Thursday, May 2, 2024

మోడీజీ మీకు చిత్తశుద్ధి ఉంటే.. రెమిషన్ పై జోక్యం చేసుకోండి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Slams Gujarat Govt for Releasing 11 Convicts

మన తెలంగాణ/హైదరాబాద్: గుజరాత్ లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమిషన్ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు గుజరాత్ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. మహిళలను గౌరవించాలంటూ మీరు చెప్పే మాటలపై చిత్తశుద్ధి ఉంటే.. గుజరాత్ ప్రభుత్వ రెమిషన్ ఆర్డర్ పై జోక్యం చేసుకోవాలని మోడీని కెటిఆర్ కోరారు.
ఆ ఉత్తర్వులను రద్దు చేయించి, దేశం పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలకు వ్యతిరేకంగా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అసహ్యంగా ఉన్నాయని ఆక్షేపించారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లో తగిన సవరణలు చేసి రేపిస్టులకు బెయిల్ రాకుండా చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.
అసలు కేసు నేపథ్యం ఏంటంటే..
2022లో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె కుటుంబానికి సంబంధించిన ఏడుగురిని పాశవికంగా చంపేశారు. హతుల్లో బిల్కిస్ బానో మూడున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులు అందరినీ గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం విడుదల చేశారు. ఈ వ్యవహారంలో గుజరాత్ సర్కార్ తన చర్యను సమర్థించుకుంది. 1992 నాటి రెమిషన్ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపింది. దోషులను విడుదల చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, 2002 గోద్రా అనంతర బిల్కిస్ బానో ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో జీవిత ఖైదు పడిన మొత్తం పదకొండుమంది దోషులు సోమవారం గోద్రా సబ్-జైలు నుండి విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి అనుమతించిందని అధికారులు తెలిపారు. జనవరి 21, 2008న ముంబైలోని ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కోర్టు, బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఆరోపణలపై పదకొండు మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.
ఆ తర్వాత బాంబే హైకోర్టు వారి శిక్షను సమర్థించింది. ఈ దోషులు 15 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత వారిలో ఒకరు తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ప్యానెల్‌కు నేతృత్వం వహించిన పంచమహల్స్ కలెక్టర్ సుజల్ మయాత్ర తెలిపారు. ‘కేసులోని మొత్తం 11 మంది దోషులకు ఉపశమనం ఇవ్వాలని కొన్ని నెలల క్రితం ఏర్పాటైన కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు, దీంతో వారి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం మాకు అందాయి‘ అని మాయాత్ర చెప్పారు. ఫిబ్రవరి 27, 2002న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ని తగలబెట్టిన ఘటనలో 59 మంది ’కరసేవకులు’ మృతి చెందారు. ఆ తరువాత చెలరేగిన హింసలో ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానో, చిన్నారి అయిన తన కూతురు, మరో 15 మందితో కలిసి తన గ్రామం నుండి పారిపోయింది. మార్చి 3న, వారు పొలంలో దాక్కుని ఉండగా, కొడవళ్లు, కత్తులు, కర్రలతో సాయుధులైన 20-30 మంది గుంపు వారిపై దాడి చేసింది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దాడిలో ఆమె కుటుంబంలోని ఏడుగురు మరణించారు. మరో ఆరుగురు సభ్యులు పారిపోయారు.

KTR Slams Gujarat Govt for Releasing 11 Convicts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News