Thursday, May 2, 2024

రేపటి నుంచి కీసరలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

కీసరః  కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి సన్నిదిలో గురువారం నుంచి 21వ తేది మంగళవారం వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అతివైభవంగా జరగనున్నాయి.ఆరు రోజుల పాటు జరుగు బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలిరోజు విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు చివరి రోజు పుర్ణాహుతితో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు 16వ తేదీ గురువారం పుణ్యాహవాచనము. యాగశాల ప్రవేశము. అఖండ జ్యోతి ప్రతిష్టాపన. ధ్వజారోహణ, స్వామి వారి నంది వాహన సేవ. రెండవ రోజు 17వ తేదీ శుక్రవారం ఉదయం రుద్రస్వాహాకార హోమము. స్వామి వారికి భిల్వార్చన, రాత్రి 10 గంటలకు ఉత్తరాషాడ నక్షత్ర యుక్త కన్య లగ్నమందు శ్రీభవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవము.

18వ తేదీ శనివారం మహా శివరాత్రి, మాస శివరాత్రి తెల్లవారు జామునుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, రుద్రస్వాహకార హోమము, రాత్రి 8 గంటలకు నందివాహన సేవ, అర్థరాత్రి 12 గంటల నుంచి లింగోద్భవ కాలములో శ్రీ మూల విరాట్ స్వామి వారికి సంతతధారాభిషేకము. నాలుగవ రోజు 19వ తేదీ ఆదివారం శ్రీస్వామి వారి విమాన రథోత్సవము. ఐదవ రోజు 20వ తేది సోమవారం స్వామి వారికి వసంతోత్సవము, పుష్పయాగము. 21వ తేది చివరి రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు క్షేత్రదిగ్భలి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహిస్తారు.

కీసరగుట్ట (కేసరిగిరి) క్షేత్ర స్థల పురాణము
ద్వాపర యుగంలో రావణుని సంవరించిన అనంతరం బ్రహ్మణ హత్యా పాపాన్ని పోగొట్టుకునేందుకు మహర్షుల సూచన మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాలలో శివలింగ ప్రతిష్ట చేయ సంకల్పించాడు. ఈ నేపద్యంలో ఈ ప్రాంతం గుండా తన పరివారంతో వెలుతున్న శ్రీరాముల వారు ఇక్కడి ప్రకృతిని చూసి చాలా అనందించి ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేయదలిచాడు. ఇందుకు మహర్షులు సుముహూర్తం నిశ్చయించారు. శ్రీరాముడి ఆజ్ఞతో శివలింగాన్ని తెచ్చేందుకు కాశీ క్షేత్రమునకు వెళ్లిన హనుమతుడికి ఈశ్వరుడు నూటొక్క శివలింగాల రూపంలో దర్శనమిచ్చాడు. అక్కడ ఉన్న శివలింగాలలో ఒక దానిని ఎంచుకొనలేక పరమేశ్వడిని ప్రార్ధించిన హనుమతుడు నూటొక్క శివలింగములను తీసుకొని ఆకాశ మార్గమున బయలుదేరాడు.

ఇక్కడ మహర్షులు నిర్ణయించిన ముహూర్తం సమీపిస్తుండగా హనుమతుడు సమయానికి చేరుకోక పోవడంతో శ్రీరాముడు ఈశ్వరుడిని ప్రార్ధించాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును దరించగా సీతారాములు ఆ శివలింగమును ప్రతిష్టించి అభిషేకించారు. అందువలన ఈ స్వామి వారికి రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. అనంతరం హనుమంతుడు నూటొక్క శివలింగములను తీసుకు వచ్చి స్వామి వీటిలో మీకు కావలసిన శివలింగమును ప్రతిష్టంచండి, మిగిలినవి కాశిలో ఉంచి రాగలను అనగా, శ్రీరాముడు హనుమా నీవు రావటము ఆలస్యము అగుట వలన ఈశ్వరుడిని ప్రార్ధించగా స్వామి అనుగ్రహించారు అని చెప్పెను. అప్పుడు హనుమంతుడు నేను తెచ్చిన నూటొక్క లింగములలో ఒక్కటి కూడా నా స్వామికి ఉపయోగపడలేదు అని బాధపడి ఆ శివలింగములను తన తోకతో చుట్టి విసిరివేయగా అవి ఈ పరిసరాలలో చెల్లాచెదురుగా పడినవి.

అప్పుడు శ్రీరాముడు హనుమతుడిని శాంతింపజేసి ఈ క్షేత్రము నీపేరుతో ‘కేసరిగిరి’గా ప్రసిద్ది చెందుతుంది అని వరమిచ్చాడు. దీంతో శాంతించిన హనుమంతుడు తను విసిరి వేసిన లింగములలో ఒక దానిని శ్రీ స్వామి వారి వామ భాగములో ప్రతిష్టించాడు. అదే మారుతి కాశీవిశ్వేరాలయము. హనుమంతుడు తన తోకతో చుట్టి విసిరివేయగా చెల్లాచెదురుగా పడిఉన్న శివలింగాలు నేటికి అలాగే ఉన్నాయి. కాలక్రమేణా ఈ కేసరిగిరి క్షేత్రం కీసరగుట్టగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News