Tuesday, May 14, 2024

మన సంస్కరణల పథం.. దేశానికే పరిపాలనా పాఠం

- Advertisement -
- Advertisement -

స్వపరిపాలన ఫలాలనే కాదు.. సుపరిపాలన సౌరభాలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్నాం
తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం ఎన్నో చారిత్రక నిర్ణయాలు.. మరెన్నో విప్లవాత్మక సంస్కరణలు 
ప్రతి నిర్ణయం పారదర్శకం.. ప్రతి మలుపులు జవాబుదారీతనం.. ప్రతి అడుగులో ప్రజల భాగస్వామ్యం : కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నదని మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు, మరెన్నో విప్లవాత్మక సంస్కరణలు ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. ప్రజలే కేంద్రంగా సాగిన తెలంగాణ సంస్కరణల పథం యావత్ భారతావనికే ఓ పరిపాలనా పాఠమని తెలిపారు. ప్రతి నిర్ణయం పారదర్శకమని, ప్రతి మలుపులో జవాబుదారితనం, ప్రతి అడుగులో ప్రజల భాగస్వామ్యం అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సిఎం కెసిఆర్ ఈ దశాబ్ద కాలంలో చేపట్టిన పాలనా సంస్కరణలు.. వచ్చే శతాబ్దికీ ఆచరించాల్సిన అడుగుజాడలని చెప్పారు. సంక్షేమ ఫలాలే కాదు, సంస్కరణల ఫలాలు కూడా ప్రజలందరికీ అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మాత్రమే సొంతమని పేర్కొన్నారు. మీకు పాలన చేతకాదు అని అన్నోళ్లే.. మన పాలనా సంస్కరణలు చూసి మనసారా మెచ్చుకుంటున్న అరుదైన తరుణం ఇదని, తమ గుండెలనిండా దీవిస్తున్న అపూర్వమైన సందర్భమని వెల్లడించారు.

ప్రజల చేతికి అధికారాన్ని అందించడమే సంస్కరణల పరమార్ధం
భూమి చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పేందుకు ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ధరణి అని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. దశాబ్దాలుగా పాలకుల గుప్పిట్లో బందీ అయిన అధికారాన్ని ప్రజల చేతికి అందించడమే పరిపాలనా సంస్కరణల పరమార్థమని చెప్పారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నుంచి నూతన కలెక్టరేట్ల నిర్మాణం వరకూ.. తండాలు, గ్రామపంచాయతీల నుంచి నూతన రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల వరకూ.. తెలంగాణలో సాగిన ప్రతి సంస్కరణ పథం.. భవిష్యత్ తరాలకు వెలకట్టలేని ఆభరణమని తెలిపారు.

పల్లె సీమలకు ప్రగతి రథ చక్రాలుగా నిలిచాయి
విద్యుత్ దీపాలతోనే కాదు.. విద్యతో కూడా ప్రతి ఇంట్లో వెలుగులు నింపొచ్చన్న విప్లవాత్మకమైన సంస్కరణలు, విద్యారంగాన్ని తీర్చిదిద్దే వినూత్న ఆలోచనలని కెటిఆర్ చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో తెచ్చిన సంస్కరణలు పల్లె సీమలకు ప్రగతి రథ చక్రాలుగా నిలిచాయన్నారు. మున్సిపల్ శాఖలో అవినీతి మురికిని కడిగిపారేసిన సంస్కరణల పథం దేశంలోనే సరికొత్త అధ్యాయమని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.

ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లు..
శరవేగంగా పరుగులు పెడుతున్న మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లని కెటిఆర్ చెప్పారు. నాడు పరిశ్రమ రావాలంటే.. ‘నీకెంత-నాకెంత’ అనే దుర్మార్గపు విధానం ఉండేదని, నేడు పరిశ్రమ పెట్టాలంటే.. నువ్వు పెట్టే పెట్టుబడి ఎంత..?, మా తెలంగాణ యువతకు దక్కే ఉద్యోగాలెంత..? అని అడుగుతున్నామన్నారు. టిఎస్-ఐపాస్ విధానంతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని తెలిపారు.

బాబాసాహెబ్ చూపిన బాటలో తెలంగాణ
బాబాసాహెబ్ చూపిన బాటలో మన తెలంగాణ.. మనం తెచ్చుకున్నామని కెటిఆర్ అన్నారు. సుపరిపాలనలో స్పీడ్ పెంచేందుకు.. నూతన సచివాలయాన్ని కట్టుకున్నామని, దానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును సగర్వంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నామని, సమున్నత విజ్ఞానమూర్తిని గుండెలనిండా గౌరవించుకున్నామని వెల్లడించారు. ఆయన ఆశయాలే స్ఫూర్తిగా.. సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్దే ఆలంబనగా సాగిన తొమ్మిదేండ్ల సుపరిపాలన ప్రస్థానంలో గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ భాగస్వాములైన ఉద్యోగులకు, యావత్ ప్రభుత్వ యంత్రాంగానికి.. సుపరిపాలన సైనికులందరికి పేరుపేరునా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మంత్రి కెటిఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News