Monday, April 29, 2024

భూముల వివరాలు శాటిలైట్‌తో అనుసంధానం ?

- Advertisement -
- Advertisement -

రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత

‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం

Satellite

 

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వీటితో పాటు భూముల వివరాలను పక్కాగా తెలుసుకునేందుకు జియో ఫెన్స్‌ను వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. డిజిటల్ చిరునామా తరహాలోనే ప్రతి అంగుళం భూమికి శాటిలైట్ ఛాయాచిత్రాలను సాధారణ మ్యాప్‌లతో అనుసంధానించడం ద్వారా భూములకు సంబంధించిన వివరాలు ఎక్కడున్నాయో స్పష్టంగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నివాస గృహాలకు, ప్రభుత్వ భూములకు జియో రిఫరెన్స్ విధానంలో నెంబర్లు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రతి అంగుళం భూమికి ఆధునిక జియో రిఫరెన్స్ జోడించిడం వల్ల ఆయా భూముల చిరునామా వెంటనే తెలిసిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో భూ రికార్డుల నిర్వహణ మరింత ఆధునికం కానుందని రెవెన్యూ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీనికి అనువుగా గ్రామ పటాలు, టిప్పన్‌లు రూపొందించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇది సాకారమయితే రెవెన్యూ వ్యవహారాల్లో మరింత స్పష్టత రానునున్నట్టు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి భూ కమతానికి జియో రిఫరెన్స్ ఇచ్చి టిప్పన్‌లను డిజిటలైజ్ చేసి వాడుక భాషలో వెలుగులోకి తీసుకురావాలన్న ప్రయత్నం చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు మరాఠా, ఉర్ధూ భాషల్లో ఉన్న టిప్పన్‌లను తెలుగులోకి అనువదించేలా పనులు జరుగుతుండగా దీనికి గాను గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టిం (జిఐఎస్)ను వినియోగిస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సాంకేతికతో రేషన్ పంపిణీ, పింఛన్లకు ఉపయోగం

గతంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక పోలింగ్ స్టేషన్‌లో నివసించే ఓటర్ల ఇళ్లను అదే స్టేషన్‌లో కనిపించేలా ‘నజరీ నక్షా’ పేరుతో ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రెవెన్యూ ఆధ్వర్యంలో జియో ఫెన్స్‌ను వినియోగించడం వలన భవిష్యత్‌లో ప్రజావసరాలకు, సంక్షేమ పథకాలకు, లబ్ధిదారుల గుర్తింపునకు, ఇతర ఎన్యూమరేటర్లకు ఉపయోగపడనున్నట్టు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు రేషన్ పంపిణీ, పింఛన్లు, ప్రజలకు మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పనకు ఈ సాంకేతిక ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సిఎంఆర్‌ఓ ప్రాజెక్టు కింద…

ఇప్పటికే భూముల వివరాలను గ్రాఫికల్ రికార్డుల రూపంలో డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. సిఎంఆర్‌ఓ ప్రాజెక్టు కింద 10,829 గ్రామాలకు గాను 10,559 గ్రామాల మ్యాపులను డిజిటలీకరణ పూర్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సేత్వారి, డిజిటలైజ్డ్ విలేజ్ మ్యాపులను సర్వే సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ సిద్ధం చేస్తోంది. తాజాగా తెలంగాణలో వెలుగులోకి వస్తున్న భూ అక్రమాల నేపథ్యంలో అన్ని రికార్డులను డిజిటలైజ్డ్ చేయడానికి సర్వే సెటిల్‌మెంట్ శాఖ కార్యాచరణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. డిజిటలైజ్డ్ అనంతరం ప్రతి భూ కమతం లెక్క తెలిసిపోతుందని, ప్రతి సర్వే నెంబర్‌లోని భూమిని నేరుగా గూగుల్ ఎర్త్‌లో చూసుకునేలా సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఏది ప్రభుత్వ, ఏది పట్టా భూమి అన్న దానిపై స్పష్టత

అక్రమాలకు తావులేకుండా రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమితో సేత్వారి అప్‌డేట్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 నుంచి 2009 మధ్య కాలంలో సేత్వారీ రికార్డులను కొంతమేరకు స్కానింగ్ చేసి అప్‌డేట్ చేశారు.ఆ తరువాత సదరు కార్యాచరణను ఆపివేసిన అధికారులు ప్రస్తుతం వాటిని డిజిటలైజేషన్ చేయడంలో నిమగ్నమయ్యారు. తెలంగాణ భూ రికార్డుల శాఖ రాష్ట్రం మొత్తం యూనిట్‌గా ప్రత్యేక నెంబర్ల వారీగా సేత్వారీని అధికారులు అప్‌డేట్ చేస్తున్నారు. తద్వారా 10,829 గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా ఒక్కో గ్రామ భూములన్నీ ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. వీటిని కాస్రా పహాణీలో అప్‌డేట్ చేసిన అనంతరం ఏది ప్రభుత్వ భూమి, ఏది పట్టా భూమి అనేది క్షణాల్లో తేలిపోనుంది.

 

Land details Integration to Satellite in Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News