Sunday, March 3, 2024

లాలూఛీ

- Advertisement -
- Advertisement -

KTR

 

కాంగ్రెస్, బిజెపిలది పైకి ఫైటింగ్.. లోపల ఫిక్సింగ్
మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మున్సిపోల్స్‌లో టిఆర్‌ఎస్‌కు అఖండ విజయం ఖాయం
రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి
ఎన్నికల అనంతరం టిఎస్ బి పాస్ పథకం
పట్టణాభివృద్ధికి 4 ప్రధాన అంశాలు
వికేంద్రీకరణతోనే అభివృద్ధి
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి అదనంగా పైసా రాలేదు

హైదరాబాద్: కాంగ్రెస్,బిజెపిలు పైకి నాటకాలు ఆడుతూ లోపల కలిసి పని చేస్తున్నాయని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపాలిటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండి పడ్డారు. ఈ పార్టీల వ్యవహారం చూస్తుంటే పైకి ఫైటింగ్ లోపల ఫిక్సింగ్‌లా ఉందన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యాయరని ఆయనదుయ్యబట్టారు. బిజెపి, కాంగ్రెస్ మాటలు చెప్పడం, ప్రగల్భాలు పలకడం మినహా రాష్ట్రాభివృద్ధికి చేసింది ఏమీ లేదంటున్న కెటిఆర్‌తో మనతెలంగాణ ప్రతినిధి భూమేశ్వర్ ప్రత్యేక ఇంటర్వూ…..

రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి పథకాలను రూపొందిస్తున్నారు?
టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ పూర్తి చేయడంతో పాటు చెప్పని అభివృద్ధి పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మనసులో ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఎన్నికల హామీలో చేర్చని రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మీ పథకాలను ప్రవేశపెట్టి సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారు. అలాగే అనేక పథకాలు ఆయన మనసులో ఉన్నాయని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికలు కాగానే సిఎం కెసిఆర్ కొత్తపథకాలను ప్రకటించే అవకాశాలుఉన్నాయి. ప్రధానంగా పట్టణాభివృద్ధికి సిఎం కెసిఆర్ పథకాలను రూపొందిస్తున్నారని చెప్పారు.

బిజెపి విడుదల చేసిన చార్జీషీట్‌పై మీఅభిప్రాయం?
కాంగ్రెస్,బిజెపి విధానాలతోనే తెలంగాణ పట్టణాలు, పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదు, ఎన్నికలు రాగానా ఈ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. బిజెపికి మాటలు చెప్పడం తప్పా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిపై బిజెపి లక్ష్మణ్ చార్జిషీట్ విడుదల చేయడం విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయని బిజెపి చార్జిషీటు ఎందుకు విడుదల చేసిందని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సినవి మినహా అదనంగా రాష్ట్రాభివృద్ధికి బిజెపి కేంద్రం నుంచి ఒక్కపైసాకూడా సాధించలేదు. ఈ ఐదు ఏళ్లలో బిజెపి లక్ష్మణ్ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమి సాధించారో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాను.

కేంద్రంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న బిజెపి,కాంగ్రెస్ పై టిఆర్‌ఎస్ చార్జిషీట్ విడుదల చేయాలంటే కొన్ని వేల పేజీల చార్జిషీటు విడుదల చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం సహకరించని బిజెపి లక్ష్మణ్ విమర్శించడమే లక్షంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్,బిజెపి మాటలు ఎన్ని చెప్పిన చేతలు 25 ఎన్నికల ఫలితాల రూపంగా తెలుస్తాయి. రాష్ట్రంలోని 25 పట్టణాల్లో కాంగ్రెస్,బిజెపి పూర్తి స్థాయి అభ్యర్థులను పోటీలో నిలబెట్టని దీన స్థితిలో ఉంది. ప్రజల అవసరాలను తీర్చకుండా కాంగ్రెస్ అధికారం నుంచి వెళ్లిపోతే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధికోసం ప్రతినిమిషం ఆరాటపడుతుంది. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ కారుగుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

కేంద్ర సహకారంతో స్మార్ట్ సిటీల నిర్మాణాలు జరుగుతున్నాయా?
బిజెపి మాట్లాడితే స్మార్ట్ సిటీలు అంటుంది. రాష్ట్రంలో ఎన్ని స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేశారో ప్రకటించాలి. బిజెపికి పేర్లు పెట్టడం,నినాదాలు చేస్తూ ఫోజులు కొట్టడం అలవాటు. ఆమేరకే స్మార్ట్ సిటీలంటూ ప్రకటించిందే కానీ ఎక్కడ కేంద్రం నిధులతో పనులు ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 14 రోజులకు ఒకసారి తాగునీళ్లు వచ్చేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అనేక పథకాలను ప్రారంభించి పట్టణాలకు ప్రతి రోజు, లేదా రోజువిడిచి రోజు తాగునీరు వచ్చేవిధంగా తీసుకు రావడం టిఆర్‌ఎస్ గొప్పతనం కాదాని విపక్షాలను ప్రశ్నిస్తున్న. కాంగ్రెస్ అధికారంలో ఉండగా రాష్ట్రంలో చెత్తమున్సిపాలిటీలు ఉంటే టిఆర్‌ఎస్ పాలనలో కొత్తమున్సిపాలిటీలు వచ్చాయి. పురపాలక నగరాల్లో కొత్తవాహనాలను సమకూర్చాము, ప్రతిమున్సిపాలిటీకి డంప్పింగ్ యార్డును ఏర్పాటు చేశాము, డిఆర్‌సి సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాము.

కాంగ్రెస్ బిజెపి మాదిరిగా మాటలు ఎన్నైనా చెప్పవచ్చు చేతల్లో ఏమిటనేది 25న వెలుబడే ఫలితాలు చెపుతాయి, ప్రజల తీర్పు ఏకపక్షంగా టిఆర్‌ఎస్ వైపు ఉంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇళ్లనిర్మాణాలపై అసత్య ప్రకటనలు చేస్తున్నారన్నారు. కిషన్‌రెడ్డి వస్తే కొల్లూరులో 18వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 15వేల డబుల్ బెడ్‌రూంల ఇళ్లను చూపిస్తాను, అలాగే కిషన్‌రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లతో పాటు హైదరాబాద్ మున్సిపాలిటీలో నిర్మిస్తున్న లక్షఇళ్లను చూపిస్తాను. అయితే ఆయనకు నేను సవాల్ విసురుతున్నాను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 18వేల కోట్ల రూపాయలతో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయో చూపించాలి.

వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమా?
గతంలో పట్టణాభివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. నిధులకొరత ఆనాడు అత్యధికంగా ఉండేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించగానే పల్లెప్రగతి తోపాటు పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత లభించింది. ఆనాడు రాష్ట్రంలో 68 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయితీలు మాత్రమే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే అధికార వికేంద్రీకరణకోసం కొత్తజిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీరణ చేయడంతో ప్రజల చెంతకు పాలనా వ్యవస్థ చేరింది. జిల్లాకేంద్రాలు వందల కిలోమీటర్ల దూరం ఉండటంతో దశాబ్దాలుగా పాలనా వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ప్రజలు కోరుకున్న విధంగా సిద్దిపేట, వికరాబాద్, సూర్యపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, గద్వాల,నాగర్ కర్నూల్ లాంటి తదితర జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేక దశాబ్దాలుగా గిరిజన తండాలు గ్రామపంచాయితీలు కావాలని ఉద్యమించిన గిరిజనుల కోరికలను ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చారు.

గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చి అభివృద్ధిని గిరిజన తండాలకు పరిచయం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుంది. వికేంద్రీకరణతోనే సామాన్య ప్రజలకు అభివృద్ధి,సంక్షేమం చేరుతుందనే దృఢలక్షంతోనే 68 గా ఉన్న పురపాలికలను 141గా తెలంగాణ ప్రభుత్వం పెంచిందని చెప్పారు. వికేంద్రీకరణ జరగగానే పట్టణాభివృద్ధి వేగవంతమైందన్నారు. పట్టణాభివృద్ధి కోసం ప్రధానంగా నాలుగు అంశాలతో ముందుకు వెల్లుతున్నాము. ఇందులో ముఖ్యంగా పచ్చదనం పారిశుభ్రత, టిఎస్ ఐ పాస్ మాదిరిగానే టిఎస్ బి పాస్, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ప్రజలకు జవాబుదారులను చేస్తూ స్వియ ధృవీకరణ అంశాలున్నాయి. వాటిని తప్పనిసరిగా అమలు చేస్తాము.

క్షేత్రస్థాయి సమస్యలపై దృష్ఠి సారిస్తున్నారా?
ఎన్నోపోరాటాలు,త్యాగాలతో అభివృద్ధి లక్షంగా టిఆర్‌ఎస్ అధినేత ప్రాణాలను పణంగా పెట్టి గాంధేయమార్గంలో సాధించిన తెలంగాణ అదే వేగంతో అభివృద్ధి వైపుకు పరుగు పెడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తొలిసారిగా జరుగుతున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలు టిఆర్‌ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. అనేక సర్వే నివేదికలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. టిఆర్‌ఎస్ అధికారంలో ఉంటూ ఆరు సంవత్సరాలు అవుతున్న ఏనాడు నేల విడిచి సాము చేయలేదు. క్షేత్రస్థాయిలో ఉన్నసమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి, సంక్షేమ ప్రణాళికలను రచిస్తూ వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తూ ముందుకు వెళ్లింది.

ప్రధానంగా ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పన, పౌరసేవలపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్, భూపాలపల్లి,ములుగు, సిఫాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేసి గణనీయ అభివృద్ధికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూనుకుంది. గతంలో కలెక్టర్ల దగ్గరకు ప్రజలు వెళ్లాలంటే సుమారు రెండువందల కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆపరిస్థితి మారింది. కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మున్సిపాలిటీ వార్డుల వారిగా నివేదికలను రూపొందిస్తున్నాము ఈ నివేదికల ఆధారంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు కొత్త పథకాలను రూపొందిస్తాము.

పట్టణాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఒకవైపు గ్రామసీమలను అభివృద్ధిచేస్తూ మరోవైపు పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాము. 90 పట్టణాల్లో మిని ట్యాంకు బండ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే అనేక ట్యాంక్‌బండ్‌ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్(టియుఎఫ్‌ఐడిఎ) ద్వారా రూ. 2,500 పైచిలుకు కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాదు శివార్లలో 25 పార్కులను ఏర్పాటు చేస్తున్నాము. గతంలో కార్పొరేషన్ అంటే హైదరాబాద్ మాత్రమే గుర్తుకు వచ్చేది.

ప్రస్తుతం ఆపరిస్థితి మారింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలు సమాంతరంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నాయి. వరంగల్ మున్సిపాలిటీకి ఏటా రూ.300కోట్లు,ప్రతి కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు ప్రభుత్వం ఇస్తూ అభివృద్ధిని వేగవంతం చేసింది. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేస్తుంది. కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేసే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టడంతో పాటు అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళ్లుతుంది.

ప్రతి గ్రామానికి నెలకు రూ.339 కోట్లు ఇచ్చినట్లుగానే ప్రతిపట్టణానికి నిధులను ప్రభుత్వం కేటాయించనుంది. నూతన మున్సిపాలిటీ చట్టాన్ని అమలుచేసే బాధ్యతకూడా నాపైనే ఉండటంతో ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందిస్తున్నాము. కొత్తాగా గెలిచి వచ్చిన ప్రజాప్రతినిధులకు పార్టీ విభేదాలు లేకుండా అందరికీ కొత్తమున్సిపాలిటీ చట్టంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తుంది. శిక్షణ అనంతరం సరిగ్గా విధులు నిర్వహించని ప్రజాప్రతినిధులను తొలిగిస్తాము. అయితే ఈ విధానం మొదట టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల నుంచే ప్రారంభిస్తాము. అధికారులుకూడా పారదర్శకంగా పని చేయని పక్షంలో విధులనుంచి తొలగించే అధికారాలుకూడా నూతన మున్సిపాలిటీ చట్టం పరిధిలో ఉన్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం మరో నాలుగు సంవత్సరాల వరకు ఎన్నికలు లేవు పూర్తి సమయం అభివృద్ధి,సంక్షేమంకోసం మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తుంది.

తెలంగాణ ప్రజలకు టిఆర్‌ఎస్ ఎ టీం
టిఆర్‌ఎస్ ఏరాజకీయ పార్టీకి బిటీం కాదు. టిఆర్‌ఎస్ దరిదాపుల్లో ఏ రాజకీయ పార్టీ లేదు. టిఆర్‌ఎస్ పార్టీ కేంద్రంగానే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. బిజెపి , కాంగ్రెస్ విమర్శలు ఈ విషయానికి దర్పణం పడుతున్నాయి. గత శాసన సభ ఎన్నికల్లో 104 స్థానాల్లో బిజెపి డిపాజిట్లు కోల్పొయింది. ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికంటే తక్కువ ఓట్లను బిజెపికి రావడంతో డిపాజిట్ గల్లంతైంది. అయితే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాప్రత్యర్థి అయినప్పటికీ ఆపార్టీ టిఆర్‌ఎస్ దరిదాపుల్లో లేదు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కారుజోరుగు పరుగులు తీస్తుందని ఎవరిని అడిగినా చెపుతారు.

మీరు ప్రచారానికి ఎందుకు వెళ్లడం లేదు?
మున్సిపాలిటీ ఎన్నికలు టిఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మరోసారి స్పష్టం చేస్తున్నాను. స్థానికంగా అనేక సమస్యలు ఉంటాయి. ఆసమస్యలపై స్థానిక శాసనసభ్యులు,పోటీలో ఉన్న టిఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక శాసనసభ్యులకు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకే అత్యధిక బాధ్యతలను టిఆర్‌ఎస్ అధిష్ఠానం అప్పగించింది. ఆమేరకు ప్రచారం ముందుకు సాగుతుంది. టిఆర్‌ఎస్ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఓటు అడుగుతున్నారు. ప్రభుత్వం పనితీరు బాగుంది. ప్రజలు టిఆర్‌ఎస్ పక్షాన ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికంగా ఎన్నికల ప్రచారం ఎందకని నేను ప్రచారానికి వెళ్లడంలేదు.

అయితే సిరిసిల్ల శాసన సభ్యుడిగా సిరిసిల్ల నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాను. అలాగే టిఆర్‌ఎస్ శాసనసభ్యులు, ఇన్‌ఛార్జీలు వారిగి బాధ్యతల ఇచ్చిన నియోజకవర్గాల్లోనే ప్రచారం చేస్తున్నారు. ప్రజలు టిఆర్‌ఎస్‌ను, సిఎం కెసిఆర్‌ను ఆశీర్వదించి టిఆర్‌ఎస్ కారుగుర్తునే గెలిపిస్తారనే నమ్మకం ఉంది. ఆర్భాటాలు, టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ స్థిరమైన,దృఢమైన, పరిపాలనాదక్షుడైన నాయకుడని ప్రజలందరికీ తెలుసు, సిఎం చేస్తున్న ఆభివృద్ధి ప్రత్యేక్షంగా అగుపిస్తుంది ఆ నమ్మకంతోనే మున్సిపాలిటీ ఎన్నికల్లో అఖండవిజయం సాధిస్తామనే నమ్మకం ఉందని కెటిఆర్ చెప్పారు.

రెబల్స్ బెడద టిఆర్‌ఎస్‌లో ఉన్నది వాస్తవమా?
రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన టిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు అత్యధికంగా నాయకులు ముందుకు వచ్చారు. ప్రతివార్డునుంచి సుమారు 5 నుంచి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు టిఆర్‌ఎస్ బిఫాం పొందిన అభ్యర్థి మినహా అందరూ నామినేషన్ల ఉపసంహరించుకుని టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. దాదాపు 90 శాతం ఆశావాహులు క్రమశిక్షణతో పక్కకు తప్పుకున్నారు. వారికి భవిష్యత్‌లో పార్టీ పరంగా మంచి అవకాశాలు వస్తాయి.

అయితే కొల్లాపూర్‌లో తిరుగు బాటు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిసింది. అతి తక్కువ సమయంలో ఆసమస్యకూడా పరిష్కారం అవుంది. బిజెపి కాంగ్రెస్ పార్టీ నుంచి బిఫారాలు కూడా తీసుకోవడానికి అనేక మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో వారికి బిజెపి ఎదురు డబ్బులు ఇచ్చి పోటీలో నిలుపుతుండటం రాజకీయదివాళుకోరుతనంగా భావించవచ్చు. అలాగే నిజమాబాద్, కరీంనగర్,వేములవాడ, జగిత్యాల,నిర్మల్, కోరుట్లలో టిఆర్‌ఎస్ నుంచి బిఫారం దక్కని వారిని బిజెపి,కాంగ్రెస్ తమ అభ్యర్థలుగా ప్రకటించుకుంటుందన్నారు. అయితే ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తూ పోలింగ్ రోజు తగిన గుణపాఠం నేర్పనున్నారు.

హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిని తగ్గించే ఆలోచనలు ఉన్నాయా?
అతిపెద్దదైన హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధి తగ్గిస్తే ప్రజలకు మరింతగా సేవలు అందుబాటులో ఉంటాయనేది నావ్యక్తిగత అభిప్రాయం. ఈ అభిప్రాయానికి ప్రభుత్వ మోదం లేదు. కొత్తజిల్లాలు,కొత్తమున్సిపాలిటీలు, కొత్త కార్పొరేషన్ల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. అలాగే హైదరాబాద్ శివార్లను ఆనుకుని ఉన్న మున్సిపాలిటీలను విడగొడితే సేవలు వేగవంతం అవుతాయనేది నావ్యక్తి గతం. దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టితో ఆప్రభావం రాష్ట్రంపై అధికంగా పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలనేదే టిఆర్‌ఎస్ ప్రభుత్వ విదానమనం ఆమేరకు ప్రభుత్వం నిరంతకృషి చేస్తోంది.

Manatelangana Interview with KTR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News