Friday, July 4, 2025

త్రిశంకు స్వర్గంలో జర్నలిస్టులు

- Advertisement -
- Advertisement -

సర్వే నెంబర్ 25పై విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు విచారణలు
2012 ఏడాదిలో ఇంటి పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్
2015 డబుల్ బెడ్ రూంల పేరుతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం వాపస్ తీసుకున్న పట్టాలు
ఎన్నికల చివరిలో డబుల్ బెడ్ రూంల పేరుతో పట్టాలు పంపిణీ
తిరిగి ఏ క్షణాన పట్టాలు క్యాన్సిల్ అవుతాయన్న భయంతో ఇళ్ల నిర్మాణాలు
గుట్టపై ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూంలు 17 మాత్రమే
మిగతా వారంతా అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు, తిరిగి ఇప్పుడు ఇళ్లపై విచారణలు
ఆందోళన బాటలో జర్నలిస్టు కుటుంబాలు, సమస్యను పరిష్కరించాలని కలెక్టర్, ఎమ్మెల్యేకు వేడుకోలు

ఇటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ వార్తలు రాసే జర్నలిస్టులు(ప్రొఫెసెనల్) ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో కొట్టిమిట్టాడుతున్నారు. గత 30 ఏళ్లుగా జర్నలిజమే విలువలుగా చేసుకొని జీవనం సాగిస్తున్న జర్నలిస్టులకే ఆపద వచ్చింది. అందరి సమస్యలను ప్రంపంచానికి చాటిచెప్పే జర్నలిస్టులకు నేడు వారి ఆక్రందనలు, ఆవేదనలను పట్టించుకునే వారే కరువయ్యారు. సొంత స్థలం, ఇళ్లు లేనప్పుడే సంతోషంగా ఉండేవారేమో.. కాని ఇప్పుడు అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లలో ఏ జర్నలిస్టు కుటుంబాలు సుఖంగా లేరు. భవిష్యత్‌లో ఉంటారనే గ్యారెంటీ కూడా లేక పోయింది.

నిత్యం విచారణల పేరుతో జరుగుతున్న తతంగం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ఎక్కడా అనుకుంటున్నారా ? మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండ సర్వే నెంబర్ 25లో జరుగుతున్న రాజకీయ, అధికార క్రీడ నీడలో జర్నలిస్టులు బలవుతున్నారు. ఇక్కడి జర్నలిస్టులే కాదు. మొత్తంగా పాలమూరు జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిపిఎల్ పేరుతో జరుగుతున్న విచారణ ఏ దరికి చేరుతుందో తెలియడం లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: 2012 లో అప్పటి కాంగ్రెస్ మంత్రి, బిజెపి ఎమ్మెల్యేలే ఇంటి పట్టాలు ఇచ్చారు
2012 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న రోజులు.. ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని తమ అస్తిత్వంలా భావించి, ఉద్యమానికి ఊతమివ్వడంలో జర్నలిస్టులు పాత్ర ఘననీయం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ధీరులు ఎవరంటే వారు జర్నలిస్టులు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి పూర్తి సహాకారం అందిస్తున్న జర్నలిస్టులకు సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో అప్పటి కాంగ్రెస్‌లో మంత్రిగా డికె అరుణ, అప్పటి బిజెపి ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డిల ఆద్వర్యంలో కలెక్టర్ పురుసోత్తం రెడ్డి, ఎమ్మారో కిషన్ రావులు కలిసి ఎనుగొండలోని సర్వే నెంబర్ 25లో 85 మంది జర్నలిస్టులకు (ఆ సమయంలో ఉన్న వారికి ) 100 గజాల చొప్పున ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. దీంతో జర్నలిస్టులు సముద్రమంత సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఆదుకున్నందుకు తమకు భరోసా లభించిందని ఆశించారు.

2014 తర్వాత మారిన పట్టాల( కథా) చిత్రం

2014 సంవత్సరంలో అధికారంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ తెచ్చుకున్నందుకు జర్నలిస్టుల సంబురాలు, సంతోషాలు కూడా మిన్నంటాయి. ప్రతి ఒక్కరికిలో తమ భవిష్యత్ బాగుంటుందని ఆశపడ్డారు. డబుల్ బెడ్ రూంలు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎంతో ఆశించారు. రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూంల నిర్మాణం చేయించి ఇస్తామని జర్నలిస్టులకు హామి ఇచ్చి సర్వే నెంబర్ 25లో గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలను వాపస్ చేయాలని సూచించారు. దీంతో ఆశపడిన జర్నలిస్టులు 85 మంది జర్నలిస్టులు పట్టాలను వాపస్ చేశారు. అయితే ఇక్కడ డబుల్ బెడ్ రూంల నిర్మాణాలకు శంకు స్థాపన చేయడంతో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అవుతాయి, తమకు ఇళ్లు వస్తాయని జర్నలిస్టులు ఆశించారు. కాని ఎవరికి ఇళ్లు రాలేదు. అసలు వస్తాయో రావో అన్న భయాలు, ఆందోళలను పదేళ్లు భాధలు అనుభవించారు. చివరికి ఎన్నికల నోటిఫికేషన్‌కు కొన్ని రోజులకు ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెర్వో పార్థసారథి సర్వే నెంబర్ 25లో ఎవరి పట్టాలు ( తెలంగాణ ప్రభుత్వ పట్టాలు) వారికి ఇచ్చారు. ఇక్కడే జర్నలిస్టుల మద్య విబేధాలకు కొందరు ఆజ్యం పోశారు. ఎవరి పట్టాలు వారికి ఇచ్చి ఉంటే ఇప్పుడు ఏ సమస్యా వచ్చేది కాదు. అలా కాకుండా 8 మంది జర్నలిస్టులు పట్టాలు ఇతరులకు కేటాయించడంతో ఈ సమస్యకు జటిలంకు కారణమైంది.

అప్పటి ప్రభుత్వం నిర్మించింది 17 డబుల్ బెడ్ రూంలు మాత్రమే

అప్పటి ప్రభుత్వం కేవలం గుట్టపై డి బ్లాకులోని 17 ఇళ్లను మాత్రమే స్లాబ్ లెవల్లో వేసింది. అంతకు మించి నిర్మాణాలు జరగలేదు. 85 డుబల్ బెడ్ రూంల నిర్మాణంలో 17 అరకొర తప్ప మిగిలినవి కొన్ని పింత్ భీంల వరకే పరిమితం అయ్యాయి. అయితే కాంట్రాక్టర్ ఏ ఇళ్లు పూర్తి చేయలేదు. దీంతో అప్పటికే పట్టాలు వాపస్ చేసి ఇబ్బందులు పడ్డ జర్నలిస్టులు తిరిగి ఎక్కడ తమ పట్టాలు వెనక్కి పోతాయన్న భయం ఆందోళనతో కొందరు జర్నలిస్టులు అప్పులు చేసి ఇళ్లు నిర్మాణాలు చేసుకొని పూర్తి చేసుకొని కుటుంబాలు సైతం కాపురం ఉంటున్నారు. అదే సమయంలోనే మౌలాలి గుట్ట వద్ద కూడా నిర్మాణం పూర్తి అయిన ఇళ్లలో48 మంది జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇచ్చారు కాని ఇంటి తాళాలు ఇవ్వలేదు.

ఆందోళనకు దిగిన టిడబ్లూజేఎఫ్

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టిడబ్ల్లూజెఎఫ్ ఆందోళనకు దిగింది. మౌలాలి గుట్ట వద్ద గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి పట్టాలకు తాళాలు ఇవ్వాలని, ఈ ఇళ్లకు ఇచ్చిన నోటీసులను వెంటనే రద్దు చేయాలని, గుట్టపై కోర్టుకు వెళ్లిన జర్నలిస్టులకు న్యాయం చేయాలని, ఎస్‌విఎస్ దగ్గర గుట్టపై ఇళ్లు కట్టుకోలేని వారికి ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌తో వారు ధర్నాకు దిగారు. ఈ సమస్యలపై వెంటనే ఎమ్మెల్యే స్పందించాలని వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. వీరి ఉద్యమానికి ప్రజా సంఘాలు, ప్రెస్ క్లబ్ కమిటి కూడా మద్దతు ఇచ్చింది.

ఎమ్మెల్యే హామీ ఇచ్చినా విరమణకు నో

వీరి హామీలపై ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి తమ నాయకులను పంపించి వారి అన్ని సమస్యలను సావదానంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 48 మందికి న్యాయం చేస్తామని, కోర్టు కెక్కిన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.అయితే తమకు డెడ్‌లైన్ పెట్టాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

వాట్సాప్ గ్రూపుల మెసేజ్‌లతో జర్నలిస్టుల్లో పెరిగిన అనైఖ్యత

జబ్బ ఒకిరికి వస్తే మందు ఒకరికి అన్నట్లు కొందరు జర్నలిస్టులు వాట్సాప్ మెస్సేజ్‌లతో ఎస్‌విఎస్ గుట్టపై జర్నలిస్టులు నిర్మించుకున్న ఇళ్ల గురించి కథ నాలు వచ్చాయి. ఈ కథనాలు ప్రభుత్వంకు, అధికారులుకు, ఇటు గుట్ట జర్నలిస్టులను టార్గెట్ చేసేలా ఉన్నాయని మరి కొందరు భావించారు. జర్నలిస్టుల మద్యనే ఐక్యత లేక పోవడంతో ఒకరికొకరు నిందలతో జిల్లా ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. మీకు మీరే పిర్యాదులు ఇస్తుంటే మేమేమి చేయాలనే నిర్ణయంతో ఎస్‌విఎస్ గుట్టపై నిర్మించుకున్న, ఇళ్లు, ఖాళీ స్థలాలు, మౌలాలి గుట్టపై ఇచ్చిన 48 పట్టాలపై పూర్తి విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో జర్నలిస్టుల్లో అలజడి మొదలైంది. కట్టుకున్న ఇళ్లను కూలగొడతారని, ఇళ్లను రద్దు చేస్తారనే భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అప్పలు చేసి కట్టుకున్న ఇళ్లు ఏమన్నా అయతే తమకు చావు తప్ప మరో దారి లేదని జర్నలిస్టులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

గుట్టపై విచారణ పేరుతో అధికారుల వేధింపులు ఆపాలి : ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు

దేవుని గుట్టపై 85 మంది జర్నలిస్టులకు గతంలో కేటాయించిన స్థలాల్లో సొంతంగా నిర్మించుకున్న ఇళ్లపై విచారణ పేరుతో అధికారులు వేధింపులను ఆపాలని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నరేంద్రాచారి డిమాండ్ చేశారు. గుట్టపై ఇళ్ల నిర్మాణాలు జరుపుకొని కుటుంబాలు సైతం ఇక్కడే కాపురాలు ఉంటున్నారని, మూడేళ్లగా రాని అధికారులు ఇళ్లు పూర్తి అయిన తర్వాత, ఇంటి పన్నులు, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్న సందర్భంలో ఇళ్లపై విచారణ ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్రీ బోయిలు కలిసి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

మా సమస్యలు పరిష్కారం కావాలి : అశోక్

జర్నలిస్టుల డిమాండ్లలో మౌళాలి గుట్టపై ఇచ్చిన ఇళ్లకు వెంటనే తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్‌విఎస్ దగ్గర ఇళ్ల నిర్మాణాలు చేసుకోని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరారు. కోర్టుకు వెళ్లిన వారికి న్యాయం చేయాలి.. అలాగే ఇంటి స్థలాలు లేని జర్నలిస్టులకు అందరికి ఇంటి పట్టాలు ఇవ్వాలని, వీటిపై లిఖిత పూర్వక హామీ ఇస్తే విరమించుకుంటామని టియుబ్లజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ డిమాండ్ చేశారు.

మాకు న్యాయం చేయండి: విద్యాసాగర్ రెడ్డి

ఎస్‌విఎస్ గుట్టపై గత ప్రభుత్వం తమ పట్టాల స్థానంలో ఇతరులకు ఇళ్లను కేటాయించి తమకు పూర్తి అన్యాయం చేసిందని కోర్టు బాదిత నాయకుడు విద్యా సాగర్ ఆరోపించారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని గతంలో అనేక సార్లు డిమాండ్ చేసినా న్యాయం జరగలేదన్నారు. కోర్టుకు వెళ్లిన 8 మందికి న్యాయం చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మాకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఈ చిక్కు ముడి వీడెదన్నడు ?

అయితే ఈ చిక్కముడిని ఎవరు విప్పుతారని జర్నలిస్టులు ఆశిస్తున్నారు. జర్నలిస్టులు ఒకరికి ఒకరు పడక పోవడంతో సమస్య జటిలంగా మారుతోంది. ఇప్పటికైనా జర్నలిస్టుల అందరు కలిసి కలెక్టర్ విజయేంద్రీ బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమన్వయంతో చర్చల ద్వార మాత్రమే పరిష్కరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.సమాజాన్ని మార్చే జర్నలిస్టులే సమస్యల కూపంలో ఇరుక్కు పోవద్దని మేధావులు సూచిస్తున్నారు.

 

Mahaboobnagar journalist

ఈ చిక్కు ముడి వీడెదెన్నడు?

అయితే ఈ చిక్కముడిని ఎవరు విప్పుతారని జర్నలిస్టులు ఆశిస్తున్నారు. జర్నలిస్టులు ఒకరికి ఒకరు పడక పోవడంతో సమస్య జటిలంగా మారుతోంది. ఇప్పటికైనా జర్నలిస్టుల అందరు కలిసి కలెక్టర్ విజయేంద్రీ బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమన్వయంతో చర్చల ద్వార మాత్రమే పరిష్కరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమాజాన్ని మార్చే జర్నలిస్టులే సమస్యల కూపంలో ఇరుక్కు పోవద్దని మేధావులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News