Saturday, August 9, 2025

బిసిల పదవులు కిషన్ రెడ్డి లాక్కున్నారు: మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఇద్దరు బిసి నాయకుల నుంచి పదవులు లాక్కున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణ చేశారు. బిజెపిబిఆర్‌ఎస్ ఒప్పందంలో భాగంగానే బిసి నాయకుడైన బండి సంజయ్ నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవిని, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని బండారు దత్తాత్రేయ నుంచి కిషన్ రెడ్డి లాక్కున్నారని మహేష్ కుమార్ గౌడ్ శనివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భయంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపి ఈటల రాజేందర్ మాట్లాడలేకపోతున్నారని ఆయన తెలిపారు. బండి సంజయ్, ఎంపిలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ మౌనం బిసిలకు నష్టమని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిసి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతునిచ్చిన బిజెపి ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నదని ఆయన విమర్శించారు. బిసి బిల్లును కేంద్రం ఆమోదించకుండా రాష్ట్ర బిజెపి అడ్డుపడుతున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసి బిల్లు విషయంలో తమ నిజాయితిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై సర్వే చేయిస్తున్నామని ఆయన తెలిపారు. నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందని ఆయన చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే పోటీ పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బ్రేక్ చేశారని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ స్థానాలను సునాయసంగా కైవసం చేసుకుంటుందని ఆయన ధీమాగా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News