Thursday, May 9, 2024

రేపే సారలమ్మ ఆగమనం

- Advertisement -
- Advertisement -

Medaram jatara

 

దండకారణ్యం నుంచి కదిలిన ఆదివాసీలు, మేడారంలో
భారీ ఏర్పాట్లు

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : మేడారం మహాజాతర మొదటి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు సాయంత్రం 7 గంటలకు సమ్మక్క కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోనుంది. ఆమెతో పాటు సమ్మక్క చెల్లి నాగులమ్మ భర్త పగిడిద్దరాజు, సారలమ్మ భర్త గోవిందరాజులు, సమ్మక్క కొడుకు జంపన్నలు వేర్వేరు ప్రాంతాల నుంచి అదే సమయానికి గద్దెలకు చేరుకోనున్నారు. ఈ మహా ఘట్టానికి సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. మేడారం జాతర మహాఘట్టాన్ని పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయపద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు వారాలుగా ఆదివాసీ పూజారులు నిష్టతో ఆ తల్లుల మహిమానిత్వంలోనే ఉండిపోయారు. 5న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు తల్లి సమ్మక్క మినహా మిగిలిన కుటుంబసభ్యులందరిని ముస్తాబు చేసి తోడ్కోని రావడానికి ఆ ప్రాంతాల్లోని గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి నేడు అక్కడి నుంచి మేడారానికి పయనం కానున్నారు.

సారలమ్మ మాత్రం బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుంచి తన ప్రయాణాన్ని మేడారానికి మొదలు పెడుతుంది. సారలమ్మ ఆగమనంలో దారి పొడవునా వేలాది మంది భక్తులు శరణు కోరుతూ ఆమెకు పొర్లుదండాలు పెడుతుంటారు. స్థానిక ప్రాంత వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా సారలమ్మకు ఎదురెళ్లి ఆమె దీవెనలు తీసుకుంటారు. సారలమ్మ ఆగమనం కోసం భక్తజనం ఎదురుచూస్తుంటారు. ఆమె వస్తున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు భారీ భద్రతా వలయాన్ని పోలీస్ యంత్రాంగం చేపడుతుంది. ఈసారి మాత్రం ఇన్‌చార్జ్ కలెక్టర్ కర్ణన్ నేతృత్వంలో పోలీస్ శాఖ పూర్తిస్థాయి భద్రతా చర్యలను ఆదివాసీల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తుంది. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులలో పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతిరాథోడ్‌లు ప్రభుత్వం నుంచి ఇన్‌చార్జ్ మంత్రులుగా జాతరలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇప్పటికే మేడారం అడవులన్నీ జనారణ్యాలుగా మారిపోయాయి. భక్తులకు సంబంధించిన సౌకర్యాలన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తూనే భక్తుల ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. జాతర మొదటి ఘట్టంలో సారలమ్మ వస్తున్న సమయంలో ఎలాంటి అపశ్రుతి జరగకుండా ఉండేందుకు ఇద్దరు మంత్రుల నేతృత్వంలో అన్నిశాఖలను సమన్వయం చేసుకొని తల్లులను ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతర కేంద్రంలో ఇప్పటికే విఐపి, ఇతర వ్యక్తులను విఐపి ద్వారం ద్వారా దర్శనానికి అనుమతించకుండా నిలిపివేశారు. ప్రత్యేక ద్వారాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ తమిళసై వస్తే తప్ప ఈ వివిఐపి గేట్లు తెరవకూడదని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇతర పరపతి కలిగిన వ్యక్తులు ఎవరు వచ్చినా సాధారణ భక్తులు వెళ్లే గ్యాలరీల్లోనే వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. జాతరకు భక్త జనం పోటెత్తుతున్నందున చిన్న చిన్న ఆబ్లికేషన్స్‌తో నిర్వహణ లోపాలు తలెత్తకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సారలమ్మ ఆగమనం బుధవారం రోజు ఉన్నందున రాష్ట్ర మంత్రివర్గం, ఎంపి, ఎంఎల్‌ఎలు మేడారం జాతరలోనే ఉండే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉండగా నేటి నుంచి దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర మంత్రులు కూడా జాతరలోనే ఉండనున్నారు. జాతరకు భక్తులు భారీగా వస్తున్నందున రవాణా సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా పోలీస్ యంత్రాంగాన్ని అన్ని రూట్లలో మొబలైజ్ చేశారు. ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా బస్సులను చేరవేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. సారలమ్మ గద్దెకు వచ్చే రోజు హెలిక్యాప్టర్ల ట్రిప్పులు భారీగా పెరగనున్నాయి.

దండకారణ్యం నుంచి కదిలిన ఆదివాసీలు
ఆసియా ఖండంలోనే కుంభమేళగా కొనసాగుతున్న మేడారం సమ్మక్కసారలమ్మ జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు దండకారణ్యాల్లోని ఆదివాసీలంతా మేడారం బాట పట్టారు. చీమలదండును పోలిన విధంగా మేడారం వైపే బారులు తీరుతున్నారు. సమ్మక్క సారలమ్మల జాతర పూర్తిగా గిరిజన ఆదివాసీ జాతర కావడంతో ఆదివాసీ దండ కారణ్యం మొత్తం ఆదివాసి గూడెలన్ని లన్ని ఖాళీ చేసి తరలివస్తున్నారు. సారలమ్మ సమ్మక్కల ఆగమనానికి ఒక్కరోజే గడువు ఉండడంతో ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మూడు నాలుగు రోజుల జాతరను చూడడానికి చేరుకొని స్థిరపడ్డారు.

మేడారం దేవాలయం ముందు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం సోమవారం క్యూలైన్‌లో వేచి ఉన్నారు. మంగళవారం నాటికి భక్తజనం వందరెట్లు పెరగనుంది. ఇప్పటికే సారలమ్మసమ్మక్కలు గద్దెలకు వచ్చాక దర్శనం చేసుకొని పోవాలన్న ఉద్దేశంతో ఇంటిల్లిపాది మొత్తం ప్రత్యేక వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. మూడురోజుల కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లను చేసుకొని ఉండడం వల్ల సమ్మక్క గద్దెకు వచ్చే వరకు తిరుగు పయనం లేకుండా జాతరలోనే ఉండడం వల్ల భక్తజనం సంఖ్య కోట్లలోకి చేరనుంది.

Medaram jatara start
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News