Monday, April 29, 2024

మరోసారి ఆలోచించండి

- Advertisement -
- Advertisement -

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ల్ని రద్దు చేయండి
ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి
ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. సిఎఎ, జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సి), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) లను ఉపసంహరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశానన్నారు. అందుకు స్పంది ంచిన మోడీ ఢిల్లీ వచ్చి, ఈ అంశాన్ని చర్చించమన్నారని ఆమె తెలిపారు. మోడీతో సమావేశం అనంతరం మమతాబెనర్జీ విలేకరులతో మాట్లాడారు. ‘దేశమంతటా వీటికి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతోందని, మేము కూడా వాటికి వ్యతిరేకమని ప్రధానికి వివరించాను.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారంనాడు రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. సిఎఎకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో వారి సమావేశం జరిగింది. మోడీతో సమావేశం గురించి చెబుతూ మమతా బెనర్జీ ‘ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశం. రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. 28,000 కోట్లు రావలసి ఉందని ఆయనకు చెప్పాను. రెండు రోజుల పర్యటనకు మోడీ కోల్‌కతా చేరుకున్న కొద్దిసేపటికే వారు భేటీ అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం పశ్చిమబెంగాల్‌లో మంటలు రేపుతున్న సమయంలో ఈ నేతలిద్దరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిఎఎను అమలు చేయాలని బిజెపి పట్టుబడుతుండగా, మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

బైఠాయింపు ఆందోళనలో సిఎం
మోడీతో సమావేశం తర్వాత కేవలం నిముషాల వ్యవధిలోనే మమతా బెనర్జీ సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా శనివారంనాడు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నిర్వహించిన బైఠాయింపు ఆందోళనలో పాల్గొన్నారు. రాజ్‌భవన్‌కు కొద్ది మీటర్ల దూరంలో ఉన్న రాణి రష్మోని రోడ్‌లో జరిగిన ఈ ఆందోళనలో ఆమె నిరసనకారులతో కలిసి నినాదాలు చేశారు. రాష్ట్రంలో సిఎఎ నోటిఫికేషన్ కేవలం కాగితంమీదే ఉందని, తన ప్రభుత్వం అమలు చేయదని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.

నిరసనల మధ్య ప్రధాని పర్యటన
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పశ్చిమ బెంగాల్‌లో భారీగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటనకు శనివారంనాడు కోల్‌కతా చేరుకున్నారు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ (ఎన్‌ఎస్‌సి) అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్, నగర మేయర్, మున్సిపల్ వ్యవహారాల రాష్ట్రమంత్రి ఫిర్హాద్ హకీం, పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఇతర సీనియర్ బిజెపి నాయకులు స్వాగతం పలికారు. కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎయిర్‌పోర్ట్‌కు రాలేదు. కోల్‌కతా విమానాశ్రయం వెలుపల గేట్ నంబర్ 1 క్రాసింగ్ దగ్గర వందలాది మంది ఆందోళనకారులు నల్లని పతాకాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. వారు ఎయిర్‌పోర్ట్ దగ్గరికి రాకుండా పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో రాయల్ కలకత్తా టర్ఫ్ క్లప్ (ఆర్‌సిటిసి) చేరుకుని, అక్కడి నుంచి రాజ్‌భవన్ వెళ్లారు. ఆయన కాన్వామ్ ఆర్‌సిటిసి బయటకు రాగానే నిరసనకారులు ఎజెసి బోస్ రోడ్ ఫ్లై ఓవర్ ఫ్లాంక్ వద్ద గుమికూడి, జాతీయ పతాకాలు, నల్లటి పతాకాలు చూపిస్తూ సిఎఎకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సిఎఎకు వ్యతిరేకంగా వామపక్ష కార్యకర్తలు శనివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. బాదవ్‌పూర్ యూనివర్శిటీ సమీపంలోను, గోల్‌పార్క్, కాలేజ్‌స్ట్రీట్, హాతీబగాన్, ఎస్‌ప్లనేడ్ ప్రాంతాల్లో సమావేశమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తలు ‘స్టూడెంట్స్ ఎగైనెస్ట్ ఫాసిజం’ అని రాసిన ప్లకార్డుల్ని ప్రదర్శించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టి బొమ్మల్ని వారు తగలబెట్టారు.ప్రధాని పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ యంత్రాంగం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది.

Mamata Banerjee appeals to Modi to cancel CAA
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News