హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం సిట్ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన విచారణకు వెళ్లే ముందు.. వచ్చిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ విమర్శలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) కౌంటర్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ విభాగంపై సంజయ్‌కు కనీస పరిజ్ఞానం లేదని కెటిఆర్ మండిపడ్డారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నా.. ఆయనకు ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంతో ఆయన చేస్తున్న ప్రకటనలు హద్దులు మీరాయని ఆరోపించారు. చౌకబారు రాజకీయాలతో ఆయన మరింత దిగజారారని రాజకీయ ఉనికి కోసం రోడ్లపై చౌకబారు నాటకాన్ని ఎంచుకున్నారని ఎక్స్ వేదికగా కెటిఆర్ (KTR) పోస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో నిజం ఉంటే వెంటనే ఆధారాలతో నిరూపించాలని.. లేదంటే 48 గంటల్లో వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని సవాల్ విసిరారు. లేదంటే లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు.