారిత జల ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల అనేక అనర్థాలను భవిష్యత్తులో చవిచూడాల్సి వస్తుంది. భారీ ప్రాజెక్టుల వలన అనేక ఎకరాల సారవంతమైన నేలలు, గ్రామీణ సముదాయాలు ముంపునకు గురవుతాయి. వీళ్ళను వేరే ప్రాంతాలకు తరలిస్తే సాంస్కృతిక పరమైన సమస్యలు తలెత్తుతాయి. పునరావాస సమస్యలు సంభవిస్తాయి. మలేరియా లాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. పర్యావరణ అసమతుల్యం చెందుతుంది. జీవ వైవిధ్యం మార్పు చెందుతుంది. నీటి నిల్వ మూలంగా క్షారత్వం పెరిగి భూ వనరులు ఉత్పాదక సామర్ధ్యాన్ని కోల్పోతాయి. భారీ జల ప్రాజెక్టుల వలన సమీప భవిష్యత్తులో భూకంపాలు వచ్చే ప్రమాదాన్ని కొట్టిపారేయలేము.

అలాగే రాజకీయ వాతావరణం రెండు రాష్ట్రాల మధ్య తలెత్తి సంఘర్షణ ఏర్పడి అనేక జల ఉద్యమాలు కొనసాగుతాయి. దీని వలన ఆయా రాష్ట్రాల ఆర్థిక ప్రగతి స్తంభిస్తుంది. ప్రజల మధ్య దూరం పెరుగుతుంది. ఇప్పటికే కావేరి నదీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అనేక పోరాటాలు చేస్తున్నాయి. కృష్ణ జలాల విషయంలో కూడా తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ న్యాయ పోరాటాలు చేస్తున్నాయి. నదీ జలాలలో హక్కులను సాధించుకొనేందుకే తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగింది. మహదాయి నదీ జలాల పంపిణీలో మహారాష్ట్ర, గోవాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు వున్నాయి. గోదావరి, మహానది ఇంకా అనేక నదుల జల పంపిణీ సమస్య లు తలెత్తున్నాయి. వీటిని పరిష్కరించుటకు జల నిర్వహణ బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని లెక్కచేయకుండా అక్రమ ప్రాజెక్టులను వివిధ రాష్ట్రాలు చేపడుతూనే వున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగు రాష్ట్రాలకే కాకుండా మహారాష్ట్రకి కూడా నష్టం వాటిల్లుతుంది. కావున ఆ రాష్ట్రాన్ని కూడా కలుపుకొని ముగ్గురు ముఖ్యమంత్రులు జలశక్తి శాఖకి ఫిర్యాదు చేయాలి.

అలాగే సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ పోరాటం చేయాలి. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో తెలుగు రాష్ట్రాల అన్ని పార్టీల ఎంపి లు ఐక్యంగా పార్లమెంట్‌లో గళమెత్తాలి. కేంద్ర జల సంఘానికి కూడా ఫిర్యాదు చేయాలి. కర్ణాటక చేస్తున్న జల దోపిడీని దేశం దృష్టికి తీసుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు బాధ్యతగా కృష్ణ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో అపెక్స్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేయించి రాష్ట్రాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణాన్ని తగ్గించాలి. లేదంటే రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు తప్పవు. అలాగే తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ఎడారిగా మారే అవకాశాన్ని తీసిపారేయలేము.

ఇప్పటికే జల వనరుల నిర్వహణకు నమామి గంగే, జలక్రాంతి అభియాన్, జల శక్తి మిషన్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన లాంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. దేశంలో జలవనరుల శాస్త్రీయ నిర్వహణకు అనుసరించవలసిన వ్యూహాలను రచించి జల వనరులను ఉపయోగించేటప్పుడు జాతీయ దృక్పథంతో వ్యవహరించాలి. అందుకు తగిన విధానాలను, ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. రాష్ట్రాల మధ్య జల వివాదాలను దృష్టిలో పెట్టుకొని నదీ అనుసంధాన ప్రక్రియను చేపట్టాలి. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులకు తప్ప కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకూడదు. దుర్భిక్ష ప్రాంతాలలో నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వాటర్ షెడ్ నిర్మాణ పథకాలను ప్రోత్సహించాలి. తుంపర, బిందు సేద్య పద్ధతులను ప్రవేశపెట్టి నీటి వృథాను అరికట్టాలి. ఇలా కేంద్ర ప్రభుత్వమే నదీ జలాల విషయంలో ఏర్పడే వివాదాలను పరిష్కరించేందుకు చొరవ చూపాలి.ప్రతి దేశం ఆర్థిక వ్యవస్థపై నదుల పాత్ర చెప్పుకోదగినదిగా ఉంటుంది. ప్రపంచంలో ఏ నాగరికత పుట్టుక కూడా నదుల పక్కనే అభివృద్ధి చెందింది. అందుకే నదీ జలాల పంపిణీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి వుంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News