Saturday, August 9, 2025

ఢిల్లీలో కెటిఆర్..?

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంఎల్‌సిలపైన న్యాయపోరాటానికి ఆ పార్టీ సిద్ధమైంది. ఎంఎల్‌ఎల అనర్హత కేసుతో పాటు ఎంఎల్‌సిలపై కూడా అనర్హత వేటు వేసేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు న్యాయనిపుణులతో చర్చించేందుకు కెటిఆర్ తన లీగల్ సెల్ బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. పార్టీ మారిన ఎంఎల్‌ఎల అనర్హత విషయంలో మూడు నెలలలోపు చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించిన నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌సిలను కూడా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం కెటిఆర్ స్వయంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. బిఆర్‌ఎస్ నుంచి గెలిచిన 8 మంది ఎంఎల్‌సిలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, దండె విఠల్, భానుప్రసాద్రావు, ఎంఎస్ ప్రభాకర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరిలో గవర్నర్ కోటాలో నామినేట్ అయిన బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యను మినహాయిం చి మిగతా ఆరుగురిని అనర్హులుగా ప్రకటించాలని శాసనమండలి చైర్మన్‌కు బిఆర్‌ఎస్ గతంలో పిటిషన్లు ఇచ్చింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా బిఆర్‌ఎస్ నుంచి గెలిచినా 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎంఎల్‌ఎ కోటాలో ఎన్నికై న ఎగ్గె మల్లేశం పదవీకాలం ఇప్పటికే పూర్తయింది. పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), భానుప్రసాద్ (కరీంనగర్), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), దండె విఠల్ (ఆదిలాబాద్) పదవిలో కొనసాగుతున్నారు. వీరి పదవీకాలం 2028 జనవరిలో ముగుస్తుంది. వారిని అనర్హులుగా ప్రకటించాలని బిఆర్‌ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తోంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును కూడా పిటిషన్‌లో పేర్కొనే అంశంపై కెటిఆర్ న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News