Monday, April 29, 2024

మారెను స్టైలే

- Advertisement -
- Advertisement -

Municipal elections

 

పురపోరులో సోషల్ మీడియా వేదికగా హైటెక్ ప్రచారం

లోకల్‌గా వాట్సాప్ గ్రూప్‌లు.. ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతున్న అభ్యర్థులు
సోషల్ ప్రచారంపై నిఘా ఉంచిన రాష్ట్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచార స్టైల్‌ను మార్చాయి. పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు అదే స్థాయిలో హైటెక్ ప్రచారబాట పట్టాయి. ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు శాఖలు పర్యవేక్షణ చేస్తున్నాయి. కించపరిచే విధంగా, అల్లర్లు సృష్టించే విధంగా పోస్టులు పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్‌ఇసి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నేతలకు పెద్దగా పని ఉండదు. అంతా లోకల్‌గా వ్యవహారాలు చక్కబెట్టాలి. దీంతో ఇప్పుడు ప్రధాన పార్టీలు టెక్నాలజీని వాడుతున్నాయి. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీలు కొత్త ప్రచార ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నాయి. ఇన్నా ళ్లు రోడ్‌షోలు, సభలతో అదరగొట్టిన నేత లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచా రం మొదలుపెట్టారు.

టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఇప్పటికే తెలంగాణలో అన్ని చానళ్లు, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల వేళ టిఆర్‌ఎస్‌లో జోష్ నింపారు. పార్టీ పరంగా ఎలా ముందుకు వెళతామో స్పష్టం చేశారు. అదే సమయంలో అభ్యర్థులతో నేరుగా టెలికాన్ఫరెన్సు నిర్వహించి, ప్రచారం ఎలా చేయాలో పలు సూచనలు చేశారు. ఇటు కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేస్‌బుక్ లైవ్‌లో కార్యకర్తలతో మాట్లాడారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా నేతలకు ప్రచారంలో తీసుకున్న జాగ్రత్తలను సూచించారు. ఇక బిజెపి నేతలు మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓట్ ఫర్ బిజెపి అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా రామమందిరం నిర్మాణం, కశ్మీర్ సంబంధితమైనవి ఉన్నాయి.

పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా లోకల్‌గా నలుగురు, ఐదుగురితో కూడిన ఒక యువ టీమ్‌ను ఏర్పాటు చేసుకుని నేరుగా ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వార్డులోని ఓటర్ల ఫోన్ నెంబర్లు సేకరించి వారికి నేరుగా మ్యానిఫెస్టో, అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ విషయాలను చేరవేసి ఓట్లు అడుగుతున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ స్టేటస్‌లు క్రియేట్ చేసి లోకల్‌గా వైరల్ చేస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియాకు అదే స్థాయిలో సమయం ఇస్తున్నారు. ఫేస్‌బుక్ లైవ్ వంటి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. పట్టణ ఓటర్లలో టెక్నాలజీ వాడేవారు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఈ పంథాను ఎంచుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఏర్పాటు క్రమంలో కొన్ని దగ్గరి గ్రామాలను విలీనం చేసింది. అక్కడి ఓటర్లను మాత్రం నేరుగా కలిసి మద్యం, డబ్బు పంపిణీ చేపడుతూ అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

Campaign as social media platform in Municipal elections
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News