Sunday, March 3, 2024

ఆకాశంలో పతంగులు.. లోగిళ్లలో రంగవల్లులు

- Advertisement -
- Advertisement -

Sankranti-2020

మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్కడ చూసినా పండుగ వాతావరణం వెల్లివిరిసింది. గ్రామాలతో పాటు పట్టణాలలోనూ పండుగ శోభ కనువిందు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మకర సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలతో పాటు పట్టణాలలోనూ సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకాయి. చిన్నాపెద్దా అందరూ కలిసి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం భోగి మంటలు వేసుకుని సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు.

తెల్లవారుజామునే పాతసామానులు, కట్టెలతో భోగి మంటలు వేసుకుని వీధివీధిలో ఆయా ప్రాంతాల వాసులు చలికాచుకున్నారు. సంప్రదాయబద్ధంగా జరుపుకునే సంక్రాం తి వేడుకలలో కుటుంబసభ్యులందరూ సరదాగా జరుపుకుంటున్నారు. ఇంటిల్లిపాది పెద్దలు, చిన్నారులు కొత్తదుస్తులు కొనుగోలు చేసుకుని ముస్తాబవుతున్నారు. పిండివంటలు వండుకుని, పూజలు చేసుకుని సందడి..సందడిగా గడుపుతున్నారు.

సంక్రాంతిలో యువత కేరింత…

యువతీయువకులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డులతో విషేస్ చెప్పుకునేవారు. మారిన కాలంతోనే అందుపుచ్చుకున్న టెక్నాలజీతో వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. చిన్నారులు, యువకులు పతంగులు ఎగురవేస్తూ ఆకాశాన్ని సప్తవర్ణశోభితంగా నింపుతుంటే.. మహిళలు ఇళ్ల ముంగిట రంగురంగుల ముగ్గులు వేస్తూ వీధులన్నీ రంగులమయంగా మారుస్తున్నారు. ఇళ్లల్లో గృహిణుల పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం తాండవిస్తే.. వీధుల్లో యువత కోలాహలం కనిపించింది.

సినిమా థియేటర్ల కిటకిట…

సంక్రాంతి పండుగ సీజన్ కోసం సినీ నిర్మాతలు ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. ఈ సీజన్‌లో తమ సినిమా విడుదల చేస్తే కాసులవర్షం కురవడం ఖాయం. దీంతో సంక్రాంతి రిలీజ్‌కు సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది 4 పెద్ద సినిమాలు కోట్లు కొల్లగొట్టేందుకు విడుదలయ్యాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రిన్స్ మహేశ్‌బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ సినిమాలు సందడి చేస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు స్పెషల్ షోలు వేస్తూ మరీ సినీప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. తమ హీరో సినిమా బాగుందంటే కాదుకాదు మా హీరో సినిమానే బాగుందంటూ ప్యాన్స్‌లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎక్కువ కోట్లు తమ హీరో సినిమాకే వసూలవుతున్నాయని.. సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకుంటున్నారు. ఇంటిల్లిపాది కుటుంబసభ్యులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటూ ధియేటర్లకు క్యూ కడుతున్నారు.

హైదరాబాద్‌లోనూ పండుగ శోభ..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ సంక్రాంతి శోభ పరిఢవిల్లింది. పండుగ సందర్భంగా దాదాపుగా 20 లక్షల మంది ఊర్లకు వెళ్లారు. ఇక్కడున్న ప్రజలు పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. విఐపి జోన్‌లు అయిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, కెపిహెచ్‌బి ప్రాంతాల్లో పం డుగ వాతావరణం కనిపించింది. పలు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రజలు సామూహికంగా సంక్రాంతి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకున్నారు. గంగిరెద్దులు, హరిదాసులు, గొబ్బెమ్మలతో పట్టణానికి పల్లెవాతావరణాన్ని తీసుకువచ్చారు.

పండుగ సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటామన్నట్లుగా కార్పొరేట్ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు కూడా పండుగ వేడుకల్లో సందడి చేశారు. పాఠశాలలు, హైస్కూల్స్‌లోనూ పండుగ ప్రాశస్తం తెలియజేసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు హరిదాసు, రైతు వేషధారణలతో ముచ్చటగొలిపారు. మొత్తానికి పరుగులు పెడుతున్న కంప్యూటర్ యుగంలోనూ సంస్కృతి, సంప్రదాయాలను ఒడిసి పట్టుకుంటూ పట్టణ ప్రజలు సంబురాలు జరుపుకోవడం విశేషం.

Makar Sankranti 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News