Sunday, June 16, 2024

ఆల్‌టైమ్ హైకి మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. నిఫ్టీ 22,950 పాయింట్లను, మరోవైపు సెన్సెక్స్ 75,400 పాయింట్లను దాటాయి. బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్స్ మార్కెట్ క్యాప్ కూడా మొదటిసారిగా రూ.420 లక్షల కోట్లను దాటింది. బ్యాంకింగ్ రంగ షేర్లను జోరుగా కొనుగోలు చేయడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా ఈ ఇండెక్స్ కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 1200 పాయింట్ల జంప్‌తో 75,418 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 370 పాయింట్ల జంప్‌తో 22,968 పాయింట్ల వద్ద స్థిరపడింది. పెట్టుబడిదారుల సంపదలో భారీ పెరుగుదల నమోదైంది. బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ విలువ గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.415.94 లక్షల కోట్లుగా ఉండగా, గురువారం ఇది రూ.420.09 లక్షల కోట్లకు చేరుకుంది. ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపదలో రూ.4.15 లక్షల కోట్ల పెరుగుదల కనిపించింది.

ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో భారీగా కొనుగోళ్ల కారణంగా నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 986 పాయింట్లు (2.06 శాతం) లాభంతో 48,768 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఆటోలో 525 పాయింట్లు, నిఫ్టీ ఐటీలో 429 పాయింట్ల జంప్ కనిపించింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగ షేర్లలో కూడా బలమైన కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 27 షేర్లు లాభాలతో, 3 నష్టాలతో ముగిశాయి. స్టాక్స్ విషయానికొస్తే మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 3.51 శాతం వృద్ధితో ట్రేడింగ్‌లో రికార్డు స్థాయికి చేరుకుంది. మరోవైపు ఎల్ అండ్ టి 3.38 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.30 శాతం, మారుతీ సుజుకీ 2.82 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.72 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.29 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.22 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.04 శాతం పెరుగుదలతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News