Friday, May 3, 2024

కెనడాలో ఖలిస్థాన్ టైగర్‌ఫోర్స్ చీఫ్ కాల్చివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం “వాంటెడ్ టెర్రరిస్టు ”గా ప్రకటించిన ఖలిస్తానీ ఉగ్రవాది, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ , గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ అధిపతి హర్‌దీప్ సింగ్ నిజ్జర్( 46)ను ఆదివారం సాయంత్రం కెనడా లోని ఓ గురుద్వారాలో కాల్చి చంపారు. కెనడా లోని సర్రేలో ఇద్దరు గుర్తు తెలియని యువకులు గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో కాల్పులకు పాల్పడ్డారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు కార్యకలాపాల నిర్వహణ, నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం, శిక్షణ, ఆర్థిక సహకారం వంటివి హర్‌దీప్ అందిస్తాడు. ఇతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌లో ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తోంది. సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా హర్‌దీప్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

ఇటీవల ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇతడి హస్తం ఉంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 40 మంది ఉగ్రవాదుల జాబితాలోనూ నిజ్జర్ పేరుంది. 2022లో పంజాబ్‌లో ఓ హిందూ అర్చకుడి హత్యకు కుట్ర పన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో హర్‌దీప్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రూ. 10 లక్షల రివార్డును ప్రకటించింది. హర్‌దీప్ సామాజిక మాధ్యమ ఖాతాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు , చిత్రాలు ఉన్నాయి. గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ఉన్న సమయంలో కెనడాకు అప్పగించిన మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఇతడి పేరును కూడా చేర్చారు.

2018లో ఈ జాబితాను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అప్పగించారు. పంజాబ్ రాష్ట్రంలో కూడా హర్‌దీప్‌పై చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఇతడిపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ అయింది. పంజాబ్ రాష్ట్రం జలంధర్ లోని బహర్‌సింగ్ పుర గ్రామానికి చెందిన వ్యక్తి హర్‌దీప్ . అతడికి చెందిన భూమిని పంజాబ్ ప్రభుత్వం సీజ్ చేసింది. ప్రస్తుతం హర్‌దీప్ సింగ్ కుటుంబీకులు ఎవరూ స్వగ్రామంలో లేరు.

Also Read:“రా” అధిపతిగా రవిసిన్హా నియామకం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News