మాటే మంత్రం అన్నది మనం వినేవుంటాం. నేడు అది మనం చూస్తున్నాం. రాజకీయాలలో రాణించాలంటే నాయకత్వ లక్షణాలతోపాటు మంచి వాక్ చాతుర్యం ఉండాలి. ఏ నినాదం ఏ సమయంలో, ఏ మాట ఏ సందర్భంలో ప్రయోగించాలనే టైమింగ్ తెలిసివుంటే అలాంటి నేతకు ఇక తిరుగే ఉండదు. ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి చేస్తున్న ప్రసంగాలు మన మీడియాలో పతాక శీర్షికల్లో వస్తుంటే వాటి చుట్టే చర్చ కూడా సాగుతోంది. దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్ల నేపథ్యంలో మోడీ నోట వచ్చిన మాటలు చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రధాని నరేంద్ర మోడీని దోస్త్ మేరా దోస్త్ అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశ ఎగుమతులపై భారీసుంకాలు వేస్తూ వెళ్తున్నారు. తన మిత్రుడు ట్రంప్‌ను ప్రధాని మోడీ కట్టడి చేయలేకపోతున్నారు అన్న విమర్శలు విపక్షాలు చేస్తున్న సందర్భంలో ప్రధాని మేక్ ఇన్ ఇండియా నినాదం ఎత్తుకొన్నారు. విదేశీ వస్తువుల వాడకం తగ్గించి స్వదేశీ వస్తువుల వాడకం పెంచుకోవాలి, అందుకోసం మేడిన్ ఇండియా నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపును నిజంగా స్వాగతించాల్సిందే.
కానీ మేక్ ఇన్ ఇండియాను సాకారం చేసుకోవాలంటే దేశం ఓ విజన్‌తో ముందుకెళ్లాలి. ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా నినాదం ఈనాటిది కాదు. కాకపోతే అమెరికా సుంకాల భారీ పెంపు నేపథ్యంలో మరోసారి మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని నరేంద్ర మోడీ తెరపైకి తెచ్చారు. బిజెపి చాలాకాలంగా స్వదేశీ నినాదం అందుకుంటూ అది ఒక ప్రచారంగా చేస్తూ వస్తోంది.స్వదేశీ వస్తువుల తయారీ విధానమే మేక్ ఇన్ ఇండియా. వాస్తవానికి ఈ నినాదం ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచే ఎత్తుకొన్నారు. నినాదం ఆచరణలో సార్థకం కావాలంటే వాటి అమలుకు ఓ విజన్‌తో ముందుకు సాగాలి. వాస్తవానికి దేశప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టి 11ఏళ్లు కావస్తోంది. అంటే పదకొండేళ్ల కిందటే మేక్ ఇన్ ఇండియా విజన్‌తో ఫుల్ ఫోకస్‌గా పనిచేసి వుంటే స్వదేశీ వస్తువుల తయారీ పెరిగి నినాద ఫలాలు నేడు కనిపించేవి. కానీ అందుకు విరుద్ధంగా నేడు పరిస్థితి నెలకొంది. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన కార్యక్రమం దేశీయ తయారీ రంగం లో ఏమాత్రం ఉత్సాహాన్ని నింపలేకపోయింది. 11 ఏండ్లపాటు ప్రచారం చేసినా ఫలితం శూన్యం. మోడీ హయాం కంటే జిడిపిలో తయారీ రంగం వాటా అంతకుముందే బాగుండటం గమనించదగ్గ విషయం. 2014 మే నుంచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ఉంటున్న విషయం తెలిసిందే. 2030 నాటికి దేశ జిడిపిలో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
అయితే గత ఆర్థిక సంవత్సరం 2023- 24లో ఇది 15.9 శాతంగానే ఉన్నది. కానీ 2013 -14లో అంటే కాంగ్రెస్ హయాంలో 16.7 శాతంగా ఉండటం విశేషం. తాజాగా జిడిపిలో స్వదేశీ ఉత్పత్తి 12.6 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ పాలనలోకంటే మేకిన్ ఇండియా నినాదం ఎత్తుకొన్న మోడీ హయాంలోనే స్వదేశీ వస్తూత్పత్తి రంగం దిగజారిందన్నది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నది ఎంతటి వాస్తవమో అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఇప్పటికపుడు సమస్యలు పరిష్కారం కావు. మేక్ ఇన్ ఇండియా నినాదం అమలు చేసే దిశగా ఓ పక్కా కార్యాచరణ మోడీ సర్కార్ కు ఉండాలి. పదకొండేళ్ల కిందటే మోడీ ఈ నినాదం ఎత్తుకొన్న వాటి ఫలాలు మాత్రం కనిపించలేదు అంటే ప్రణాళిక అమలులోనే లోపం ఉందన్నది స్పష్టమవుతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక దేశప్రగతిపై కంటే ఎక్కువగా మత పరమైన అంశాల చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఎన్నికల సమయంలో మతపరమైన అంశాలపైనే ఫోకస్ చేశారు. అభివృద్ధి చుట్టూ రాజకీయాలు సాగే చోట మతపర అంశాలకు ఆస్కారముండదు.
మత రాజకీయాలు సాగే చోట అభివృద్ధికి ఆస్కారముండదు. ప్రపంచ చరిత్ర ఇదే తెలియజేస్తోంది. మేక్ ఇన్ ఇండియా అనే మోడీ పాలనలో విదేశీ వస్తువులు దేశంలో ఇబ్బడిముబ్బడిగా అమ్ముడవుతున్నాయి. విదేశీ వస్తువుల దిగుమతికి సర్కార్ అనుమతి ఇస్తేనే ఇది సాధ్యమైంది. ఇక మీదట భారతీయ ప్రజానీకం మేడ్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్‌ని డెవలప్ చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. విదేశీ వస్తువులను భారతీయులు కొనుగోలు చేస్తున్నారంటే పరదేశంపై మోజుతో కాదు. కారు చౌకగా నాణ్యమైన ఆ వస్తువులు మన దేశంలో లభించకపోవడం వల్లే. స్వదేశీ వస్తు వాడకం పెరగాలంటే దేశంలోకి విచ్చలవిడిగా ఎంట్రీ ఇస్తున్న విదేశీ వస్తువుల మీద సుంకాలు పెంచాలి ప్రతీకార సుంకాలు వేయాలి. అదే సమయంలో దేశంలో ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలి. అంతే కాదు నాణ్యతా ప్రమాణాలు బాగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ, వ్యాపారాల్లోకి విదేశీయుల ఎంట్రీకి అనుమతి ఇచ్చిన మోడీ సర్కార్ మేక్ ఇన్ ఇండియా అంటే హాస్యాస్పదమే అవుతుంది. 1948 అక్టోబరు 1న రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించించింది.
దేశం కంటే ఓ ఏడాది ఆలస్యంగా చైనా దేశం ఏర్పడింది. కానీ తయారీ రంగంలో దూసుకెళ్లి ప్రపంచ దేశాలకు ఓ అవసరంగా మారింది. దీని వెనక చైనా ప్రభుత్వాల ప్రణాళిక బద్ధమైన కార్యాచరణ ఉంది. విద్య, పరిశోధనా రంగాలలో భారీ పెట్టుబడులు పెట్టింది. రోబోటిక్స్, కృత్రిమమేధల ద్వారా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. మోడీ ప్రభుత్వం మాత్రం దేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులు మీద ఆధారపడి వస్తూత్పత్తి రంగంలో ముందుకు సాగుతోంది. ప్రభుత్వం చేతిలో ఉన్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ వస్తోంది. ప్రైవేటు రంగం లో వ్యక్తిగత లాభానికే ప్రాధాన్యత ఉంటుంది. దేశప్రగతి వారి ఉద్దేశంగా ఉండదు. విద్యను కాషాయీకరణ చేసేందుకు ఇస్తున్న ప్రోత్సాహం మోడీ సర్కార్ శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగతికి ఇవ్వడంలేదు. మేక్ ఇన్ ఇండియా నినాదం ఎత్తుకొన్న వాటి విజన్ లేకపోవడమే మోడీ సర్కార్ ఈ నినాదం విఫలం కావడానికి కారణంగా మారింది.
Also Read: నేతల సంపద పైపైకి.. అభివృద్ధి అడుగుకు
సయ్యద్ నిసార్ అహ్మద్
78010 19343