Tuesday, April 30, 2024

లాక్‌డౌన్ 3.0

- Advertisement -
- Advertisement -

Lockdown

మే 17వరకు పొడిగింపు

కరోనా వ్యాప్తిని బట్టి మూడు జోన్లుగా జిల్లాల విభజన

కేంద్రం ఉత్తర్వులు.. నిర్ణీత సడలింపులు.. బస్సులు, రైళ్లకు బ్రేక్‌లే

రెడ్ జోన్లలో ఆంక్షలు యథాతథం
ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కాస్త సడలింపులు
గ్రీన్ జోన్‌లోని మద్యం ప్రియులకు శుభవార్త
ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా
మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్‌లోనే
21 రోజులు కొత్త కేసులు లేకుంటే గ్రీన్‌జోన్
ప్రతీ వారం జాబితాపై సమీక్ష
స్వస్థలాలకు తరలింపునకు శ్రామిక్ రైళ్లు
తరలింపునకు చార్జీలు వసూలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి
తెలంగాణ నుంచే కదిలిన తొలి బండి
మా రాష్ట్ర సరిహద్దులు తెరవం : చత్తీస్‌గఢ్

లాక్‌డౌన్ ఎత్తివేస్తారా.. కొనసాగిస్తారా.. లేకపోతే మరిన్ని సడలింపులకే పరిమితమవుతారా అని చర్చోపచర్చలు జరుగుతు న్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య ప్రకటన చేసింది. ముచ్చటగా మూడోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఇప్పటిదాకా మే 3వరకు ఉన్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించింది. అంటే ఈ నెల 17వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ పొడిగింపు నిర్ణయం తప్పలేదని హోంశాఖ శుక్రవారం సాయం త్రం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రధానమంత్రి మోడీ తన మంత్రివర్గంలోని పలువురు సీనియర్‌లతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. అదే సమయంలో లాక్‌డౌన్‌కు సంబంధించి కొన్ని ఊరటనిచ్చే ప్రకటనలు చేస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాప్తిని బట్టి రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లను ప్రకటించింది. దేశమంతటా 130 జిల్లాలు రెడ్ జోన్‌లో, ఆరెంజ్ జోన్ లో 284, గ్రీన్‌జోన్‌లో 319 జిల్లాలున్నాయి.

గ్రీన్, ఆరెంజ్ జోన్‌లో సాధారణ కార్యకలాపాలకు అనుమతినివ్వగా… రెడ్ జోన్లలో ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. జోన్ల పరిస్థితిపై ప్రతివారం సమీక్షించనుంది. ఇక జోన్లతో సంబంధం లేకుండా విమాన, రైల్వే, అంతర్రాష్ట ప్రయాణాలపై నిషేధం విధించింది. రెడ్ జోన్లలో జిమ్ములు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు కూడా తెరుచుకోవు. రాజకీయ, మత పరమైన సమావేశాలకు అనుమతి లేదు. హెయిర్ కటింగ్ షాపులు, ట్యాక్సీలు, ఆటోలు, క్రీడా ప్రాంగణాలు కూడా బంద్. ఆరెంజ్ జోన్లలో కొన్ని షరతులతో ట్యాక్సీలకు అనుమతించారు. గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు, పాన్ షాప్‌లకు అనుమతించారు.

షాపుల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ గుమికూడొద్దు. మరోవైపు లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్ల పేరిట సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఆ ప్రక్రియ కూడా శుక్రవారంనాడు తెల్లవారుజాము నుంచే మొదలైంది. తొలి రైలు తెలంగాణ నుంచే కదిలింది. ఇలా దేశవ్యాప్తంగా 400రైలు సర్వీసులు నడపనున్నట్టు సమాచారం. ఇక లాక్‌డౌన్ నిర్ణయంపై ప్రధానమంత్రి మోడీ శనివారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలు పొడిగించింది. ఇప్పుడు దేశంలో లాక్‌డౌన్ ఈ నెల 3వ తేదీ వరకూ అమలులో ఉంది. అయితే అన్ని విషయాలను విశ్లేషించుకుని లాక్‌డౌన్‌ను ఈ నెల 4వ తేదీ నుంచి మరో రెండు వారాలు పొడిగించేందుకు నిర్ణయించినట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను రెండు వారాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు లాక్‌డౌన్ ఈ నెల 17వ తేదీ వరకూ ఉంటుంది. అంటువ్యాధుల నిర్వహణ చట్టంలోని నిబంధనలను వినియోగించుకుంటూ లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం హోం మంత్రిత్వశాఖ వెలువరించిన ప్రభుత్వ అధికారిక ఆదేశాలలో పేర్కొన్నారు.

రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అంతర్ మంత్రిత్వ బృందాలతో తగు విధంగా సమీక్షించిన తరువాత ఇప్పటి ఆదేశాలు వెలువరిస్తున్నట్లు తెలిపారు. జోన్లతో నిమిత్తం లేకుండా నిర్థిష్ట కార్యకలాపాలపై ఇప్పటిలాగానే నిషేధం అమలులో ఉంటుంది. నిషేధిత కార్యకలాపాల పరిధిలో వైమానిక, రైలు, మెట్రో, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, స్కూళ్లు, కాలేజీలు, ఇతరత్రా విద్యాసంస్థలు , సినిమా హాళ్లు, కోచింగ్ సెంటర్లు, జిమ్‌లు మూసివేసి ఉంచాల్సి ఉంటుంది. స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, ఆతిధ్య రంగంలోకి వచ్చే హోటళ్లు రెస్టారెంట్లు, శిక్షణా కేంద్రాలను కూడా ఇప్పటిలాగానే లాక్‌డౌన్ పరిధిలోకి తీసుకువచ్చారు.

వేడుకలు, సామాజిక మత సమ్మేళనాలు రద్దు
కొనసాగే లాక్‌డౌన్‌లో భాగంగా అన్ని రకాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఇతర రకాల కలయికలు, సభలు సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు. అదే విధంగా మతపరమైన ప్రార్థనా స్థలాలు, కూడళ్లలో ఎవరూ చేరరాదు. వీటిని మూసివేసే ఉంచాలి. అయితే నిర్ణీత ఉద్ధేశాలను పేర్కొన్న పక్షంలో హోం మంత్రిత్వశాఖ అనుమతి తరువాత విమాన ప్రయాణాలు, లేదా రైలు రహదారుల ప్రయాణాలకు వీలు కల్పిస్తారని ఆదేశాలలో తెలిపారు.

కొన్నింటి క్రమబద్థీకరణ
పొడిగించిన లాక్‌డౌన్ దశలో కొన్ని నిర్థిష్ట కార్యక్రమాలకు పనులకు వెసులుబాట్లు కల్పించారు. దీనికి సంబంధించి హోం మంత్రిత్వశాఖ నూతన మార్గదర్శకాలను వెలువరించింది. కరోనా హాట్‌స్పాట్ల పరిధిలోకి జిల్లాలు చేరుకోకుండా ఆయా రాష్ట్రాలు తగు జాగ్రత్తలు తీసుకుని తీరితే సడలింపులకు వీలుంటుందని స్పష్టం చేశారు. కరోనా కేసుల వ్యాప్తి సంఖ్యలను ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకుని హాట్‌స్పాట్లను గుర్తించారు. రెడ్‌జోన్‌లోకి వచ్చే ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా పరిగణిస్తున్నారు.

దేశంలోని జిల్లాలను కరోనా ప్రభావిత అంశాల ప్రాతిపదికన జోన్లుగా వర్గీకరించిన విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకు తెలియచేస్తోంది, వారం రోజులకోసారి రాష్ట్రాలకు, యుటిలకు ఈ సమాచారం పంపిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రాలు తగు విధంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. నిబంధనలు, కట్టుబాట్లు అన్ని కూడా ఈ క్రమంలోనే వర్తిస్తాయి. సడలింపుల క్రమబద్థీకరణలు వైరస్ తీవ్రతను బట్టే ఉంటాయి. కంటైన్మెంట్ జోన్ల పరిధికి వస్తే అక్కడున్న కట్టడి కొనసాగుతుంది. అంతేకాకుండా వాటి వెలుపల లేదా పరిసరాల్లోని ప్రాంతాలలో కూడా నిర్థిష్ట కార్యకలాపాలకు అనుమతిని ఇవ్వడం జరగదు. సైకిలు రిక్షాలు, ఆటోలు నిషేధిస్తారు.

రెడ్‌జోన్లలో కదలికలకు అనుమతి
ఇక రెడ్‌జోన్లలో కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. అయితే నియంత్రణల పరిధిలోనే అక్కడ వ్యక్తులు, వాహనాల సంచారానికి వీలుంటుంది. కేవలం నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి, ఇతరత్రా పరిమిత కార్యకలాపాలకు ఇక్కడ జన సంచారాన్ని పరిమితంగా అనుమతిస్తారు. డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులను కార్లు ఇతర వాహనాలలో అనుమతిస్తారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరికే అనుమతి ఉంటుంది. పట్టణ ప్రాంతాలలోని పారిశ్రామిక సముదాయాలు , సెజ్‌లు, ఎగుమతుల విభాగాలలో, ఇండస్ట్రీయల్ ఎస్టేట్స్‌లలో, పారిశ్రామిక టౌన్‌షిప్‌లలో నియంత్రణతో కూడిన వెసులుబాట్లు ఉంటాయి. నిర్మాణ స్థలాల్లోని కూలీలతోనే పనులు చేయించుకోవల్సి ఉంటుంది.

అంతేకానీ వెలుపలి ప్రాంతాల నుంచి కార్మికులు, కూలీలను తరలించేందుకు వీలులేదు. ప్రభుత్వ కార్యాలయాలలో సీనియర్ అధికారులు స్థాయిలోనే పనుల నిర్వహణ జరుగుతుంది. ఇక 33 శాతం మేరకు సిబ్బంది హాజరు కావచ్చు. మిగిలిన వారికి వర్క్ ఫ్రమ్ హోం ఉంటుంది. ఆరేంజ్ జోన్లలో టాక్సీలు, క్యాబ్‌లను అనుమతిస్తారు. అయితే డ్రైవర్ ఒక్క ప్రయాణికుడే ఉండాలి. గ్రీన్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలను అనుమతించినా నిర్థిష్ట పనులకు వీలుండదు. ఈ ప్రాంతాలలో బస్సులను కేవలం సగం మందితో నడిపించుకోవచ్చు.

రెడ్ జోన్లలో అనుమతించని కార్యకలాపాలు
రైలు, మెట్రో విమాన , అంతరాష్ట్ర బస్సు సర్వీసులు. స్కూళ్లు, కాలేజీలు విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, సభలు విందులు వినోదాలు, మత సమ్మేళనాలు, ప్రార్థనా సమావేశాలు వంటివి కుదరవు.రిక్షాలు, ఆటోలు, టాక్సీలు, క్యాబ్‌లు, బార్బర్ షాపులు, సెలూన్లు, స్పాలు మూసివేసి ఉంచాల్సిందే.

ఆరేంజ్ జోన్లలో బ్రేక్‌లున్న కార్యకలాపాలు
టాక్సీలు, క్యాబ్‌లనుడ్రైవర్, ఒక్క ప్రయాణికుడితో నడిపిస్తారు. అంతరాష్ట్ర వ్యక్తిగత, వాహనాలకు అనుమతులను నిర్ణీత పనులకే కల్పిస్తారు.

గ్రీన్‌జోన్లలో అనుమతినిచ్చేవి వీటికే..
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ దశలో నిషేధించిన కార్యకలాపాలు ఈ జోన్లలో కూడా సాగడానికి వీల్లేదు. అయితే బస్సులను 50 శాతం సీటింగ్ కెపాసిటీ , డిపోల సామర్థ్యంలో సగం శాతం వరకూ బస్సులు నడపాలి.

Lockdown is another 2 weeks Extension
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News