Sunday, June 16, 2024

ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / వనపర్తి ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన కాదని.. ప్రతీకార పా లన అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కల్వకుంట్ల తారక రామారావు అ న్నారు. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండల పరిధిలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన  బిఆర్‌ఎస్ మండల సీనియర్ నాయకుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి (50)ని గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. ఈ సంఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సంచలనం సృష్టించిది. మండలంలోని వేలగొండ గ్రామం నుండి అమ్మాయిపల్లి వరకు శ్రీధర్‌రెడ్డి అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ నాగర్‌కర్నూల్ పార్లమెంటు పార్టీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంఎల్‌ఎలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు తదితరులు పాల్గొని ఘనమైన నివాళులర్పించారు.ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కొల్లాపూర్ నియోజకవర్గంలో రెండవ హత్య శ్రీధర్‌రెడ్డిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన మరిచి ప్రతీకార పాలన సాగిస్తోందని, ఇది అంత మంచిది కాదని హితవు పలికారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే మంత్రి జూపల్లి కృష్ణా రావును బర్తరఫ్ చేయాలని సిఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. కాగా, తమ పార్టీ కార్యకర్తలపై మంత్రి జూపల్లి అనుచరులు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం విడ్డూరమని మండిపడ్డారు. నియోజకవర్గంలో జరుగుతున్న దాడులపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, విచారణ చేపట్టాలని, లేనిపక్షంలో జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జూపల్లి పేరుతో మృతుడు శ్రీధర్‌రెడ్డి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు మంత్రి పేరును తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులపై 15 రోజుల క్రితం తమ పార్టీ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్‌రెడ్డి డిజిపిని కలిసి విన్నవించారని అన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇకనైనా తమ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

శ్రీధర్ రెడ్డి హత్యపై సిబిఐ విచారణ చేపట్టాలి
మాజీ ఎంఎల్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి
మండల పరిధిలోని లక్ష్మీపల్లిలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బొడ్డు శ్రీధర్‌రెడ్డి హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్‌రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీధర్‌రెడ్డి హత్య ముమ్మాటికీ రాజకీయ హత్య అని అన్నారు. శ్రీధర్‌రెడ్డి మండలంలో మంచి పేరుపొందిన వ్యక్తి అని, అతని రాజకీయ ఎదుగుదల గిట్టని కొందరు వ్యక్తులు మంత్రి జూపల్లి ప్రోద్బలంతోనే హత్య చేశారని ఆరోపించారు. ఆందోళన కార్యక్రమంలో పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News